సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 దమము...దమ్మము
   *****
"అడుసు తొక్కనేల కాలు కడుగనేల" అంటుంటారు పెద్దలు."పంకములో పద్మంలా మన ఉనికిని వ్యక్తిత్వాన్ని చాటుకోవాలంటారు విజ్ఞులు". "చెడు అలవాట్ల రొంపిలో దొర్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు" అంటారు హితజ్ఞులు.
 కాబట్టి కర్ధమములో కమలము మాదిరిగా  మనదైన తెలివితేటల తేజస్సుతో విరాజిల్లాలి. అప్పుడే  జాతి మతం కులం, లింగ,వర్ణ బేధం లేకుండా  గుర్తింపు వస్తుంది.
ఈపాటికి అర్థమై వుంటుంది దమము అంటే ఏమిటో...బురద,అడుసు,కర్ధము,ఉమ్మలి, కర్ధమము,జంబాలము,పంకము,పలలము,పలితము,రొంపి,చదుకు,జల కల్కము లాంటి అర్థాలు ఉన్నాయి.
మనసుకు దమమును అంటుకోనీయకుండా దమ్మముతో జీవించాలి.
దమ్మబద్దంగా ఉన్న వారు సమాజంలో మంచి పేరు, గౌరవం తెచ్చుకుంటారు.మనము చేసే దమ్మమే మనల్ని కాపాడుతుంది. ఆత్మ తృప్తి ఆనందం కలుగుతాయి.
దమ్మముగా జీవితాన్ని గడుపుతూ ఎక్కడా దమ్మమునకు విఘాతం కలగకుండా చూడాలి. అన్యాయం జరిగిన వారికి దమ్మము జరిగేలా  భరోసాగా నిలవాలి.
అలాంటి దమ్మము అంటే ఏమిటో చూద్దాం... న్యాయము, ధర్మము,పాడి,నెఱి, నీతి,నేయము,నాయము,దరుమము, తీర్పు, సమంజసముతో పాటు పుణ్యము,పున్నెము,పున్నియము, మేలు,బాగెము, సుకృతము లాంటి అర్థాలు కూడా ఉన్నాయి.
దమముకు దూరంగా ఉండాలి. దమ్మముతో ఎల్లప్పుడూ జీవించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు