*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0251)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
సర్వదేవమయ రథ వర్ణన - శివుడు యుద్ధమునకు వెళ్ళుట - పశుపతి అని పేరు - గణేశుని పూజ - త్రిపుర దహనము - మయుడు, త్రిపురాసురుని కొడుకులు బయట పడుట......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయనమః ఓం"*
*నారదా!  దేవతల మేలు కోరుకునే విశ్వకర్మ చేత తయారు చేయబడి, ఈ జగత్తు లో ఉన్న అన్ని అంశాలు, దేవీ దేవతలు, నదులు నదాలు, మునులు, ఋషులు, దిక్పాలకుల సమూహంతో నిండి ఉండి, స్వర్ణ మణిమయ శోభితంగా వెలిగి పోతున్న, ఆ "సర్వదేవమయ రథము"నకు సారథిగా బ్రహ్మ నైన నేనే కూర్చుని,  దానిని పరమేశ్వరుని దగ్గరకు తీసుకు వెళ్ళాను. శివునకు ఆ " సర్వదేవమయ రథమును " సమర్పించి, త్రిశూలము చేత బట్టి దేవతలు అందరి పూజలు అందుకుని ఉండే జటాధరుని ఆ రథమును ఎక్కమని ప్రార్థన చేసాను. ఋషులు, మునులు, నాగులు, ఇతర దేవీ దేవతలు కీర్తన చేస్తుండగా, ఎంతో ఐశ్వర్యములను ఇచ్చేది, సర్వదేవమయము అయిన ఆ రథమును శంభుడు ఎక్కి కూర్చున్నాడు. లోకమందలి అన్ని వస్తవులతో కూడి, బ్రహ్మ సారథిగా ఉన్న ఆరథమును చూసి, ఋషభవాహనుడు చాలా సంతోషించారు. కానీ, ఆ జగదేశ్వరుని బరువును మోయలేక అశ్వములు కూర్చుండి పోవడం చూసిన నందీశ్వరుడు రథము కిందకు వెళ్ళి పైకి లేపే ప్రయత్నం చేసాడు. కానీ, నందీశ్వరుని వల్ల కూడా కాక, మోకాలి మీద భూమిపైన కూర్చున్నాడు. అప్పుడు, శివుని ఆజ్ఞ పొందిన బ్రహ్మ, తన కొరడాతో గుర్రములను అదిలించగానే, రథము యథాతథంగా నిలబడి, పోరుకు సిద్ధం అయ్యింది.*
• అప్పుడు, పరమేశ్వరుడు దేవతలందరినీ చూచి, "మీరు, ఋషులు, మునులు, మిగిలిన వారు అందరూ కూడా పశువులుగా మారి, ఆ పశువుల ఆధిపత్యం నాకు ఇవ్వండి. అప్పుడు మాత్రమే నేను, ఆ  దైత్యులలో ఉత్తములైన త్రిపురాసురుని కుమారులను చంప గలుగుతాను. ఆలా పశుత్వము నాకు ఇవ్వకపోతే, వారి సంహారం సాధ్యం కాదు." అని చెప్పారు. తన మాటలు విన్న దేవతలు మిగిలిన వారు, పశుత్వ కల్పన చేయడానికి సందేహిస్తున్నారు అని తెలుసుకుని, అంబికాపతి ఇలా చెప్పారు. "నా ఆజ్ఞతో పశుభావాన్ని మీరు పొందినంత మాత్రాన మీరు పతితులు, చెడ్డవారు అవరు. మీరు అందరూ కూడా అందరికీ మేలు చేసే మనసు ఉన్నవారు, కనుక పశుత్వ భావము నుండి మీరు బయట పడడానికి ఎంతో మహిమాన్వితమైన పాశుపతవ్రతమును చేయండి. అప్పుడు మీరు పశుత్వభావము నుండి శాశ్వతముగా బయట పడతారు. మీరే కాకుండా, ఎవ్వరైనా ఈ పాశుపతవ్రతం చేయవచ్చు. ఈ పాశుపతవ్రతం చేయడం వల్ల మనుషులలో ఉన్న పశు లక్షణాల నుండి ముక్తి పొందుతారు."*
*పరమేష్ఠి మాటలతో తృప్తి చెందిన మనసుతో దేవతలు అందరూ, "తథేతి", అట్లే జరుగు గాక అని, భగవంతుడగు శంకరుని యొక్క పశువులుగా మారి, తమను తాము ఆయనకు సమర్పించుకున్నారు. ఆ విధంగా రుద్రుడు, " పశుపతి" అయ్యారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు