*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 031*
 కందం:
*వగవకు గడచిన దానికి*
*పొగడకు దుర్మతుల నెపుడు; పొసగని పనికై*
*యొగి దీనత నొందకుమీ*
*తగ దైవగతిం బొసంగు ధరను కుమారా !*
తా:
కుమారా! ఇంతకు ముందు జరిగిపోయిన విషయాల గురించి బాధపడకు. ఏ రోజూ చెడ్డ పనులు చేసే వారిని, చెడు ఆలోచనలు చేసే వారిని సమర్ధించకు. సాధ్యము కాని, ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని తెలిసిన పని అవలేదు అని చింతించకు, బాధపడకు. ఈ భూమి మీద జరిగే పనులు అన్నీ కూడా పరమేశ్వరుడు అనుకున్నప్పుడే అవుతున్నాయి అని తెలుసుకో....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"గతం గతః", "గతజల సేతు బంధనం" ఈ పదబంధాలు మనం తరచుగా వింటూ ఉంటాము. జరిగిపోయిన విషయం గురించి చింతించడం మానేయాలి అని చెప్పడమే వీటి ఉద్దేశం. ఎందుకంటే, వాటిని ఈ రోజు మనం మార్చి రాయలేము. రేపు ఏమి, ఎలా జరుగుతుంది. ఇది మనకు అసలు తెలియదు. కాబట్టి, ఇది పూర్తిగా మన చేతిలో లేనిది. దీని గురించి ఆలోచించడం వల్ల ఏమాత్రమూ ఉపయోగం ఉండదు. ఇక మిగిలింది, ప్రస్తుతం. అవును, ఇప్పుడు, ఈ క్షణం మాత్రమే మనకు మిగిలింది. ఇప్పుడు కూడా విషయం జరగడం అయ్యే వరకు, ఫలితం తెలియదు. అంతిమంగా, నిన్న, ఇవాళ, రేపు ఎప్పుడూ కూడా పరమేశ్వరుని కోరిక మేరకే ఏ ఒనులైనా జరుగుతాయి అనేది నిర్వివాదమైన అంశం అని తెలుసుకుని, ఒప్పుకునే మనసు మనకు ఇవ్వమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు