*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 027*
 కందం:
*తనయుడు చెడుగై యుండిన*
*జనకుని తప్పన్న మాట సత్యమెరుగదు గా*
*వున నీ జననీ జనకుల*
*కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా !*
తా:
కుమారా! కొడుకు చెడ్డదారిని తనదిగా చేసుకుని చెడ్డ వాడుగా తిరుగుతూ, చెడ్డవాడని పేరు సంపాదించుకుంటే, ఆ కొడుకు అలా తయారు అవడానికి కారణం వాని తండ్రిదే అనడం సహజమైన విషయమే. అందువలన, నీ తల్లిదండ్రులకు చెడ్డపేరు తెచ్చే పనులు ఏవీ చేయకుండా ఉండు ....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"తోటకూర" సామెత ఉండనే ఉంది కదా! పెద్ద దొంగ గా మారిన తన కొడుకును చూచి బాధ పడుతున్న తల్లి ని చూచిన కొడుకు "అమ్మా, చిన్నతనం లో నేను తోటకూర దొంగిలించి నప్పుడు నువ్వు కోప్పడి, మందలించి ఉంటే, ఈ నాడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాకు మరణ శిక్ష పడేది కాదు, కదా అమ్మా" అని కొడుకు అంటాడు. ఇది పిల్లల పెంపకంలో ఒక వైపు వినిపించే నిజం. మరో వైపు, తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలను విని, ఆ మాటల ప్రకారం నడుచుకునే పిల్లలు ఎంత మంది. వినిపించు కోకుండా పక్కకు వెళ్ళే వారే ఎక్కువ శాతం. కనుక, మన తల్లిదండ్రుల మనసు, మాటలు అర్థం చేసుకుని నడుచుకునే మంచి బుద్ధి ఇమ్మని ...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు