మనోహరమైన స్వప్నాలను
చీకటితో చుట్టేసి....
కనుల అటకలపై దాచేసి...
తెరచి వాకిటి తలుపు
తరచి చూచిన తూరుపు
దూరపు గగనాన
వెలుగురేఖలు
ఉదయపు వాకిట
వెలుతురు తోరణాలు
పచ్చని కొమ్మల
వింజామరలు......
శిఖరాల పల్లకీ మోతలు
పాలమబ్బుల ఛత్రపు ఛాయలు
సప్త అశ్వముల
గొప్ప రథయాత్రకు
పుడమి పట్టెను
కిరణాల తాళ్ళు
మలయమారుతముల
మంత్రోఛ్ఛారణలతో
మంద్రగతిని సాగె
మోహన యాత్ర....
జగతికి జీవం పోస్తూ
అవనికి అనుగ్రహమిస్తూ
అణువణువుకూ
జీవంత చైతన్యమిస్తూ
కన్నుల ముందటి
కమనీయ దృశ్యం
కనపించే దైవపు
కరుణ నిండిన రూపం
ఆశల చూపులు పరచి
ఆరాధనగా మైమరచి
అంజలిగా చేతులు జోడించి
అనుగ్రహ కటాక్షము ఆశించి
మంగళకరమౌ అరుణోదయానికి
మనసు పాడే
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి