*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0247)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
దేవతలు శివుని స్తుతి చేయడం - శివుడూ త్రిపుర దగ్ధానికి సిద్ధం కాకపోవడం - దేవతలు విష్ణువు ద్వారా శివ మంత్ర ఉపదేశము - శివుని కొరకు, విశ్వకర్మ సర్వదేవమయ రథమును నిర్మించడం......
*నారదా! విష్ణు మాయా మోహంలో ఉన్న తారకాసురుని కుమారులు, త్రిపురాలలోని జనులు, స్త్రీలు అందరూ కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి, అధర్మమార్గంలో వెళుతున్నారు. స్త్రీలు, పురుషులు, మునులు, బ్రాహ్మణులు, ఆఖరికి త్రిపురాసుర కుమారులైన తారకాక్షుడు, విద్యున్మాలి, కమాలాక్షుడు కూడా తమదైన ధర్మ బుద్ధి, దైవ చింతన వదలి పెట్టి జీవిస్తున్నారు. ఇది చూచిన దేవతా సమూహం పరమానందంతో త్రిపురాల అంత్య కాలం సమీపించింది అని సంతోషించి, కైలాసము చేరి శివభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టారు. భగవంతుడు అయిన విష్ణువు, నీటి మధ్యలో నిలబడి, తన ఆరాధ్యదైవం, శివుని మనసులో నిలుపుకొని, దక్షిణామూర్తి ద్వారా వెలువడిన రుద్రమంత్రమును ఒకటిన్నర కోట్లు జపించారు. విష్ణుమూర్తి రుద్ర జపం చేస్తున్నంత సేపూ, బ్రహ్మ తో సహా దేవతలు అందరూ, పరమేశ్వర ఆరాదనలో నిమగ్నమై ఉన్నారు.*
*దేవతలు అందరూ ఈశానుని మనసులో నింపుకుని, "ప్రభూ! మీరు సమస్త జీవులకు ఆత్మ స్వరూపులు. మీ కంఠముపై ఉన్న నల్లని గుర్తుతో మీరు" నీలకంఠుడు" అయ్యారు. చిద్రూపులు, చైతన్య మూర్తులు అయిన మీకు నమస్కారాలు. అసుర సంహారకా! ఇంతకు ముందు ఎన్నో మార్లు మమ్మల్ని అందరినీ రాక్షసుల బారి నుండి కాపాడారు. ఇప్పుడు, ఈ తారకాసురుని కుమారుల నుండి కూడా మీరే కాపాడాలి. మీరు, ఎల్లప్పుడూ, మాకు వందనీయులు. మొదలు మీరే. చివర మీరే. ఆది, ఆనాది కూడా మీరే. సృష్టి స్థితి లయ జరగడానికి మీ ద్వారా బ్రహ్మ, విష్ణు, రుద్రులు ఉద్భవించారు. ప్రకృతిని, పురుషుని కూడా సృష్టి చేసింది మీరే. ఈ భవసాగరమును తరింప జేసేది కూడా మీరే. మీరే అన్ని ప్రాణులకు, ప్రభువులు, అవినాశి, వరదాతలు, వాజ్ఞ్మయస్వరూపులు, వేదములచేత ప్రతిపాదించ బడిన వారు, మాట మీరే, మూగ మీరే. మహా యోగులు కూడా, ఈశానులైన మీ దగ్గర ముక్తి కోరుకుంటారు. వేదములు మిమ్మల్ని, పరబ్రహ్మ స్వరూపులని, తత్వరుపులని, తేజోరాశులని, పరాత్పరులని నొక్కి ఒక్కాణిస్తున్నాయి."*
*"శర్వా! సర్వ వ్యాపియై, సర్వాత్మయై, త్తిలోకాధపత్యము కలిగి ఉన్నది మీరే. భవా! ఈ జగత్తు లో పరమాత్మ అని చెప్పబడేది కూడా మీరే. జగద్గురు! ఈ ప్రపంచములో, చూచుటకు, చదువుటకు, వినుటకు, కీర్తించుటకు, తెలుసుకోవడానికి ఉన్న ఒకేఒక్క మూర్తి, మీరే. మీకు నాల్గు పక్కలా చేతులు, కాళ్ళు, చెవులు, కన్నులు, ముఖాలు ఉన్నాయి. అందువలన, మీకు అన్నివైపుల నుండి కూడా నమస్కారాలు చేస్తున్నాము. భవాధ్యక్షులు, సర్వజ్ఞులు, అనావృతులు, విశ్వరూపులు, విరూపాక్షులు అయిన మీకు అన్ని దిక్కుల నుండి నమస్కారాలు చేస్తున్నాము. మీరు అందరికీ ప్రపితామహులు. అందరిలోనూ వ్యపించి ఉన్నదీ, మీరే. శ్రుతులు, శ్రుతితత్వము తెలిసిన విజ్ఞులు మిమ్మల్ని, వరములు ఇచ్చే వారని, సర్వ భూతనివాసి అని, స్వయంభువు అని, శ్రుతితత్వజ్ఞానులు అనీ చెప్తున్నారు. అందువలన, దేవతలు, స్థావరులు, జంగమములు, బ్రాహ్మణులు, అసురులు అందరూ కూడా మిమ్మల్ని కీర్తిస్తున్నారు. దేవ వల్లభా! మీరే మాకు గతి. ఇప్పటి వరకూ తారకాసురుని కుమారుల చేతిలో మేము సర్వమూ కోల్పోయిన వారిగా ఉన్నాము. మీచే ప్రేరేపింపబడిన విష్ణు మాయా ప్రభావం తో, వారు ధర్మభ్రష్ఠులుగా తిరుగుతూ, న్యాయ మార్గాన్ని వదిలి పెట్టి, మీ పూజాదికాలు కూడా మానేసారు. మీరు, మొదటి నుండి కూడా దేవతల పక్షాన ఉండి, దేవతల పనులు అన్నీ సఫలం చేస్తున్నారు. ఇప్పుడు కూడా, ఈ దైత్య సంహారం చేసి, మమ్మల్ని కాపాడండి. మేము అందరమూ, మీ శరణు కోరి, మీ చెంత నిలబడ్డాము."*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు