ఉల్లిగడ్డ కథ (పిల్లలు చెప్పే సరదా కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒక ఐస్ క్రీమూ, మిరపకాయా, టమోటా, ఉల్లిగడ్డా వుండేవి. అవి నాలుగూ మంచి స్నేహితులు. ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్ళేవి. కలిసే తిరిగేవి. హాయిగా ఆడతా, పాడతా, ఎగురుతా, దుంకుతా ఆనందంగా వుండేవి. ఒక రోజు నాలుగూ కలిసి స్నానం చేసొద్దామని మధ్యాన్నం తుంగభద్రా నదికి వెళ్ళినాయి. నాలుగూ నీళ్ళలో దూకి సరదాగా ఈత కొట్టసాగినాయి. కానీ పాపం నీళ్ళు తగిలీ తగిలీ ఐస్ క్రీము నీళ్ళలోనే కరిగిపోయింది, మిగతా మూడూ బైటకొచ్చి చూస్తే ఇంకేముంది. ఐస్ క్రీము లేదు. తమ మిత్రుడు చచ్చిపోయినందుకు బాధతో మిరపకాయా, టమోటా, ఉల్లిగడ్డ వెక్కి వెక్కి ఏడ్చినాయి.
ఒకరోజు మిగతా మూడు కొండారెడ్డి బురుజు చూసొద్దామని సరదాగా సాయంకాలం చల్లగాలిలో హుషారుగా షికారుకు బైలుదేరినాయి. అట్లా పోతావుంటే దారిలో బజ్జీలు వేసేటోడు మిరపకాయను చూసి ఠక్కున చేతిలోకి తీసుకోని, సెనగపిండిలో ముంచి సలసల కాగే వేడివేడి నూనెలో వేసేసినాడు. పాపం ఆ మిరపకాయ ఆ వేడికి తట్టుకోలేక అక్కడికక్కడే చచ్చిపోయింది. తమ మిత్రుడు చచ్చిపోయినందుకు బాధతో టమోటా, ఉల్లిగడ్డా వెక్కి వెక్కి ఏడ్చినాయి.
ఒకరోజు టమోటా, ఉల్లిగడ్డా సినిమా చూసొద్దామని ఆనంద్ టాకీసుకు వెళ్ళినాయి. రెండు టికెట్లు కొనుక్కోని కుర్చీలలో కూర్చోని సంబరంగా సినిమా చూడసాగినాయి. అంతలో ఒకడు చీకట్లో చూసుకోక సరిగ్గా టమోటా మీద కూర్చున్నాడు. అంతే పాపం టమోటా కడుపు పగిలి అక్కడికక్కడే చచ్చిపోయింది. తనకు మిగిలిన ఒక్క మిత్రుడూ చచ్చిపోయినందుకు బాధతో ఉల్లిగడ్డ వెక్కివెక్కి ఏడ్చింది.
అలా ఉల్లిగడ్డ ఏడ్చుకుంటా, ఏడ్చుకుంటా పోతా ఐస్ క్రీము చచ్చిపోతే నేనూ, టమోటా, మిరపకాయా ఏడ్చినాం. మిరపకాయ చచ్చిపోతే నేనూ, టమోటా ఏడ్చినాం. టమోటా చచ్చిపోతే నేనొక్కదాన్నే ఏడ్చినా. మరి రేప్పొద్దున నేను చచ్చిపోతే నాకోసం ఎవరు ఏడుస్తారు" అని ఒకచోట కూచోని దిగులుగా బాధ పడసాగింది. 
ఆకాశంలో పోతావున్న పార్వతీ పరమేశ్వరులు అది చూసి "ఏమబ్బా! పాపం ఉల్లిగడ్డ ఒక్కతే కూచోని అంత బాధ పడతావుంది. దానికేం కష్టమొచ్చిందో, ఏమో" అని రివ్వున కిందకు దిగినారు. “ఉల్లిగడ్డా! ఉల్లిగడ్డా! ఎందుకే అట్లా ఏడుస్తా వున్నావ్. ఏంది నీ బాధ" అన్నారు. దానికి ఉల్లిగడ్డ కళ్ళెమ్మట నీళ్ళు కారిపోతావుంటే వెక్కి వెక్కి ఏడుస్తా “ఏముంది సామీ! ఐస్ క్రీము చచ్చిపోతే నేనూ, టమోటా, మిరపకాయ ఏడ్చినాం. మిరపకాయ చచ్చిపోతే నేనూ, టమోటా ఏడ్చినాం. టమోటా చచ్చిపోతే నేనొక్కన్నే ఏడ్చినా. మరి రేప్పొద్దున నేను చచ్చిపోతే నాకోసం ఎవరు ఏడుస్తారు. నాకెవరూ లేరే" అనింది బాధగా. అది విన్న పరమేశ్వరుడు "అయ్యో పాపం!" అని జాలిపడి “నువ్వేమీ బాధపడకు. ఇప్పటి నుంచీ ఎవరైతే నిన్ను చంపుతారో వాళ్ళే నీ కోసం ఏడ్చేలా వరం ఇస్తున్నా పో" అన్నాడు. అంతే... ఆరోజు నుండీ ఉల్లిగడ్డను ఎవరు కోసినా వాళ్ళ కళ్ళ నుండే బాధతో నీళ్ళు కారడం మొదలైంది. 
ఎలావుంది మిత్రులారా పిల్లలు చెప్పుకునే ఈ సరదా కథ.
***********
కామెంట్‌లు