*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0249)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
దేవతలు శివుని స్తుతి చేయడం - శివుడూ త్రిపుర దగ్ధానికి సిద్ధం కాకపోవడం - దేవతలు విష్ణువు ద్వారా శివ మంత్ర ఉపదేశము - శివుని కొరకు, విశ్వకర్మ సర్వదేవమయ రథమును నిర్మించడం......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయనమః ఓం"*
*నారదా! దేవతా సమూహమైన మనమందరమూ కూడా శంభుని సేవకులమని, ఆయన ఆజ్ఞ మేరకే ఏపని అయిన పూర్తి చేయగలవారమని, కనుక త్రిపురాసురుని కుమారులను చంపుట యందు అశక్తులమని, శంకరుడే త్రిపుర సంహారము చేయవలెను అని చేసిన ప్రార్థన విన్న ఈశానుడు, "బ్రహ్మ దేవా! విష్ణు దేవా! మీరు నన్ను సర్వ జగములకు అధిపతిని అని చెపుతున్నారు. కానీ, అటువంటి మహారాజు దగ్గర ఉండవలసిన గొప్ప రథము గానీ, విల్లు బాణాలు గానీ, చతురంగ బల సైన్యాలు కానీ నా దగ్గర లేవు కదా! మరి నేను మహావీరులైన తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షులతో యుద్ధము ఏవిధముగా చేయగలను." అని పలికి మౌనముగా ఊరక ఉండి పోయారు.*
*దేవతా సమూహము అంతా కూడా, మహాదేవుడు ఇంకా తమ యందు ప్రసన్నము కాలేదు. మనల్ని ఇంకా పరీక్ష చేస్తున్నారు, అనుకుని దీనంగా ఉన్నారు. వారిని చూచిన విష్ణుమూర్తి, "అయ్యలారా! మీకు అందరికీ తెలిసిన విషయమే కదా! భగవంతుడు ఎంతో ఏకాగ్రతతో సాధన చేస్తే గానీ ప్రసన్నమవడు. ప్రత్యక్ష దర్శనం ఇవ్వడు. ఇప్పుడు మనమందరమూ ఆ మహాస్వామి ఆదరణ కోసం ప్రయత్న పూర్వకంగా సాధన చేయాలి. ఆ స్వామి " ఆశుతోషుడే". అందువలన మీరందరూ, నా మాటలు విని, మొదట "ఓం" ఉచ్ఛరించి, పిదప "నమః" చెప్పాలి. ఆ తరువాత "శివాయ" పలకాలి. తరువాత, రెండు సార్లు "శుభం" అని పలికి, "కురు", " కురు" అని రెండు సార్లు చెప్పాలి. తరువాత, "శివాయనమః", " ఓం" పలకాలి. ఇలా అన్నీ కలిపి పలకడం వలన, "ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయనమః ఓం" అవుతుంది. మనమందరమూ కూడా శివుని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మంత్రమును ఒక కోటి సార్లు జపంచేయాలి. అప్పుడు, ఆశుతోషుడు, తప్పకుండా మన కోరికను తీరుస్తారు." ఇలా దేవతలకు చెప్పిన విష్ణుమూర్తి, తాను కూడా, దేవతల మునుల కార్యము నెరవేరడానికి, తన ఆరాధ్య దైవం అయిన శంభుని మనసులో నిలుపు కుని, జపం చేయడం ప్రారంభించారు.*
*"శివ - శివ" అని కోటి సార్లు తన నామ జపం చేసిన దేవతలను, విష్ణుమూర్తి ని చూచి ప్రసన్నుడైన శంభుడు ప్రత్యక్షమై, "దేవతలారా! మీ కోరిక చెప్పండి" అని అడిగారు. "స్వామీ! మీరు మాకు ప్రసన్నులై దర్శనము ఇచ్చారు. మాకు ఎప్పుడు ఆపద వచ్చినా, మీరు కాపాడారు. ఇప్పుడు తాకాసురిని కుమారుల త్రిపురములను కూల్చి, వారిని హతమార్చి, మమ్మల్ని కాపాడండి." అని వేడుకున్నారు. ఆ వేడుకోలు విన్న ఉమాపతి, "శ్రీహరి, బ్రహ్మ దేవా, దేతలారా, మునులారా! మీ ప్రార్థన విన్నాను. తారకాసురుని కుమారులను అంతమొందించాలి అనే మీ కోరిక తీరిపోయింది, అని మీరు నిశ్చింతగా ఉండండి. అయితే, విష్ణుదేవా! విధాతా! మీరు త్రిలోకాధిపతులు. ఇందులో సంకోచము ఏమీ లేదు. అందువల్ల, యుద్ధం చేయడానికి ఒక చక్రవర్తికి తగిన సామగ్రి అంతటినీ, నాకోసం మీరు ఏర్పాటు చేయండి. మీరు అందరూ, కోటి మార్లు జపించిన "ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయనమః ఓం" ఈ మంత్రము ఎంతో పవిత్రమైనది, శక్తి వంతమైనది. ఇది భక్తి- ముక్తులను ఇస్తుంది. అన్ని కోరికలనూ తీరుస్తుంది. శివ భక్తులకు ఆనందప్రదమైనది. ధనము, యశస్సు, ఆయుష్షును వృద్ధి చేస్తుంది. తుదకు, మోక్ష కాములకు, మోక్షాన్ని కూడా ఇస్తుంది. పవిత్రుడై, ఎల్లప్పుడూ ఈ మంత్రమును చెప్పుకున్న వానికి, చెప్పిన వానికి, విన్న వానికి అందరికీ వారి వారి కోకలు సంపూర్ణముగా తీరుతాయి."*
*శివుని మాటలు విన్న బ్రహ్మ, విష్ణు, సకల దేవతలు, మునులు ఎంతో సంతోషించారు. తరువాత, శివాజ్ఞ పొందిన విశ్వకర్మ, విశ్వహితం కోరుతూ సర్వదేవమయమూ, పరమశోభాయమానమైన, దివ్యమైన రథాన్ని నిర్మించాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు