ఒకటి తిందునా.... రెండు తిందునా... (దయ్యాల జానపద హాస్య కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో రామయ్యని ఒకడుండేటోడు. వాడు చానా అమాయకుడు. అంతేగాదు చానా బీదోడు కూడా. చానాసార్లు తినడానికి తిండి గూడా లేక ఉత్తనీళ్ళు తాగి పస్తులు పండుకునేటోడు. భార్యాపిల్లలకు కనీసం ఒక్క పూటైనా తిండి పెట్టలేక పోయేటోడు. దాంతో బాగా విసిగిపోయి ఎలాగైనా సరే డబ్బు సంపాదిచ్చుకోని రావాలని ఒకరోజు పెండ్లాంతో మూడు రొట్టెలు చేపిచ్చుకోని, దాన్లను మూటగట్టుకోని బైలుదేరినాడు.
అట్లా పోతా పోతా పక్కూరికి చేరుకున్నాడు. అక్కడ వానికి సోమయ్యని చిన్ననాటి స్నేహితుడొకడు వున్నాడు. సోమయ్య చూడ్డానికి మంచిగా కనపడతాడు గానీ పెద్ద టక్కరోడు. మాయమాటలతో అందరినీ బోల్తా కొట్టించేవాడు. వాడు స్నేహితున్ని చూడగానే “ఏరా... యాడికి బైలుదేరినావు" అనడిగినాడు. దానికి వాడు కళ్ళనీళ్ళు బెట్టుకోని ఇంటి నంగతంతా చెప్పి “ఎట్లాగైనా సరే... డబ్బు సంపాదిచ్చుకోని రావాలని పోతావున్నా" అన్నాడు. దానికి సోమయ్య “అట్లాగా... సరే ఈ పూట మాయింట్లోనే పండుకోని రేప్పొద్దున్నే పో" అన్నాడు.
రామయ్య ఆరోజు రాత్రి ఆన్నే పండుకోని తర్వాత రోజు పొద్దున్నే మళ్ళా బైలుదేరినాడు. 
కొండలు, వాగులు, గుట్టలు, అడవులు ఒకొక్కటే దాటుకుంటా అర్ధరాత్రి వరకు నడిచినాడు. బాగా నడిచినాడు కదా దాంతో కడుపులో వున్నదంతా అరిగిపోయి బాగా ఆకలేయసాగింది. దారిలో ఒక పెద్ద మర్రిచెట్టు కనబడితే తిని పండుకుందామని దాని కిందికి చేరుకున్నాడు.
ఆ మర్రిచెట్టుపైన మూడు దయ్యం పిల్లలున్నాయి. అవి ఒట్టి పిరికివి. వూకె చిన్న చిన్న దాండ్లకే భయపడి వణికి పోతుంటాయి. రామయ్యని చూసి “ఎవడబ్బా... వీడింత అర్దరాత్రి పూట ఒక్కడే వచ్చి మన చెట్టు కింద కూర్చున్నాడు. కొంపదీసి మంత్ర తంత్రాలు బాగా తెలిసిన మాంత్రికుడు కాదు గదా" అని అనుమానంగా చూడసాగినాయి. అంతలో రామయ్య మూట విప్పి మూడు రొట్టెలు ముందు పెట్టుకోని వాటినే చూస్తా సరదాగా “ఒకటి తిందునా... రెండు తిందునా... మూడు తిందునా... లేక మొత్తం ఒకేసారి దిగమింగుదునా" అంటూ గట్టిగా ఒక్కరుపు అరిచినాడు.
అంతే... ఆ అరుపు వినేసరికి పైనున్న మూడుదయ్యాలు అదిరిపడినాయి. అవి ఒట్టి పిరికివి కదా... దాంతో భయపడి "వీడు మామూలు మనిషి కాదు. పెద్ద మంత్రగానిలెక్క వున్నాడు. అందుకే ఇంత అర్దరాత్రి పూట మనల్ని చంపడానికి ఒక్కడే వచ్చినాడు" అనుకోని గజగజా వణికిపోతా దభీమని వాని కాళ్ళ మీద పడి "మమ్మల్నేం చేయొద్దు. నువ్వేం కావాలంటే అవిస్తాం. మమ్మల్ని విడిచిపెట్టు" అని ఏడ్వసాగినాయి. దయ్యాలను చూసేసరికి రామయ్యక్కూడా భయమేసి గజగజా వణికిపోయినాడు. కానీ... అవి కాళ్ళు పట్టుకోని ఏడుస్తా వున్నాయి గదా... దాంతో లేని ధైర్యం తెచ్చుకోని వాటిని కోపంగా చూస్తా "నాకు బాగా డబ్బు కావాల. వెంటనే తెచ్చియ్యండి. లేకపోతే మీ ముగ్గుర్నీ ఇక్కడికక్కడే గుటుక్కున మింగేస్తా" అన్నాడు.
అవి సరేనని వెంటనే ఆన్నించి మాయమై క్షణాల్లో ఒక ఆవుతో తిరిగి ప్రత్యక్షమైనాయి. ఆ ఆవును వానికిస్తా "ఇది మామూలు ఆవు కాదు. ఇది పెండేస్తే దాని లోపల వజ్రాలు, రత్నాలు, బంగారు వరహాలు వుంటాయి. దీన్ని తీస్కోని మమ్మల్ని విడిచిపెట్టు" అన్నాయి. వాడు సరేనని ఆవును తీసుకోని తిరిగి ఊరికి బయలుదేరినాడు. అలా మళ్ళా కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఒకొక్కటే దాటుకుంటూ... దాటుకుంటూ.. రాత్రయ్యేసరికి వాని స్నేహితుని ఊరు చేరుకున్నాడు. సోమయ్య రామయ్యని చూస్తూనే “రా... రా... నీ కోసమే ఎదురుచూస్తా వున్నా... నువ్వు పోయిన పనేమైంది" అనడిగినాడు. వాడు సంబరంగా జరిగిందంతా చెప్పినాడు. “అలాగా! ఐతే ఇన్నాళ్ళకు నీ కష్టాలు తీరిపోయినాయన్న మాట. సరే ఇంత రాత్రిపూట మీ ఊరికి ఏం పోతావుగానీ ఈ రోజు ఈన్నే పండుకోని రేప్పొద్దున్నే పో" అంటూ వానికి బాగా మంచి మంచి పిండివంటలు చేపిచ్చి పెట్టినాడు. వాడవన్నీ బాగా తిని హాయిగా నిద్రపోయినాడు.
రామయ్య అట్లా నిద్రపోయినాడో లేదో... దాని కోసమే కాసుకోనున్న సోమయ్య వెంటనే పెరట్లోకి పోయినాడు. అప్పటికే ఆ ఆవు బాగా పెండేసింది. చూస్తే ఇంగేముంది దాన్నిండా బంగారం, వరహాలు, వజ్రాలు, రత్నాలు ధగధగా మెరిసిపోతా కనబన్నాయి. వెంటనే సోమయ్య దాన్ని తోల్కోనిపోయి ఎవరికీ కనబడకుండా దాచిపెట్టి, అచ్చం అట్లాగే వున్న మరొక ఆవును తీస్కోవొచ్చి అక్కడ కట్టేసి ఏమీ ఎరుగని అమాయకుని లెక్క మట్టసంగా నిద్రపోయినాడు.
పొద్దున్నే రామయ్య నిద్ర లేచి పోయొస్తానని స్నేహితునికి చెప్పి ఆవును తోల్కోని ఇంటికి పోయినాడు. పెళ్ళాన్ని పిలిచి "ఒసేవ్.. ఇది మామూలు ఆవుగాదు. పెండేస్తే దాన్నిండా రత్నాలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు వుంటాయి. దీనికి బాగా మేతేసి మేపు. ఇక మన కష్టాలన్నీ తీరినట్లే" అన్నాడు. “అట్లాగే" అని ఆమె దానికి బాగా మేతేసింది. తర్వాత రోజు పొద్దున్నే ఆవు గంప నిండా పెండేసింది. రామయ్య సంబరంగా బెరటెరా
పెండంతా వెదికినాడు. అది అసలావు కాదు గదా. అందుకే వానికి ఎంత వెదికినా ఏమీ దొరకలేదు. దానితో వాడు దయ్యాలే తనని మోసం చేసినాయనుకోని కోపంగా మళ్ళా మూడు రొట్టెలు మూట కట్టిచ్చుకోని నడుస్తా నడుస్తా కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఒకొక్కటే దాటుకుంటా... దాటుకుంటా... అర్ధరాత్రయ్యేసరికి ఆ మర్రిచెట్టు కిందికి చేరుకున్నాడు. దయ్యాలు వాన్ని పైనుండి చూసి “ఇదేందబ్బా... వీడు మళ్ళా వచ్చినాడు" అనుకోని భయపడతా వుంటే అంతలో వాడు గట్టిగా "ఒకటి తిందునా... రెండు తిందునా... మూడు తిందునా... లేక మూడింటినీ ఒకేసారి దిగమింగుదునా" అంటూ ఒక్కరుపు అరిచినాడు. అంతే... అవి మూడు గజగజ వణికిపోతా కిందికి వచ్చి "నువ్వు కోరుకున్నట్టే నీకు ఆవు ఇస్తిమి గదా. ఎందుకు మళ్ళా వచ్చినావ్" అనడిగినాయి. దానికి వాడు కోపంగా "నన్నే మోసం చేస్తారా... ఆ ఆవు పేడలో బంగారు హారాలు కాదు కదా కనీసం గులక రాళ్లు కూడా లేవు" అన్నాడు. దాంతో ఆ మూడు దయ్యాలూ "యాడనో... ఏదో... పొరపాటు జరిగినట్లుంది. ఈ ఒక్కసారికి మన్నించు” అంటూ అన్నించి మాయమై క్షణాల్లో ఈసారి ఒక విసుర్రాయితో తిరిగి ప్రత్యక్షమై "ఇది మామూలు విసుర్రాయి కాదు. దీన్ని తిప్పుతా వుంటే నువ్వేమి కోరుకుంటే అవి దీన్లోంచి బైటకొస్తాయి. ఇది తీస్కోని మమ్మల్ని వదిలెయ్" అని ప్రాధేయపడినాయి. వాడు సరేనని దాన్ని తీసుకోని కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, ఒకొక్కటే... దాటుకుంటా రాత్రయ్యేసరికి వాని స్నేహితుని ఊరికి చేరుకున్నాడు.
రామయ్యను చూస్తానే సోమయ్య "దా... దా... ఏమి ఇట్లా వచ్చినావు" అనడిగినాడు. వాడమాయకంగా జరిగిందంతా చెప్పినాడు. "అట్లాగా.... ఐతే ఆ దయ్యాలు నిన్ను మోసం చేసినాయన్నమాట... సరేలే ఏమైతేనేం ఇప్పటికన్నా నీ కష్టాలు తీరినాయి. అదే చాలు. ఈరోజు ఈన్నే పండుకోని రేప్పొద్దున్నే పో" అంటూ వానికి బాగా మంచి మంచి పిండివంటలు చేపిచ్చి పెట్టినాడు. వాడవన్నీ బాగా తిన్నాడు. సోమయ్యే అసలు దొంగ అని వానికి తెలీదు కదా... అందుకని హాయిగా నిద్రపోయినాడు.
వాడట్లా నిద్రపోయినాడో లేదో... దాని కోసమే కాసుకోనున్న సోమయ్య వెంటనే లేచి ఆ విసుర్రాయి దగ్గరకు పోయి 'నాకు బంగారం కావాల' అంటూ తిప్పసాగినాడు. అంతే కుప్పలు కుప్పలు బంగారం దాంట్లోంచి రాసాగింది. అది చూసి వాడు సంబరపడి ఎట్లాగైనా సరే దాన్ని కొట్టేయాలనుకోని ఎవరికీ కనబడకుండా దాన్ని దాచిపెట్టి అచ్చం అట్లాగే వున్న మరొక విసుర్రాయిని తీసుకోనొచ్చి అక్కడ పెట్టి, ఎమీ ఎరుగని అమాయకునిలెక్క మట్టసంగా నిద్రపోయినాడు.
పొద్దున్నే రామయ్య నిద్ర లేచి పోయిస్తానని స్నేహితునికి చెప్పి విసుర్రాయిని తీసుకోని ఇంటికి పోయినాడు. పెళ్ళాన్ని పిల్చి “ఒసేవ్... ఇది మామూలు విసుర్రాయి కాదు. దీన్ని తిప్పుతా మనం ఏం కోరుకుంటే అవి వస్తాయి చూడు" అంటూ ఆమెను కూచోబెట్టుకోని "నాకు వజ్రాలు కావాల... రత్నాలు కావాల" అంటూ తిప్పసాగినాడు. అది దయ్యాలిచ్చిన విసుర్రాయి కాదు కదా... దాంతో తిప్పీ తిప్పీ చేతులు నొప్పి పెట్టినాయే గానీ దాంట్లోంచి ఏమీ రాలేదు. దాంతో వాడు మళ్ళా దయ్యాలు మోసం చేసినాయనుకోని “ఈసారి దాన్ల అంతు చూసొస్తా" అంటూ కోపంగా మూడు రొట్టెలు మూటగట్టించుకోని నడుస్తా నడుస్తా అర్ధరాత్రికంతా మళ్ళా ఆ మర్రిచెట్టు కిందికి చేరుకున్నాడు.
చెట్టు మీదున్న దయ్యం పిల్లలు వాడు మళ్ళా వచ్చేసరికి అదిరిపడినాయి. "అదేందిరా వీడిట్లో మళ్ళా మళ్ళా వస్తా వున్నాడు. మనల్ని హాయిగా బతకనిచ్చేటట్లు లేడే" అనుకొన్నాయి. అంతలో వాడు చెట్టు కింద కూచోని “ఒకటి తిందునా... రెండు తిందునా... మూడు తిందునా... లేక మూడింటినీ ఒకేసారి దిగమింగుదునా" అంటూ గట్టిగా ఒక్కరుపు అరిచినాడు. అంతే ఆ మూడూ భయంతో గజగజా వణుకుతా కిందికి దిగొచ్చి "నీవు అడిగిందల్లా ఇచ్చినాము గదా.. మళ్ళా ఎందుకొచ్చినావు" అనడిగినాయి. దానికి వాడు కోపంగా “మీకు నేను ఏమీ తెలీని ఎర్రోనిలెక్క కనబడతా వున్నానా... మాటిమాటికీ మోసం చేస్తావున్నారు. ఆ పనికిమాలిన విసుర్రాయి ఎంత తిప్పినా వజ్రాలు కాదుగదా కనీసం కంకర రాళ్లు గూడా రావడం లేదు. ఈసారి గనుక మోసం చేసినారనుకో మిమ్మల్ని చంపకుండా వదలను" ఇన్నాడు.
అప్పుడా మూడు దయ్యాలు బాగా ఆలోచించి “ఎక్కడో ఏదో మోసం జరుగుతా వుంది" అనుకోని ఈసారి ఒక మంచి దుడ్డుకర్ర తెచ్చి "ఇది నీ మాట తప్ప ఎవరి మాటా వినదు. నువ్వేం కోరుకుంటే అది తెచ్చిస్తాది. దీన్ని తీస్కోనిపో" అన్నాయి.
వాడు ఆ దుడ్డుకర్ర తీసుకోని కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఒకొక్కటే దాటుకుంటా... దాటుకుంటా... రాత్రయ్యేసరికి వాని స్నేహితుని ఊరికి చేరుకున్నాడు.
రామయ్యను చూస్తానే సోమయ్య “దా... దా... ఏమి మళ్ళా ఇట్లా వచ్చినావు" అనడిగినాడు. దానికి రామయ్య “ఆ దొంగసచ్చినేవి మళ్ళా మోసం చేసినాయి" అంటూ జరిగిందంతా చెప్పినాడు. అంతా విన్న సోమయ్య “సర్లే.... ఐపోయిందేదో ఐపోయింది. ఇప్పట్నించన్నా నీ కష్టాలు గట్టెక్కుతే అదే చాలు. ఇంత రాత్రి ఏం పోతావు గానీ ఈన్నే పండుకోని రేప్పొద్దున పో" అన్నాడు. సోమయ్య మోసగాడని వానికి తెలీదు గదా అందుకే సరేనని వాడు పెట్టినవన్నీ బాగా తిని హాయిగా నిద్రపోయినాడు.
వాడట్లా నిద్రపోయినాడో లేదో... దాని కోసమే కాసుకోనున్న సోమయ్య వెంటనే లేచి ఆ దుడ్డుకర్ర తీసుకోని “నాకు వజ్రాలు కావాల.... రత్నాలు కావాల" అంటూ గాల్లో తిప్పసాగినాడు. అంతే... అది రామయ్య మాట తప్ప ఎవరి మాటా వినదు గదా... అందుకే వెంటనే ఒక్కసారిగా గాల్లోకెగిరి వాన్ని కిందా మీదా పడేసి దభీదభీమని తన్నసాగింది. ఆ దెబ్బలకు తట్టుకోలేక వాడు. “అమ్మో... నాయనో..." అని అరుస్తా వుంటే రామయ్య ఆ అరుపులకు అదిరిపడి నిద్రలేసినాడు. చూస్తే ఇంగేముంది... దుడ్డుకర్ర సోమయ్యను తన్నినచోట తన్నకుండా పొర్లిచ్చి పొర్లిచ్చి తంతా వుంది.
సోమయ్య కిందా మీదా పడతా వచ్చి రామయ్య కాళ్ళు పట్టుకోని ఏడుస్తా “మిత్రమా... నన్ను మన్నించు. నీ ఆవు, విసుర్రాయి నేనే కొట్టేసినా. తప్పయిపోయింది. దీన్ని ఆగమని చెప్పు. నా ప్రాణాలు పోయేటట్లున్నాయి" అన్నాడు. అప్పుడు రామయ్య “ఆగు" అంటూనే దుడ్డుకర్ర ఆగిపోయింది. సోమయ్య కుంటుకుంటా పోయి ఆవు, విసుర్రాయి మట్టసంగా తెచ్చిచ్చినాడు. రామయ్య అవన్నీ తీస్కోని సంబరంగా ఇంటికి చేరుకున్నాడు.
***********
కామెంట్‌లు