సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 మాల్యము...మూల్యము
   *******
సమాజమంటేనే అనేక రకాల కులాలు,మతాలు,తెగల, ప్రజల సముదాయం. వారంతా సౌభ్రాతృత్వం,సమత, మమతా భావనతో మాల్యములో సుమాల వలె ఒదిగి ఉన్నప్పుడే  కుటుంబమైనా ,సమాజమైనా, దేశమైనా ప్రశాంతంగా ఉంటాయి.
"కలిసి ఉంటే కలదు సుఖం" అనే వాక్యం ఎంత అక్షర సత్యమో తెలుసుకుని మసలుకోవాలి.
అప్పుడే మాల్యములోని మానవ సుమాల మానవీయ  పరిమళాలు అంతటా వ్యాపిస్తాయి.
ఇంతకూ మాల్యము అంటే ఏమిటో చూద్దాం..పూలమాల,పుష్పమాలిక, పూదండ,విరిసరము, ప్రతి సరము,మాలకము లాంటి అర్థాలు ఉన్నాయి.
మాల్యములో  పూవుల్లా కలిసిపోయే మనస్తత్వం ఉన్నప్పుడే కుటుంబమైనా,సమాజ మైనా సంతోషంగా ఉండగలదు.
అలా ఉండలేని వేళ అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. శాంతి భద్రతలు లోపించి విద్వేషాలు తలెత్తే ప్రమాదం ఉంది.
అలాంటి పరిస్థితుల్లోనే ఏమి తెలియని అమాయకులు బలవుతూ ఉంటారు.ఎంత మూల్యము చెల్లించినా జరిగిన నష్టాన్ని పూరించుకోలేము.
కాబట్టి చిన్నప్పట్నుంచే మానవతా విలువలను  నేర్పాలి.మంచివారుగా బతికేలా చేయకపోతే భవిష్యత్తులో  సమాజానికి హాని కలిగించే వారుగా తయారయ్యే ప్రమాదం ఉంది.
మరి మూల్యము అంటే ఏమిటో చూద్దాం... ఖరీదు,ధర,వెల, విలువ అనే అర్థాలు ఉన్నాయి.
మానవులుగా మనకు జీవితం ఓ వరం లాంటిది. మూల్యమింతని చెప్పలేనిది, లెక్క కట్టలేనిది.
కాబట్టి అలాంటి అమూల్యమైన జీవితం మాల్యములో వ్యక్తిత్వ సుమంలా గుబాళించేలా చూసుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు