*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0255)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
దంభుని తపస్సు - పుత్రప్రాప్తి వరము - శంఖచూడుని జన్మ - తపస్సు, వరప్రాప్తి - తులసితో గాంధర్వ వివాహము......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! శంకరుడు, శంఖచూడుని సంహరించిన వృత్తాంతము చెప్తాను శ్రద్ధగా విను. ఈ చరితము వినడం వల్ల, హరుని మీద భక్తి ఇంకా ధృడము అవుతుంది. శంఖచూడుడు మహావీరుడు, దేవతలకు ఇబ్బందులు కలిగించే వాడు. రుద్రుడు త్రిశూలము చేత ధరించి, యుద్ధం లో శంఖచూడుని సంహరిస్తారు. ఇది ఎంతో పరమ పావన మైన, దివ్య చరిత్ర. నీవు శ్రద్ధగా వినవలసింది.*
*మరీచి మహర్షి, బ్రహ్మ కుమారుడు. ఆతని కుమారుడు కశ్యపుడు. కశ్యపుడు మహాశీలుడు, ధర్మనిష్ఠ కలిగిన వాడు, విద్యాసంపన్నుడు, సృష్టి కర్త, ప్రజాపతి కూడా. దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి గొప్ప తనాన్ని తెలుసుకుని, తన పదముగ్గురు కుమార్తెలను ఇచ్చి వివాహం చేసాడు. వారిలో, ఒకరు, "దనువు". ఈమె, రూపవతి, సుందరి, సాధ్వీ సౌభాగ్యము కలది. ఈమె ద్వారా కశ్యపునకు, అనేకమంది పుత్రసంతానం కలిగారు. వారిలో "దంభుడు" జితేంద్రియుడు, ధార్మికుడు, విష్ణు భక్తుడు. కానీ, దంభునకు కొడుకులు పుట్టలేదు. ఆ దిగులుతో, శుక్రాచార్యుని గురువుగా ఎంచుకొని, ఆయన ద్వారా "శ్రీకృష్ణ మంత్రమును" పొందాడు.*
*శ్రీకృష్ణ మంత్రమును పొందిన దంభుడు, పుష్కర ప్రదేశానికి వెళ్ళి, కొన్న లక్షల సంవత్సరాల కాలం ఆ మంత్రాన్ని జపించాడు. ఆ జప ప్రభావం వల్ల, దంభుని నుదుటి నుండి దివ్యంగా వెలుగులు చిమ్ముతూ ఒక తేజస్సు బయటకు వచ్చింది. దాని ప్రభావం వలన, దేవతలు అందరూ, మునులు, మనువు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు, వారందరూ, ఇంద్రునితో కలసి బ్రహ్మ నైన నావద్దకు వచ్చి, ప్రణామము చేసి గోడు చెప్పుకున్నారు. ఈ ఇబ్బంది తొలగించ గలవాడు, విష్ణుమూర్తి మాత్రమే అని తెలుసుకుని, అందరినీ వెంట బెట్టుకుని, వైకుంఠానికి వెళ్ళి, ఆ స్వామి కి విన్నవించుకున్నాము. "దేవదేవా! ఏ విపరీతము జరిగిందో కానీ, మేమందరమూ చాలా బాధలను అనుభవిస్తున్నాము. ఈ బాధల నుండి విముక్తి పొందే దారి మాకు కనబడడం లేదు. నీ సేవకులమైన, మా దేవతలకు కష్టాలు వచ్చినప్పుడు, వాటిని తొలగించ గలిగిన వారు, మీరే. ఇది నిశ్చయము. కనుక, మమ్మల్ని గట్టెక్కించ్చండి, లక్ష్మీపతి!" అని వేడుకున్నారు.*
*దేవతా సమూహం చేసిన ప్రార్థన కు ప్రసన్నుడైన విష్ణుమూర్తి, "దేవతలారా! ఎక్కువగా ఆత్ర పడకండి. మీరు అనుభవిస్తున్న బాధలు, దంభుడు అనే రాక్షసుడు నా గురించి చేసిన తపస్సు వల్ల వచ్చిన జ్వాల కలిగిస్తోంది. నేను, ఆతనికి ప్రత్యక్షమై, అతను కోరుకున్న పుత్రసంతాన వరాన్ని అనుగ్రహిస్తాను. అప్పుడు, మీ బాధలు తొలగి పోతాయి." దేవతలకు అనునయ వాక్యాలు చెప్పి, విష్ణుమూర్తి పుష్కరములో తన గురించి కొన్ని లక్షల సంవత్సరాల కాలం నుండి తపస్సు చేస్తున్న దంభుని చేరుకుని, "దంభా! నీ తపస్సు చాలించు. నేను నీ ముందుకు వచ్చాను. నీకు ఏమి వరము కావాలో, కోరుకో అనుగ్రహిస్తాను" అని చెప్పారు, విష్ణుమూర్తి.*
*కనులు తెరిచిన దంభుడు, తన ఎదురుగా ఉన్న శ్రీమన్నారాయణుని చూచి, తన్మయత్వంతో ఎన్నో విధాల కీర్తన చేసి, "ఆదిదేవా! అనంతశయనా! ఇన్నాళ్ళకు నా మీద దయ కలిగిందా, స్వామీ! నాకు యోగ్యడైన పుత్రుని అనుగ్రహించు, దేవా!. నీ విచ్చే నా కుమారుడు, నీకు పరమ భక్తుడు అయి ఉండాలి. అనన్య సామాన్యమైన పరాక్రమము కలిగి ఉండాలి.  మూడు లోకాలను జయించ గలిగే నా కుమారుని, దేవతలు కూడా గెలవ లేకుండా ఉండాలి. ఇంతటి యోగ్యడైన కుమారుణ్ణి నాకు అనుగ్రహించు, స్వామీ!" అని వేడుకున్నాడు. దయాళువైన శ్రీహరి "అట్లే అగు గాక" అని చెప్పి, అంతర్ధానం అయ్యారు.* 
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు