*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0256)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
దంభుని తపస్సు - పుత్రప్రాప్తి వరము - శంఖచూడుని జన్మ - తపస్సు, వరప్రాప్తి - తులసితో గాంధర్వ వివాహము......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! దానవేంద్రుడు అయిన దంభునికి పుత్రసంతాన ప్రాప్తి వరము ఇచ్చి, తపస్సు ఉపసంహరింప చేసి, కమలనాభుడు విష్ణులోకానికి ప్రయాణమయ్యారు. దంభుడు, నారాయణుడు వెళ్ళిన దారి చూస్తూ నమస్కరించి, తన ఇంటికి వెళ్ళి, తన భార్యతో సంతోషంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. దానవ రాజైనా, రాజ్యం సుభిక్షంగా ఉంది. కొంతకాలానికి, దంభుని భార్య గర్భవతి అయింది. శ్రీకృష్ణుని స్నేహితులలో, పార్షదులలో "సుదాముడు" ముఖ్యమైన వాడు. సుదాముడు, రాధ శాపం వల్ల, దంభుని ఇంట, దంభుని భార్య గర్భం లో జన్మిస్తాడు. మహా సాధ్వి అయిన దంభుని భార్య ఆరోగ్యవంతుడైన పుత్రునికి జన్మ ఇచ్చింది. ఈ బాలుడికి సకాలంలో జాత కర్మలు చేయించి, "శంఖచూడుడు" అని పేరు పెట్టాడు, దంభుడు. ఈ శంఖచూడుడు, సుదాముడే కదా. అందువలన, బాల్యంలోనే ఎంతో చురుకుగా ఉంటూ, ఇంటిల్లిపాదినీ తన ఆటపాటలతో, చిలిపి చేష్టలతో, అలరిస్తూ, శుక్లపక్ష చంద్రుని లాగా దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. కుటుంబీకుల ప్రేమకు పాత్రుడు అయ్యాడు. శంఖచూడుడు అయిన సుదాముడు, జైగీష ముని వద్ద చేరి, శుస్రూష చేసి, బ్రహ్మ విద్య ఉపదేశం పొందాడు.*
*శంఖచూడుడు, పుష్కర ప్రదేశానికి వెళ్లి, జైగీష ముని ఇచ్చిన బ్రహ్మ విద్యను ఉపాసన చేస్తూ, బ్రహ్మ నైన నా గురించి, చాలా కాలం నిర్విఘ్నంగా, నిరంతరాయంగా తపస్సు చేసాడు, దానవ రాజు. ఆతని తపస్సుకు మెచ్చి, నేను అతని ఎదుట ప్రత్యక్షమై, "ఏమి వరము కావలెనో, కోరుకో" అన్నాను. దానికి ప్రతిగా, శంఖచూడుడు నన్ను పరి పరి విధాల కీర్తించి, "దేవతలకు కూడా నేను అజేయుడను అవ్వాలి" అని వరం కోరుకున్నాడు. "తథాస్తు" ఆతని కోరిక చెల్లించి, ఎల్లప్పుడూ జయమును చేకూర్చే "శ్రీకృష్ణ కవచమును" ఇచ్చి, "నీవు, బదరీ వనానికి వెళ్ళు. అక్కడ, ధర్మధ్వజుని కుమార్తె నిన్ను తన భర్తగా కోరుకుంటూ, సుదీర్ఘమైన తపస్సు చేస్తోంది. ఆమెను నీవు వివాహమాడి, సుఖంగా ఉండు" అని అంతర్థానం అయ్యారు, బ్రహ్మ. సంతోషం పొందిన శంఖచూడుడు, బ్రహ్మ ఇచ్చిన "శ్రకృష్ణ కవచాన్ని" అక్కడే మెడలో వేసుకుని, బదరీ వనానికి ప్రయాణమయ్యాడు, దానవరాజు, శంఖచూడుడు.*
*బదరీ వనంలో, ధర్మధ్వజుని కుమార్తె, "తులసి" తపస్సు చేస్తున్న ప్రదేశానికి చేరుకున్నాడు, శంఖచూడుడు. ఆమెను చూసి, నీవెవ్వరివి, అని అడిగాడు. తాను ధర్మధ్వజుని కుమార్తెను అని, మీదారిన మీరు వెళ్ళండి అని చెప్పింది, తులసి. బ్రహ్మ చెప్పిన మాట ప్రకారం, నేను నిన్న గాంధర్వ పద్దతి లో వివాహం చేసుకోవడానికి వచ్చాను. కామంతో నిన్ను ఆట పట్టించడానికి రాలేదు. నేను దేవతలందరనీ కూడా జయించిన వాడిని. ఇంతకు ముందు జన్మలో నన్ను సుదామగోపుడు అనే వారు. నేను శ్రీకృష్ణుని చెలికాడను. శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల పూర్వ జన్మ స్మృతి నాకు ఇంకా ఉంది. రాధిక శాపం వల్ల, దంభుడు అనే దానవరాజు కుమారుడు గా పుట్టాను. శంఖచూడుని ఈ మాటలు విన్న తులసి, మీ మాటలతో నన్ను జయించారు. ఎంత గొప్ప పురుషుడైనా, మంచి వంశంలో పుట్టిన స్త్రీ, పరీక్ష చేసిన తరువాత నే వివాహమాడాలి అని పలికింది. ఈ సంవాదం అంతా వింటున్న బ్రహ్మ నైన నేను వారిముందు ప్రత్యక్షమై, శంఖచూడా, తులసీ, మీరి ఇద్దరూ కూడా ఉత్తములే. ఒకరినొకరు ఇష్టపడిన వారే. మరి ఇక పరీక్షలేమిటి. శంఖచూడా, నీవు తులసిని గాంధర్వ విధిలో వివాహమాడి సుఖంగా ఉండండి. అంత్య కాలంలో, ఈ శంఖచూడుడు మరల గోకులానికి చేరుకుని శ్రకృష్ణ పరమాత్మతో ఉంటాడు. తులసీ, నీవు విష్ణులోకం చేరుకుంటావు, అని చెప్పి అతర్హితుడయ్యాడు, బ్రహ్మ.*
*బ్రహ్మ నైన నా మాటలను అనుసరించి, తులసిని గాంధర్వ పద్దతిలో వివాహమాడి, దానవరాజైన దంభుని ఇంటికి వెళ్లి, ఒక అత్యంత సుందరమైన భవంతిలో విహరిస్తూ, సుఖంగా ఉన్నాడు.*
 
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు