సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-30
కరట దంత గవేషణ న్యాయము
*****
కరటము అంటే కాకి. దంత అంటే దంతములు.గవేషణ అంటే వెదకుట లేదా పరిశీలించుట.
అసలు కాకికి దంతాలే ఉండవు కానీ కాకికి దంతతాలెన్ని? అవి ఎట్లుంటాయి? ఇలాంటి వివేక శూన్యమైన ప్రశ్నలు అడగడంతో పాటు వ్యర్థమైన పరీక్ష చేయడానికి పూనుకోవడాన్నే కరట దంత గవేషణ న్యాయము లేదా కరట దంత న్యాయము/ కాక దంత పరీక్ష అంటారు.
అసలు కాకికే కాదు పక్షులకు ముక్కులు ఉంటాయి కానీ దంతాలు ఉండవన్న విషయం అందరికీ తెలిసిందే.
కానీ  మన చుట్టూ ఉన్న వారిలో ఇలాంటి వారు కొందరు తారసపడుతూ ఉంటారు.
ఇలా తలా తోక లేని అసంబద్ధమైన, సహేతుకంగాని ప్రశ్నలతో వేధిస్తూ  మన బుర్ర తింటూ ఉంటారు. మరికొందరైతే జంతువులు పండ్లు తోముకుంటాయా? పెంచుకునే వాళ్ళు తోముతారా? ఇలాంటి తలతిక్క ప్రశ్నలు అడుగుతుంటారు ."వారికి చెబితే అర్థం కాదు.వంట బుట్టదు."
ఇలాంటి వ్యర్థమైన,అవివేకమైన ప్రశ్నలతో  అమూల్యమైన సమయాన్ని దుర్వినియోగం చేసేవారికి ఈ కరట దంత గవేషణ న్యాయము సరిగ్గా సరిపోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు