*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0220)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
శంభుని రూపం చూచి మేనక విలపించుట - కుమార్తె వివాహం ఆతనితో జరుగ రాదని పట్టు పట్టటం - శ్రీవిష్ణువు, దేవతలు నచ్చ చెప్పడం - సుందర రూపములో ఉన్న శివునికి మాత్రమే తన కాళిని ఇచ్చి వివాహం జరిపిస్తాను అని చెప్పడం.
*నారదా! శివ భగవానుని తో తన వివాహం ఆడానికి అనేక విధాల ప్రయత్నాలు చేస్తున్న తన తల్లితో పార్వతి "అమ్మా! నీవు ఎల్లప్పుడూ ధర్మంను అనుసరించే నడచుకుంటావు కదా. మరి ఇప్పుడు ఇలా చేస్తున్నావు ఏమిటి. ఈ శంకరుడు సకల శుభంకరుడు అని శృతులు, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు చెపుతున్నాయి. ఈ స్వామి కంటే గొప్పవారు ఎవ్వరూ లేరు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలు అందరూ కూడా పరమేశ్వరుడు అయిన శంకరునే సేవిస్తారు. ఇప్పుడు కూడా, ఆ పరమేశ్వరుని సేవకులుగానే దేవతా సమూహం అంతా మన ఇంటికి వచ్చి, శివ కళ్యాణం జరుగుతోంది అని ఉతస్వాలు చేస్తున్నారు. ఇంతకంటే మంచి విషయం మన వంశానికి ఏమి ఉంటుంది. నేను మనో వాక్కాయ కర్మలతో మహాదేవుని భర్తగా నిర్ణయించుకున్నాను. శంభుని కాక వేరొకరిని వివాహమాడను. నీవు శివ భగవానుని తత్వమును తెలుసుకుని, మనస్ఫూర్తిగా నన్ను శివుని కి ఇచ్చి వివాహం జరిపించు. దీనివల్ల, నీవు, మా తండ్రి గారు, మన వంశము, ఈ మానవ జగత్తు కూడా మంచి కీర్తిని పొంది, సుఖ సంతోషాలతో వర్ధిల్లు తాము. ఇక ఇప్పుడు నీ ఇష్ట ప్రకారము ఏమి చేయదలచు కుంటే అదే చేయి." అని చెప్పింది.*
*ఈ విధంగా పార్వతి తల్లికి చెప్పిన మాటలు కూడా మేనక మీద ప్రభావం చూపలేదు. అప్పుడు, బ్రహ్మ నైన నేను, సిద్ధులు కూడా నచ్చజెప్పాము కానీ, మేనక తన హఠము వదలకుండా అందరినీ తూలనాడటం చేస్తూనే ఉంది. అప్పుడు, పరమేశ్వర ప్రియుడు అయిన విష్ణు భగవానుడు మేనకు వద్దకు వచ్చి, "మేనకా దేవి! నీవు స్వయంగా పితరుల మాస పుత్రికవు. నీవే ధర్మానికి రూపం. అటువంటి నీవు, అధర్మం దారిలో ఎలా నడువ గలవు. శంభుడు రూపం లేకపోయినా అనేక రూపాలలో ఉంటారు. ఈయన అతి సౌందర్యరాశి, కురూపి కూడా. నువ్వు చూస్తున్న సప్తర్షులు, వేద వేదాంగాలు, సకల దేవతలు, ఋషులు, బ్రహ్మ, నేను అందరమూ కూడా ఆయన తలంపునుండి ఉద్భవించిన వారమే. పరమశివుని కంటే మహాత్ముడు లేరు. ఈ నాటి వరకు మహేశ్వర రూపాన్ని ఆసాంతం చూచిన వారు, వర్ణించిన వారు ఎవరూ లేరు. అంతటి స్వామి, పార్వతి తపస్సు ఫలితంగా యాచకుడిగా నీ గుమ్మం దగ్గరకు వచ్చారు. ఇంతకన్న భాగ్యం ఏమి వుంటుంది. నీ పట్టుదల విడిచి శివుని పూజ చేసి, శివా శివుల వివాహం జరిపించు" అన్నాడు విష్ణుమూర్తి.*
*విష్ణుమూర్తి మాటలతో కొంత వరకు మెత్తబడిన మనసుతో మేనక, తన ఇంట జరిగిన పూర్వ విషయాలు అన్నీ గుర్తుకు రాగా, "అయ్యో! ఆ పరమేశ్వరుని మాయలో ఇప్పటి వరకూ శివుని దూషించాను. కానీ, విష్ణు దేవా! ఒక్కటి మాత్రము నిజం. గ్రహించండి. శంభుడు, ఈ వికృత రూపము వదలి, అత్యంత సుందరమైన "సుందరేశ్వరుడు"గా వస్తేనే కాళిని ఇస్తాను. ఇది కాక ఎన్ని ఉపాయాలు చేసినా వివాహం జరగని పని " అని దృఢముగా చెప్పి మౌనాన్ని దాల్చింది." ఎంతటి వారినైనా తన మాయా మోహంలో ముంచి తేల్చగల శివమాయకు శతకోటి వందనములు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు