ఆహా - అబ్బా (జానపద కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూల్-94410322
 ఒక వూరిలో ఒక వ్యాపారి వుండేటోడు. వాడు పెద్ద పిసినారి. మోసగాడు. తన దగ్గర పని చేసేవాళ్ళకు డబ్బులు సరిగా ఇవ్వకుండా ఎగ్గొట్టేవాడు. దాంతో ఎవరూ వాని వద్ద పనికి చేరేవారు కాదు.
ఆ ఊరిలో గోపాలు అనే పిల్లోడు వుండేటోడు. వాడు చానా మంచోడు. అమాయకుడు. ఏది చెప్పినా వంచిన తల ఎత్తకుండా చేసేవాడు. వాడు ఒకసారి పని కోసమని ఆ పీనాసి వ్యాపారి దగ్గరికి పోయినాడు. వ్యాపారి ఆ పిల్లోని అమాయకత్వం గమనించి ''సరే... ఇస్తాగానీ... నేను ఏ పని చెప్పినా వంక పెట్టకుండా మొత్తం చెయ్యాల. ఎందుకు, ఏమిటి, ఎట్లా... అంటూ ఎదురు అడగ్గూడదు. అట్లా చేస్తేనే జీతమిచ్చేది. ఎగ్గొట్తే మాత్రం ఒక్కపైసా గూడా ఇవ్వను. ఏం సరేనా'' అన్నాడు. గోపాలుకు వాని గురించి తెలీదు కదా... దాంతో 'సరే' అన్నాడు.
ఆరోజు నుంచీ ఇంట్లో, అంగట్లో ఏ పని చెబితే ఆపని మారు మాట్లాడకుండా చేయసాగినాడు. నెల గడిచింది. జీతం కోసం అడిగితే 'ఈ నెల వ్యాపారం అంత బాగా లేదు. వచ్చే నెల ఒకేసారి ఇస్తాలే' అన్నాడు. గోపాలు అలాగేనంటూ మారు మాట్లాడకుండా పని చేయసాగినాడు. అట్లా ఆ నెల గూడా గడిచిపోయింది. అయినా వ్యాపారి జీతం ఇవ్వక ''యాడికి పోతాయిలేవోయ్‌ డబ్బులు. నేనేమన్నా పారిపోతానా... ముచ్చటగా మూడు నెల్లదీ కలిపి ఒకేసారి ఇస్తాలే'' అన్నాడు. అట్లా ప్రతినెలా ఏదో ఒకటి చెబ్తా వున్నాడే గానీ చేతిలో మాత్రం చిల్లిగవ్వ గూడా పెట్టలేదు. మాటల్తోనే సంవత్సరం దాటిచ్చినాడు. దాంతో గోపాలు ఇంక లాభం లేదనుకోని విషయమంతా చెప్పి వూరిలోని పెద్ద మనుషులందరినీ పిలుచుకోనొచ్చినాడు.
అప్పుడా వ్యాపారి ''సరే... ఇస్తాలే గానీ ఇంక ఇది ఆఖరి పని. మా ఒప్పందం ప్రకారం ఏ పని చెప్పినా కాదు కూడదు, ఎందుకు ఏమిటి అని అడగకుండా చేయాల. ఏ మాత్రం వెనక్కు తగ్గినా ఒక్కపైసా గూడా ఇచ్చేది లేదు'' అన్నాడు.
దానికి గోపాలు ''అవునయ్యా... నిజమే... ఈ రోజు వరకూ మీ మాట ఎప్పుడు కాదంటి. చెప్పండి ఏం చేయాల్నో'' అన్నాడు. అప్పుడా వ్యాపారి ''నాకు ఆహా... అబ్బాలు కావాలి. అవి తెచ్చిచ్చి నీ డబ్బులు నీవు తీసుకోనిపో'' అన్నాడు. ఆ మాటలకు గోపాలు అదిరిపన్నాడు. నోటమాట రాలేదు. ''వీడు తక్కువోడు కాదురా. ఏదో ఒక మెలిక పెట్టకుండా వూరుకోడు'' అనుకున్నారు వచ్చిన జనాలంతా. గోపాలుకు ఈ ఆహాలు, అబ్బాలు యాడ దొరుకుతాయో అర్థంకాక కనబన్న వారినంతా అడగసాగినాడు.
అట్లా అడుక్కుంటా పోతా వుంటే ఒక ముసిలోడు జరిగిందంతా విని ''రేయ్‌... మనకు కుడిపక్క ఏడూర్ల తరువాత టక్కుపల్లిలో సుబ్బయ్య అని ఒకాయన వున్నాడు. ఆయనది అట్లాంటిట్లాంటి తెలివి కాదు. ఎటువంటి చిక్కు సమస్యనైనా చిటికెలో విప్పేయగలడు. ఆయన దగ్గరికి పో. నీకు దారి చూపిస్తాడు'' అని చెప్పినాడు.
గోపాలు పొద్దున్నే లేసి సద్ది కట్టుకోని టక్కుపల్లికి బైలుదేరినాడు. ఎండ నడినెత్తికొచ్చే యాళకి సుబ్బయ్యను చేరుకోని జరిగిందంతా చెప్పినాడు. టక్కుపల్లి సుబ్బయ్యకు వ్యాపారి చేస్తావున్న మోసం మీద కోపం, గోపాలు అమాయకత్వం మీద జాలీ కలిగినాయి. దాంతో బాగా ఆలోచించి లోపలికి పోయి పైన బట్ట కట్టి  వున్న రెండు మట్టి ముంతలను తీసుకోనొచ్చి గోపాలు చేతిలో పెట్టి ''పో... పోయి నీ యజమానిని వీటిని ఒకదాని తర్వాత ఒకటి తెరవమను. ఆహాలు, అబ్బాలు దొరుకుతాయి'' అని చెప్పినాడు.
గోపాలు ఆ రెండు ముంతలు తీసుకోని తిరిగి వ్యాపారి దగ్గరికి చేరుకున్నాడు. ''ఇదేదో... వింత... చూద్దామాగు'' అని ఊరి జనాలంతా పిల్లా జెల్లాను సంకకెక్కించుకోని వ్యాపారి ఇంటి ముందు మూగబన్నారు. వ్యాపారి అందరి ముందూ ఒక ముంతకున్న బట్ట తొలగించినాడు.
అంతే... అందులోనుంచి రెండు చూడముచ్చటయిన రంగురంగుల సీతాకోకచిలుకలు రెక్కలు టపటపా కొట్టుకుంటా బైటకి ఎగిరి వచ్చినాయి. ఆ అందమైన సీతాకోకచిలుకలని చూసి వ్యాపారి ''ఆహా... అద్భుతం. ఎంత బాగున్నాయివి'' అన్నాడు. వెంటనే గోపాలు నవ్వుతా ''అయ్యా... మీరు చెప్పినట్లే ఆహా ఇచ్చినాను. ఇక అది గూడా తెరవండి అబ్బా గూడా దొరుకుతుంది'' అన్నాడు.
ఆ మాటలకు వ్యాపారి ''అరెరే... అనవసరంగా నోరు జారి 'ఆహా' అన్నానే. ఇక 'అబ్బా' మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గూడా అనకూడదు'' అని అనుకున్నాడు. నోరు బిగబట్టుకోని రెండవదాని మూతికున్న బట్ట తొలగించినాడు. కానీ దానిలోంచి ఏమీ బైటకు రాలేదు. దాంతో ''ఏందిరా... ఏమీ రాలేదు. అసలిందులో ఏమన్నా వున్నాయా... లేదా'' అంటూ లోపలికి చేయి పెట్టినాడు.
అంతే... ఎప్పట్నుంచో బైటకు రాలేక లోపల తనకలాడుతా వున్న ఒక పెద్దతేలు చేయి లోపలికి పెట్టడం ఆలస్యం కోపంతో వేలు మీద కసుక్కున ఒక్కటేసింది. 
ఇంకేముంది...
సుర్రుమనేసరికి నొప్పికి తట్టుకోలేక వాడు ''అబ్బా...'' అంటూ గట్టిగా అరిచినాడు. అది చూసి గోపాలు నవ్వుతా ''అయ్యా నీవు కోరినట్లే అబ్బా గూడా ఇచ్చినాను. ఇంక నా డబ్బులు నాకియ్యండి'' అన్నాడు.
ఇదంతా చూసిన వూరోళ్ళందరూ ''అబ్బా ఏం కొట్టినాడ్రా దెబ్బ. తెలివంటే టక్కుపల్లి సుబ్బయ్యదే'' అని కిందామీదాపడి నవ్వసాగినారు. వ్యాపారి లబలబలాడుతా లోపలికి పోయి గోపాలుకు ఇవ్వవలసిందంతా తెచ్చి ఇచ్చేసినాడు. ఆ డబ్బులన్నీ తీసుకోని గోపాలు నవ్వుకుంటా పోతా వుంటే... ఆ వ్యాపారి మాత్రం నొప్పికి ఏడ్చుకుంటా ఆన్నే వుండిపోయినాడు.
**********

కామెంట్‌లు