పాపం పడతి (15);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఉదయం లేవగానే  తాను సుచిగా శుభ్రంగా తయారై   కాఫీ తయారు చేసే  ముందు వారి దగ్గరకు వెళ్లి  అత్తయ్య కాఫీ  ఎలా కలపను, పంచదార వెయ్యమంటారా వద్దంటారా  అని అడిగితే అత్త ఎంత ఆనంద పడుతుంది  ఎంతో సంబరంతో నువ్వు ఎలా చేసినా నాకు  ఇష్టమేనమ్మ  అని మీ మామయ్యకు మాత్రం పంచదార వేయవద్దు  ఆయనకు నిషేధం  అనేసరికి, వచ్చిన నవ్వును ఆపుకుని  ఏం మావయ్య నిజమేనా అని అడిగితే  ఆ ముసలి ప్రాణం  ఆనందడోలికలలో ఊగిపోతూ  అలాగే చెపుతుందమ్మ ఆ బ్రహ్మ రాక్షసి  నేను సుఖంగా కాఫీ తాగడం దానికి నచ్చదు  నీవు రాకముందు నాకు చక్కటి కాఫీ ఇచ్చేది  అని తన బాధను వెళ్లగక్కుతాడు  అలా ఆనందంగా ప్రారంభమవుతుంది ఉదయం.
తర్వాత శ్రీవారు స్నానానికి లేచినప్పుడు  వారు వేడి నీళ్లతో స్నానం చేస్తారో చన్నీటి తో స్నానం చేస్తారో తెలియదు  నీరు తోడి దగ్గరుండి ఆయనకు అందించాలో ఆయనే తోడుకుంటారో అర్థం కాదు. ఏం చేయాలో సందిగ్ధంగా ఉన్నప్పుడు  తాను వచ్చి తన కార్యక్రమాలను పూర్తి చేసుకుని వెళ్లే సరికి హాయిగా గాలి పీల్చుకొని  ఉదయం ఆయన పద్ధతి తెలుసుకుంటుంది  తర్వాత వారికి చక్కటి కాఫీ ఇచ్చి  అల్పాహారం మీకు ఏది ఇష్టం ఏం చేయమంటారు అని అడిగితే నన్ను అడగటం ఏంటి  నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి  అంతే తప్ప ఇదేదో బయట ఇల్లు లాగా  నీకు ఏ సంబంధం లేనట్లు ప్రవర్తించ కుంటే అది నీకే మంచిది కాదు  మా అందరి బాధ్యత తీసుకోవలసిన దానివి నీవు  మా ఆరోగ్య రీత్యా  మాకు కావలసినవి చేసి పెట్టు చాలు  అని చెప్పేసరికి ఎంతో తృప్తి పడుతుంది. తన తల్లి చెప్పిన మాట  భోజనానికి ఏ కూరలు చేయాలో  ముందు మీ అత్తగారిని  అడిగి తెలుసుకుని ఆమె ఏది చేయమంటే అదే చేయాలి తప్ప  నీ ఇష్టం వచ్చినట్టు చేయవద్దు అన్న మాట జ్ఞాపకం వచ్చి  అత్తయ్య ఏ కూర చేయను అంటే  కూరగాయలు ఏమున్నాయి అమ్మ అని అడుగుతుంది సౌమ్యంగా. ఫలానా ఫలానా ఉన్నాయి అని చెపితే  దానిలో ఒక దానిని ఎన్నిక చేసి తన తల్లి చేసిన పద్ధతిలో మొదటి రోజు కూర చేస్తుంది అది వీరికి నచ్చుతుందో లేదో అని అనుమానం. ఉప్పు, కారం  తన ఇంట్లో ఉన్నట్లుగా కావాలా లేకుంటే ఎక్కువ తక్కువలు ఉండాలా  అని ఆలోచనతో  వడ్డిస్తూ ఉంటే  ముందు అత్తగారే చెప్తుంది చాలా బాగా చేసావ్ అమ్మ అని  తర్వాత మామ అంటారు  దాని జన్మలో ఎప్పుడూ ఇలా చేయలేదమ్మా అని నూతన దంపతులిద్దరూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ  భోజనాలను ముగిస్తారు.


కామెంట్‌లు