నటనకు వ్యాకరణం- బందా గారు (28);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఈ భూమి మీద తమ జీవనాన్ని కొనసాగిస్తున్న ఏ మానవుడూ తన అనుభవాల్లో తప్పు చేయకుండా ఉండడు ఎవరు కూడా కావాలని ఏ దోషము తన నెత్తిన వేసుకొని అవతల వారి మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని వాడు ఏదైనా మాట అన్నప్పుడు ఆ మాటకు మాట బదులుగా చెబుతూ కొన్ని కఠిన పదాలు కూడా వాడవలసి వస్తుంది అందుకే మన పెద్దవారు  అంటారు  నీటికి నాచు తెగులు  మాటకు మాటే తెగులు మాటకు సమాధానంగా సౌమ్యంగా చెప్పవలసిన పరిస్థితిలో చెప్పితే దాని పద్ధతి వేరుగా ఉంటుంది  లేదూ  మితిమీరి కోపాన్ని ఆపుకోలేక  మనసు అదుపుతప్పి అనరాని మాటలు నోటికి వచ్చినప్పుడు దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవించి తీరవలసినదే  ఆ స్థితి రాకుండా తల్లిదండ్రులు గురువులు చూడాలి.
నేను ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగంలో చేరినప్పుడు నా వయసు పందొమ్మిది సంవత్సరాలు  లోకజ్ఞానం తెలియని పరిస్థితి  పూర్తి యవ్వనంలో ఉండి  అహంకారంతో ప్రవర్తించే వయస్సు ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో తెలియదు  అవతలి వారి స్థాయి తెలుసుకునే  వయసు కాదు  అధికారులు కూడా ఎవరి అధికారం ఏమిటో ఎవరు పై అధికారో ఎవరో అప్పటికి పూర్తి వివరాలు తెలియవు.  వారిలో ఎవరినైనా ఏక వచన ప్రయోగం చేసినా ఏదైనా వాడరాని మాట వాడినా నన్ను ఏమీ అనేవాడు కాదు తిన్నగా గురువుగార్లు నండూరి సుబ్బారావు బందా దగ్గరకు వెళ్లి ఏమిటి శిష్యుడిని ఇలా తయారు చేస్తున్నారు ఎలా మాట్లాడాలో కూడా చెప్పకపోతే ఎలా అని వారిని హెచ్చరించేవారు. గురువుగారు కూడా వచ్చి ఇలా జరిగింది అన్న విషయాన్ని నాతో చెప్పకుండా నేను ఏ తప్పు చేశాను అని వారు అనుకున్నారో ఆ తప్పు తాను చేసి చూపి నా తప్పు నాకు తెలియ చేసేవారు.
గురువుగారి జీవించినంత కాలం  నన్ను నా ప్రవర్తన గురించి ఒక్క మాట అని ఎరుగరు  తన బిడ్డలనైనా మందలించేవారు కానీ నన్ను ఎప్పుడూ మందలించే వారు కాదు  అయితే గురువుగారిలో ప్రత్యేక వాణి హాస్యోక్తులతో  నేను ఏ తప్పు చేశానో అది  వేరే వారికి అన్వయించి  వారిని చివాట్లు వేసేవారు. నేను ఉండగా. అది నాకు పాఠం  నీవే ఇలా చేస్తున్నావట  ఈ వయసులో అలా చేయకూడదు పెద్దలను ఎంత గౌరవిస్తే మన విలువ అంత పెరుగుతుందని ఎప్పుడూ నీతులు చెప్పలేదు  కానీ అదే నీతి ఇతరులకు నేను ఉండగా చెబుతూ ఇలాంటివి చేసి  నిన్ను నీవు చెడ్డవానిగా రుజువు చేసుకోవద్దు అని హెచ్చరిస్తూ ఉండేవారు. అలా సున్నితంగా పాఠాలు  చెప్పగలిగే గురువులు ఎంతమందికి దొరుకుతారు  గురువుగారు నండూరి సుబ్బారావు గారు, బందా గారు నాకు  దొరకడం అనేది నా సంచిత జన్మ ఫలం కాదంటారా... మీరే చెప్పండి.

కామెంట్‌లు