*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0259)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
శంఖచూడుడు రాజగుట - దేవతల ఓటమి - దేవతలు, బ్రహ్మ, విష్ణు దేవునకు మొర పెట్టుకోవడం - శంఖచూడుని పుట్టుక తెల్పి, పరమశివుని శరణు కోరడం......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! శంఖచూడుని బాధలు తట్టుకోలేక తన దగ్గర మొర బెట్టు కోడానికి బ్రహ్మను వెంటబెట్టుకుని వచ్చిన దేవతలకు సాంత్వన చేకూర్చి, వారిని వెంట దీసుకుని నిర్గుణ నిరంజన నిరాకార పరబ్రహ్మ తత్వము కొలువున్న కైలాసగిరికి బయలుదేరారు విష్ణుమూర్తి. అలా కైలాసానికి వెళుతున్న దారిలో దేవతలందరూ, ఇంతకు ముందు విష్ణు భగవానుడు తమకు ప్రసాదించిన "ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం" మంత్ర రాజాన్ని, మనస్ఫూర్తిగా జపిస్తూ కదులుతున్నారు.*
*మహత్తరమైన, దివ్యమైన, భౌతికతారహితమైన శివలోకాన్ని చేరుకున్న దేవతలు, బ్రహ్మ, విష్ణుమూర్తి లు అక్కడ దివ్య సభలో కొలువై ఉన్న పరమేశ్వరుని దర్శించుకున్నారు. ఆ సభా భవనము కోటి సూర్యప్రకాశ సమానంగా వెలిగిపోతోంది. ఆ సభా ప్రాంగణము మొత్తం మహేశ్వర రూపంతో సమానంగా వెలుగుతున్న, శివపార్షదులతో నిండి పోయి ఉంది. సభను అలంకరించిన పరమేశ్వరుడు పది భుజములు, అయిదు ముఖములు, మూడు కన్నులు, కంఠములో నీలి చిహ్నము కలిగి జగద్వంద్యుడుగా ఉన్నారు. శివపార్షదులు అందరూ భస్మలేపనము చేసుకుని, రుద్రాక్షలు ఆభరణములుగా ధరించి ఎంతో అందముగా ఉన్నారు.*
*ఆ పరమశివుని సభా భవనము, ఇంకొక చంద్రమండలము లాగా, కాంతులు వెదజల్లుతోంది. మణులు, మాణిక్యాలు, వైఢూర్యాలు పొదగబడి చిత్ర విచిత్రంగా చూపరులకు కనబడుతోంది. ఇంద్రనీల మణులు, స్వర్ణ సూత్రములు చిగురుటాకుల తోరణాలుగా కట్టబడ్డాయి. పరిమళ భరితమైన వాయువులతో, వెయ్యి యోజనముల విస్తీర్ణము కలిగిన ఆ సభ, శివ కింకరులతో నిండిపోయి ఉంది. సభా మధ్యంలో, అమూల్యమైన రత్న రాసులతో నిర్మించ బడిన స్వర్ణ సింహాసనము మీద, ఉమా సహితుడై శంభుడు తన జనులను అనుగ్రహిస్తున్నారు. అటువంటి స్వామిని, బ్రహ్మ, విష్ణు, ఇతర దేవతలు దర్శించుకున్నారు. ఆ శంకరుడు, కుండలములతో, స్వర్ణ మణిమయ కిరీటముతో, రత్న మాలలతో, శరీరమంతా విబూది అలముకుని ఉన్నారు. ఉమాకాంతుని మనస్సు ప్రశాంతంగా, ఆనందాన్ని పొందుతూ ఉంది. పార్వతి, స్వామికి తాంబూల సేవనము చేయిస్తుండగా, శివభక్తులు తెల్లటి చామరములు వీస్తున్నారు. సిద్దులు, మునులు, ఋషులు ఆ సర్వ జగద్రక్షకుని తలలు వంచి కీర్తిస్తున్నారు.*
*ఆదిశంకరుడు అయిన రుద్రుడు, గుణాతీతుడు, త్రిమూర్తులకు జన్మదాత, సమస్తములోనూ ఉన్నవాడు, అన్నిటికీ తానే ఆధారమైన వాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, ఇచ్ఛారూపము దాల్చగలవాడు, సర్వసమర్ధడు, పరిపూర్ణత్వము కలిగినవాడు, అయిన దేవదేవుని దర్శనంతో పులకించిన మనసులతో, చేతులు జోడించి, తలలు వంచి నమస్కరించి, కీర్తించారు బ్రహ్మ, విష్ణు, మిగిలిన దేవతలు అందరూ. "దేవాధిదేవా! మీరు దీనుల యందు దయతో ఉంటారు. ఆర్తులను రక్షిస్తారు. మూడులోకాలకు మీరే అధిపతి. శరణన్న వారిని వాత్సల్యంతో చేరదీస్తారు. పరమేశ్వరా! కరుణించి మమ్మల్ని ఉద్ధరించండి. శంఖచూడుని బాధలనుండి విముక్తి ప్రసాదించండి" అని ప్రార్థన చేసారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు