*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0227)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
వివాహానంతరం - వసతి గృహం లో శయనించి - ఉదయం జనావాసానికి బయలుదేరిన సదాశివుడు.
*నారదా! బాగ్యవంతులలో శ్రేష్టడు, ఎంతో చతురత గలవాడు అయిన గిరిరాజు పెండ్లివారి విందుభోజనము కొరకు ఆ ఆవరణ అంతటిని సుందరంగా అలంకరింప చేసాడు. తన కుమారులు మైనాకుడు మొదలైన వారిని పెండ్లి వారి విడిదికి పంపి, భోజనము చేయడానికి శివునితో సహా అందరినీ చేయి పట్టి తీసుకు రమ్మని పంపాడు, హిమాచలుడు. భోజనశాలకు వచ్చిన శివ పరివారానికి, పరమశివునకు, ఎంతో ఆదరముతో వండి తయారు చేసిన శాకపాకములను వడ్డించారు. భోజనానంతరము చేతులు, కాళ్ళు, ముఖము కడుగుకొన్న విష్ణ్వాది దేవతలకు, జాజికాయ మొదలగు సుగంధ ద్రవ్యాలు వేసి తాంబులసేవనము చేయించారు. తృప్తిగా భుక్తాయాసముతో విష్ణ్వాది దేవతలు తమ తమ విడిది గృహాలకు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు.*
*భగవంతుడు అయిన శంభునికి ప్రత్యేక సుదర భవనము ఏర్పాటు చేసాడు విశ్వకర్మ, హిమాచాలని ఆజ్ఞతో. ఆ భవనము, వెలిగించిన రత్నదీపాల కాంతితో, అతిలోక సుందరంగా వెలిగిపోతోంది. మణులు మాణిక్యాలతో తోరణాలు కట్ట బడ్డాయి. ఆ భవనము మహా దివ్యము, అతి విచిత్రము, పరమ మనోహరముగా ఉండి మనసుకు ఆహ్లాదము కలిగిస్తోంది. పరచబడిన రత్న కంబళుల మీద అనేక రకాలైన చిత్రములు గీయ బడ్డాయి. ఆ భవన ప్రాంగణంలో ఒక సుందర, దివ్య వనం కూడా నిర్మించబడింది. ఆ వనము చందనము, అగరు, కలసిన సువాసనలతో నిండిపోయింది. చక్కని మణులు, రత్నములతో అలంకరించబడిన పుష్పశయ్య ఉంది. ఆ భవనంలో, విశ్వకర్మ సృష్టి చేసిన విష్ణు లోకం, బ్రహ్మ లోకం, ఇంద్ర భవనం, కైలాసం ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. ఇంత శోభాయమానంగా ఉన్న భవంతిని చూచి భగవానుడు అయిన శంకరుడు సంతుష్టాంతరంగుడు అయ్యాడు. లీలా శంకరుడు నెమ్మదిగా పుష్పశయ్య మీద నిద్రాదేవి ఒడిలో ఒరిగారు.*
*మరునాడు సూర్యోదయం విష్ణ్వాది దేవతలు అందరూ అర్ఘ్య పాద్యాదులు పూర్తి చేసుకుని, భగవానుడు అయిన ఈశానుని ప్రార్ధించి, వారి దర్శనం కోరుకుంటూ, ధర్ముని శివుని వద్దకు పంపారు. పుష్పశయ్య మీద పవళించి ఉన్న వృషభవాహనుని చూచిన ధర్ముడు, " పరమేశా! పరాకేల. ఉదయాద్రి మీద నుండి అరుణుడు ప్రయాణం మొదలు పెట్టాడు. నీ శరణు కోరిన భక్తలమైన మమ్మల్ని కాపాడడానికి, లేచిరి రండి, స్వామీ! మీకు శుభములు కలగాలి. జనావాసానికి దయచేయండి" అని కీర్తించాడు. ధర్ముని ప్రార్థన విన్న శంభుడు, లీలా నిద్ర నుండి మేల్కొని, "అలాగే వస్తాను. మీరు ముందు నడవండి" అని చెప్పి జనవాసానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు, శంకరులు.*
*నీలకంఠుని జనావాస ప్రయాణం తెలుసుకున్న హిమాచలుని పరివారం ఆయన దగ్గరకు వచ్చి పద్మపాదాలకు నమస్కరించి, మంగళ గీతాలు పాడారు. లోకాచారమును పాటించి శంభుడు ప్రాతఃకాల కృత్యములు పూర్తి చేసారు. తరువాత, వేదమమత్రముల ఘోష సాగుతుండగా, మంగళ వాద్యములు హోరు సలుపుతుండగా, సుస్వరములతో గంధర్వగానం వినిపిస్తుండగా శంభుడు జనావాసానికి చేరుకున్నారు. లోకాచారం పాటించి, మునులకు, దేవర్షులకు, విష్ణుమూర్తి కి, నాకు ప్రణామం చేసారు. మేమందరము ఆ స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేసాము. అన్ని వైపులా ఆనంద సందోహం వెల్లి విరిసింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు