*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 088*
 కందం:
*విను ప్రాణరక్షణమునన్*
*ధనంతయు మునిగిపోవు తరి, 
పరిణయమందున, గురుకార్యమున, వధూ*
*జన సంగమమునందు బొంక జనును కుమారా !*
తా:
కుమారా! ఈ లోకములో ఒక వ్యక్తి కి ప్రాణం మీదికి వచ్చినపుడు, తన వద్ద ఉన్న డబ్బు అంతా నశించి పోతున్నప్పుడు, వివాహ విషయములలో, ఎదైనా గొప్ప పనిని సాధించాలి అనప్పుడు, ఆడువారిని కలుసుకొనేడప్పుడు, అబద్దము చెప్పడం తప్పు కాదు, అని తెలుసుకో............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*అబద్దాలు చెప్పడం చాలా తప్పు పని. ఈ విషయంలో ఎటువంటి అనుమానము అక్కరలేదు. అయితే, వెయ్యి అబద్దాలు చెప్పి అయినా ఒక పెళ్ళి చేయమన్నారు, పెద్దలు. ఎందుకంటే, వివాహ వ్యవస్థ నిలబడాలి కనుక. ఇక, "అశ్వత్థామ హతః కుంజరహ" మనకు తెలిసన పంచమ వేదం అనబడే మహాభారతం లోని వాక్యం. ఈ మాట ఎవరో చెపితే, ఇంత ప్రచారం వచ్చేది కాదేమో! ఆమాట చెప్పింది, సాక్షాత్తు, ధర్మదేవుని కుమారుడు, ధర్మరాజు. జరుగుతున్న యుద్ధం లో జరిగే నరబలిని కొంతవరకు ఆపడానికి ఆమాట చెప్పించారు, లక్ష్మీ పతి, నారాయణుడు. దొంగలు పడి మన సంపద మొత్తం దోచుకుంటుంటే కూడా అబద్దం చెప్పవచ్చు. భీముడు వలలుడుగా ఉండి, కీచకుని చండానికి స్త్రీ గా వెళతాడు, అక్కడ ద్రౌపది మాన, ప్రాణ రక్షణలు ముఖ్యం కనుక. అలా అని, అబద్దాలు చెప్పి జీవించడమే జీవన విధానం అవకూడదు. ధర్మ బద్ధమైన జీవితాన్ని కొనసాగించే స్థైర్యాన్ని మనకందరకు ఇవ్వమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు