బంధాలు అనుబంధాలు ;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
బంధాలు
అనుబంధాలు కావాలా!
బాంధవ్యాలు
ప్రతిబంధాలు కావాలా!

ఆస్తుల పంపకంలో
అన్నాదమ్ములు 
సహకరించుకోవాలా!
శత్రుత్వం పెంచుకోవాలా!

కుటుంబం నడపడంలో
తోడుకోడళ్ళు
విభేదించాలా!
వేరేకాపురాలు పెట్టాలా!

పండంటికాపురాల్లో
అత్తాకోడళ్ళు
పాముముంగిసల్లాగా కలహించుకోవాలా!
పాలుపంచదారలాగా కలసిపోవాలా!

నిత్యజీవితంలో
నిజమైన స్నేహితులు
సలహాలు ఇచ్చిపుచ్చుకోవాలా!
సర్దిచెప్పక తమాషా చూస్తుండాలా!

కోరిజతగట్టిన
భార్యాభర్తలు
తాంబూలంలా పండాలా!
నిప్పులా  మండాలా!

ఇద్దరి వ్యవహారాల్లో
మూడోవ్యక్తి
పిల్లులమధ్య కోతిలాగా జోక్యంచేసుకోవాలా!
విద్యార్థులమధ్య గురువులాగా వ్యవహరించాలా!

ప్రణయంలోపడ్డ
ప్రేమికులు
పరస్పరం అర్ధంచేసుకొని ప్రవర్తించాలా!
ప్రపంచాన్నే మరచిపోవాలా ప్రాణాలివ్వటానికి సిద్ధపడాలా!

జన్మనిచ్చిన
తల్లిదండ్రులు
పిల్లలను పెంచాలి
ప్రేమను పంచాలి

దైవసమానులైన
అమ్మానాన్నలను
బిడ్డలు గౌరవించాలి
బాంధవ్యాలను నిలుపుకోవాలి

+++++++++++++++++++++++++++++

బంధం = సంయోగ విశేషం
అనుబంధం= దగ్గరితనం, చుట్టరికం
బాంధవ్యం= నెయ్యం. వియ్యం, సంబంధం
ప్రతిబంధం= ఆటంకం, అంతరాయం

కామెంట్‌లు