*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 029*
 కందం:
*లోకులు తను ఁగొనియాడు వి*
*వేకి యదియు నిందగాక విననొల్లధు సు*
*శ్లోకుల చరితం బిట్టిది*
*చేకొనవలె నట్టి నడక చిన్ని కుమారా !*
తా:
కుమారా! నీ తోటి వారు నిన్న తిట్టి నప్పుడు / నింద చేసినప్పుడు ఎలా అయితే వినిపించినా కూడా విననట్టు ఉంటావో, ఎవరైనా నిన్ను పొగిడి నప్పుడు కూడా విననట్టుగానే ఉండాలి. సమాజంలో తెలివిగల వారు, మంచి ఆలోచనలు కలవారు ఇలాగే ఉంటారు. నువ్వు కూడా వారి లాగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"దూషణ భూషణాదు లందు సమ భావం కలిగి ఉండాలి" అని గీతా వాక్యం. పొగడ్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, తెగడ్తలకు / విమర్శలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వగలగాలి. ఎవరైనా మనల్ని పొగిడి నప్పుడు సంతోష పడి, విమర్శించగానే బాధపడటం / కుంగిపోవడం చేయకూడదు. పొగిడిన వారితో కలసి మెలసి ఉండటానికి ఇష్టపడతాము మనం. ఎందుకంటే ఆ మాటలు మనకు అప్పటికి సంతోషాన్ని ఇస్తాయి. కానీ, విమర్శకుల మాటలు మనం విని, వారు అలా ఎందుకు అన్నారు అని అలోచించి, అవసరమైన మార్పు మన ఆలోచనలలో, ప్రవర్తనలో చేసుకుంటే, జీవితాంతం సంతోషంగా, సుఖంగా ఉంటాము. అందువల్ల, మనల్ని పొగిడే వారి కంటే, విమర్శకులకే మనం ప్రాధాన్యత ఇవ్వగలగాలి. ఈ విమర్శనాత్మక దృక్పథం మనకందరకు పరమాత్మ ఇవ్వాలని ప్రార్థిస్తూ...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు