*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0218)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
శంభుని రూపం చూచి మేనక విలపించుట - కుమార్తె వివాహం ఆతనితో జరుగ రాదని పట్టు పట్టటం - శ్రీవిష్ణువు, దేవతలు నచ్చ చెప్పడం - సుందర రూపములో ఉన్న శివునికి మాత్రమే తన కాళిని ఇచ్చి వివాహం జరిపిస్తాను అని చెప్పడం.
*నారదా!  ఈశానుని ప్రచ్ఛన్న రూపం చూచి మూర్ఛ పోయి, పరిచారికల సపర్యలతో తేరుకుంది, మేనక. మూర్ఛ నుండి తేరుకున్న మేనకు హృదయవిదారకమైన దుఃఖం ఆవహించింది. వివాహ ప్రస్థావన తిరస్కరించి, నిన్ను, హిమాచలుని తన పుత్రులను కూడా నిందించడం మొదలు పెట్టింది.*
*మేనక తన పక్కనే ఉన్న నిన్ను చూచి, "నారదా! నువు నా కూతురిని శివుని కోసం తపస్సు చేసి ఆ శంభుని భర్తగా పొందమని ఉపదేశం చేసావు. అదివిని నా కూతురు ఉత్తమ మహర్షులకు కూడా సాధ్యం కాని ఘోరమైన తపస్సు చేసి సాధించి ఏమిటి? ఈ కురూపి కోసమా? ఇది నీకు న్యాయం అనిపిస్తోందా? నా అందాల రాశిని, సర్వ శుభ లక్షణ పట్టిని ఈ కాటికాపరికి ధారపోయాలా? ఇది చాలక, నా భర్త హిమవంతునికి హర భక్తి నూరి పోసావు. అతగాడు, శివ ఆరాధనలందు, పూజ చేయడంలో మునిగి తేలి సాధించింది ఏమున్నది? ఈ అనాకారికి కూతురిని ఇవ్వజూపడం తప్ప. అన్ని విధాల అమాయకురాలనైన నన్ను వమోసగించాలని నీకు ఎలా అనిపించింది, నారదా!. సప్తర్షులు, వశిష్ఠుడు, అరుంధతీ, సకల దేవతలు అందరూ కూడా నాకు అపరిమితమైన దుఃఖాన్ని మిగిల్చారు. నా సర్వస్వము దోచుకోబడింది" అని అన్నది.*
*తరువాత, తన గారాల పట్టి, పార్వతిని చూసి దుఃఖం తన్నుకు వస్తుంటే, "ఏమే బంగారు తల్లి, నేను నీకు ఏమి తక్కువ చేసానని నాకు ఇటువంటి శిక్ష వేస్తున్నావు. నువ్వు శివుని భర్తగా పొందాలని తపస్సు చేసి సాధించింది ఏమిటి. ఏమీ లేని ఈ శ్మసానవాసితో ఎలా జీవిస్తావు. కోటి కాంతులిచ్చే సూర్యుని వదలి, మిణుగురుతో సరిపుచ్చుకున్నట్టు, సకల సంపదలు, భోగాలు తమవిగా చేసుకున్న విష్ణువు మొదలుగా గల దేవతలు అందరినీ కాదని ఈ మూడు కన్నుల వాడిని ఎంచుకున్నవే! "సింహమును వదలి నక్కను సేవించినట్టు, బ్రహ్మ విద్యను వదలి కుత్సితమైన కథలు విన్నట్టు" ఉంది నీవు చేసిన పని, కోరిన కోరిక. ఇంత చేసిన నిన్ను చంపి నేను చద్దాము అన్నా, పెంచిన‌ పాపానికి చేతులు రావటల్లేదే! ఏమి చేయాలి నేనిప్పుడు. ఎవరి దగ్గరకు వెళ్ళి మొర బెట్టు కోవాలి." అని మాట్లాడుతూ మేనక మరల స్పృహ తప్పి భూమి మీద పడిపోయింది. మేనకకు దుఃఖం, ఉక్రోషం, బాధ ఎక్కువ అవడం వల్ల తన భర్త హిమాచలుని చూడడానికి కూడా ఇష్టపడ లేదు. ఈ స్థితిలో ఉన్న మేనక దగ్గరకు దేవతలందరూ ఒకరొకరుగా వచ్చారు. అందరికంటే ముందు బ్రహ్మ నైన నేను వచ్చాను, మేనకకు ఓదార్పు చెప్పడానికి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు