జాన్ రే పరిశోధనలు;-- యామిజాల జగదీశ్
 ఆయన పదిహేడవ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్త. పేరు. జాన్ రే. ఆయన క్రిమికీటకాదులపై విశేష పరిశోధనలు చేశారు. ఆయన తన పరిశోధనలకు సహాయకుడిగా ఒకరిని నియమించుకు న్నారు. ఆ సహాయకుడి పనేమిటంటే బయటకు వెళ్ళి అక్కడా ఇక్కడా తిరిగి పురుగులను పట్టుకుని తీసుకొచ్చి రేకు ఇవ్వడం.
ఎప్పట్లాగే ఓరోజు అతను పురుగులు తీసుకురావడం కోసం వెళ్ళి ఎంతసేపటికీ తిరిగిరాలేదు. 
ఏంటీ ఇంకారాలేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా అని జాన్ రే ఆలోచనలో పడతాడు. 
ఇంతలో ఓ మిత్రుడు పరుగు పరుగున జాన్ రే వద్దకు వస్తాడు. 
"నీ సహాయకుడిని ఓ చోట కొందరు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతనిని విడిపించడం చేతకాక నీకీ విషయం చెప్పి పోదామని వచ్చాను" అన్నాడు మిత్రుడు.
ఏమైంది అని కంగారు పడ్డాడు జాన్ రే. 
"నీ సహాయకుడిపై కొందరికి అనుమానం వేసింది. పురుగులనం పట్టి డబ్బాలో వేస్తుంటే అతనిని పిచ్చివాడుగా కొందరనుకున్నారు. మరికొందరేమో అతను మాంత్రికుడేమోనని ఆనుమానించారు" అన్నాడు మిత్రుడు.
అతనిని విడిపించడానికి జాన్ రే పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా వాళ్ళు కోర్టుకెళ్ళమన్నారు. 
జాన్ రే కోర్టులో జడ్జీ ముందర అతను మంత్రవాదీ కాదు...పిచ్చివాడూ కాదు. పురుగులపై పరీశోధనలు చేస్తున్న తన సహాయకుడని సాక్ష్యం చెప్పడంతో అతనిని విడిచిపెట్టారు. 
అనంతరం ఆ మనిషి జాన్ రే దగ్గర తనకు ఏ ఉద్యోగమూ అక్కర్లేదని పారిపోయాడు. దీంతో జాన్ రే తానే అటూ ఇటూ తిరుగుతూ పురుగులను సేకరించి తన ప్రయోగశాలకు తీసుకొచ్చి పరీశోధనలు చేయసాగాడు.
వృక్షశాస్త్రజ్ఞుడు, ప్రకృతీ శాస్త్రవేత్త అయిన జాన్ రే పరిశోధనలను గుర్తించి కొందరు కలిసి ఆయన పేరిట 1844లో  ఓ సొసైటీ ప్రారంభించి రే రచనలను ప్రచురించారు. ఆయన చేసిన రచనలు 170,కి పైగా ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి ఇంగ్లండ్‌లోని లైబ్రరీలలో దొరుకుతున్నాయి.
వృక్షశాస్త్ర రంగంలో గణనీయమైన కృషి చేసిన జాన్ రేను ఓ మార్గదర్శక ప్రకృతి శాస్త్రవేత్తగా పరిగణిస్తారు. "మొక్కల చరిత్ర" అనే రచనలో, వివిధ జాతుల మొక్కల గురించి మొదటిసారిగా పరిచయం చేసారు. 
ఆయన దాదాపు అరవై ఏడేళ్ళపాటు  అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. ఆయనను బాధించిన ప్రధాన సమస్య దీర్ఘకాలిక పుండ్లు. అయినప్పటికీ ఆయన మొక్కలు, జంతువుల ఆధునిక వర్గీకరణ వ్యవస్థ అభివృద్ధితో సహా శాస్త్రీయ సమాజానికి గణనీయమైన కృషి చేయడం విశేషం.
1667లో, జాన్ రే ప్రతిష్టాత్మక "రాయల్ సొసైటీ"కి ఎన్నికయ్యారు. ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తల వారికి మాత్రమే ఈ సొసైటీ ఫెలోషిప్ లభిస్తుంది. ఆయన ఎన్నిక శాస్త్రీయ సమాజానికి చేసిన అపారమైన కృషికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన కెరీర్‌లో ఇది ఒక ప్రధాన మైలురాయి. 
చెట్టు వయస్సును ఖచ్చితంగా కొలవడానికి వలయాలను ఎలా ఉపయోగించవచ్చో ఆయన వివరించారు. చెట్టు వయస్సును నిర్ణయించే ఈ విప్లవాత్మక పద్ధతి అప్పటి నుండి అడవుల చరిత్ర, వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది.
1650లలో, జాన్ రే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాల యంలో అధ్యాపకుడిగా తన వృత్తిని ప్రారంభించారు. గ్రీకు, గణితం, మానవీయ శాస్త్రాలలో పాఠాలు చెప్పిన ఆయన తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. 
1986లో బ్రెయిన్ ట్రీ మ్యూజియం ఆయన స్మృత్యర్థం ఓ గ్యాలరీని అంకితం చేసింది.
రోజర్ రే, ఎలిజబెత్ రే దంపతులకు 1627 నవంబర్ 29న బ్లాక్ నోట్లేలో జన్మించిన జాన్ రే 1705 జనవరి 17న ఇంగ్లండ్ లోని బ్రెయిన్ ట్రీలో కన్నుమూశారు.


కామెంట్‌లు