*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 059*
 కందం:
*ధనవంతులైన బహు స*
*జ్జనులైనను నీకు మిగుల సమ్మతులై యు*
*న్నను సతి జనకుని గృహమం*
*దున నుంచుట తగదు కీర్తి తొలగు కుమారా !*
తా:
కుమారా! నీ అత్తింటి వారు ఎంతటి ధనవంతులు అయినా, అన్ని పరిస్థితులు అర్థం చేసుకునే మంచి వారైనా, నీకు ఎంతో ఎక్కువగా గౌరవం ఇచ్చి, నీవు మెచ్చుకునే విధంగా ఉండే వారైనా, నీ భార్యను చుట్టం చూపుగా కాకుండా, అతి ఎక్కువ కాలము నీ అత్తింటిలో ఉంచడం మంచి పని కాదు. అలా ఉంచడం వల్ల నీకు ఏమాత్రమూ మంచి జరుగదు. నీ ప్రతిష్ఠ తగ్గుతుంది....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*పరిణయము చేసుకుందాము అని నిశ్చయించుకొని, ఒకరి చేయి ఒకరు పట్టుకున్నాక, కష్టమైనా, సుఖమైనా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఆ చేయి విడువకుండా ఉండాలి. పొరపొచ్చాలు వస్తాయి. రావాలి కూడా. చిన్న చిన్న కలహాలు, అభిప్రయ బేధాలు కూడా వస్తాయి. రావాలి. ఎందుకంటే, స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వేరు వేరు పద్ధతులలో, వేరు వేరు అలవాట్లు కలిగి ఉంటారు, వివాహం ముందు వరకు. ఒకరి ఇష్టాన్ని ఒకరు ఒప్పుకొని, ఒకరి లోపాన్ని ఇంకొకరు సర్దుబాటు చేసుకుంటూ ఉంటే, ఆ జంట పొందే ఆనందం ఎక్కువగా అనిపిస్తుంది, వారికే. ఇచ్చి పుచ్చుకోవడం, ఒకరిని ఇంకొకరు సమర్ధించుకోవడం లోనే వివాహమైన జంట యొక్క సఫలత దాగి ఉంటుంది. కానీ, చిన్న చిన్న బేధాలకే మితిమీరిన అలుకలు, ఇల్లు వదిలి వేయడాలు, స్త్రీ ని పుట్టింటికి పంపేయడాలు మొదలైనవి, ఆ ఇంటికి, మరీ ముఖ్యంగా ఆ జంట లోని పరుషునికి ఏ విధంగానూ మంచి చేయదు. సమాజం నిరసిస్తుంది కూడా. అందువల్ల, ఈ భూమి మీద ఉన్న ప్రతీ జంట, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి బలహీనతలతో ఇంకొకరు సర్దుకు పోతూ ఉండ గలిగే మంచి వివేకవంతమైన బుద్ధి ని పరమేశ్వరుడు ఇవ్వాలని..... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు