*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 026*
 కందం:
*బూటకపు వర్తనముఁ గని*
*జూటరి వీడనుచుఁ దప్ప ఁజూతురుగా ! యా*
*బాటను విడి సత్యము మది*
*బాటించి నటించు వాడె నరుడు కుమారా !*
తా:
కుమారా! అబద్దపు మాటలు చెప్పే వారిని, మోసముగా మాట్లాడే వారిని సమాజంలో తప్పు దారిలో నడిచేవారుగా చూస్తారు. ఇలా అబద్దపు దారిలో నడవడం అనే అలవాటు మానుకుని సత్యమును మనసులో ఉంచుకుని నిజాన్ని నమ్మి నడచుకునే వారిని ఉత్తముడు అని సమాజం గుర్తిస్తుంది ....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఈ రోజుల్లో ముఖంపై ఉండే నవ్వు కూడా నటన లేదా తెచ్చి పెట్టకున్నది లేదా అబద్దపు నవ్వు అవడం మనం చూస్తున్నాము. అసలు మనలో ఎంత మంది ఎదుటి వారిని పలుకరించేడప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతున్నాము. మనసులో ఎదో ఒక చెడు భావాన్ని, తక్కువ స్థాయిలో ఆలోచనలను ఉంచుకున్నప్పడు, మనసు కల్మషం తో నిండి పోతుంది. కలుషితమై పోతుంది. ఈ స్థితిలో ముఖంపైన స్వచ్ఛమైన నవ్వు ఎలా వస్తుంది. రాదు. రాలేదు కూడా. చూచే వారికి చాలా తేలికగా తెలిసి పోతుంది, మనం బలవంతంగా, అయిష్టంగా నవ్వు పులుముకుంటున్నాము అని. ఇది అబద్దపు జీవితం. ఇలా జీవించడం వలన మనకి గాని, మన తోటి వారికి గానీ, సుఖం ఉండదు. సంతోషం ఉండదు. అందుకే, మనసును స్వచ్ఛంగా ఉంచుకునే ప్రయత్నం నిరంతరం జరగాలి. స్వచ్ఛంగా ఉండ గలగాలి. అప్పుడే, మన చుట్టూ స్వచ్ఛత తో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. ఆశాజనక దృక్పథం అలవడుతుంది. ఇటువంటి పరిస్థితులు కలిగించ గలిగే అవకాశం మనకు ఆ సర్వేశ్వరుడు కలిగించాలని ...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు