కుందేలు కొబ్బరి కాయలు - చిన్నారుల కోసం చిన్న కథ -డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
 ఒక అడవిలో ఒక కుందేలు వుండేది. ఎండలో తిరిగి తిరిగీ దానికి బాగా వేడి చేసింది. దాంతో అది మంచమెక్కింది. అది చూసి పిల్లకుందేలు బాధపడతా వుంటే కోడిపుంజు చూసి "చూడల్లుడూ! కొబ్బరినీళ్ళు చానా చలువ. అవి గనుక మూడు పూటలా తాపించినావనుకో దెబ్బకు వేడంతా దిగిపోయి మళ్ళా మునుపటి మాదిరి ఐపోతాది. పో... పోయి ఎవరినన్నా అడిగి కొన్ని కాయలు తీసుకొని రాపో" అని చెప్పింది.
పిల్లకుందేలు కొబ్బరికాయల కోసం పోతా వుంటే దారిలో ఒక మేక కనబడింది. వెంటనే అది "మేక మామా... మేక మామా... మా అమ్మకు వేడి చేసింది. కొబ్బరి నీళ్ళు మూడుపూటలా తాపితే ఒళ్ళు చల్లగయి వేడి తగ్గుతుందట. కొన్ని కాయలు కోసివ్వవా” అని అడిగింది.
దానికా మేక "చూడు పాపా... మీలాగే నేను గూడా కొబ్బరిచెట్టు ఎక్కలేను. పోయి కోతిమామ ఎక్కడున్నాడో వెదికి పట్టుకో. అదయితే ఎంత పెద్ద చెట్టయినా సరే... సరసరసర ఎక్కేసి కాయలు తెంపుతాది" అని చెప్పింది.
పిల్లకుందేలు అలాగేనని కోతిని వెదుక్కుంటా బైలుదేరింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఆ కోతి ఒక కొబ్బరిచెట్టు మీద హాయిగా కొబ్బరినీళ్ళు తాగుతా కనబడింది. అది చూసిన పిల్లకుందేలు 'కోతిమామా కొన్ని కాయలు కోసివ్వవా. మా అమ్మకు వేడి చేసి మంచం మీద పడిపోయింది' అంది.
కానీ ఆ కోతికి చాలా పొగరు. చిన్ని కుందేలు మాటలను కొంచం గూడా పట్టించుకోకుండా "ఫో.. ఫో... నీకు కాయలు తెంపివ్వడం కన్నా నాకింకేం పని లేదనుకుంటున్నావా. ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం నిలబడ్డావనుకో ఒక కాయ తెంపి నెత్తి మీదికి విసురుతా చూడు. దెబ్బకు తల పగిలిపోతాది" అంటూ భయపడించింది.
కోతి అలా అనేసరికి పాపం... కుందేలు పిల్లకి ఏడుపొచ్చింది. కళ్ళనిండా నీళ్ళు కారిపోతా వుంటే బాధతో ఇంటికి పోసాగింది. అంతలో దానికి ఒక ఏనుగు ఎదురొచ్చింది. "ఏం పాపా... అలా కళ్ళనీళ్ళు పెట్టుకోని పోతా వున్నావు. ఏమయింది” అని అడిగింది. కుందేలు పిల్ల జరిగిందంతా చెప్పింది.
అది విన్న ఏనుగు "అరెరే... కోతి అలా అనిందా. ఐనా ఆపదలు వచ్చినపుడు ఒకరికొకరు సాయం చేసుకోకుంటే ఎలా . దా నావెంబడి" అంటూ కుందేలు పిల్లను మీద ఎక్కించుకోని కొబ్బరిచెట్టు దగ్గరికి పోయింది.
కొబ్బరి చెట్టు మీద కోతి హాయిగా కొబ్బరినీళ్ళు తాగుతా వుంది. ఏనుగు తొండంతో కొబ్బరి చెట్టును బలంగా పట్టుకొని వేగంగా అటూ యిటూ వూపసాగింది. పైన వున్న కోతి అదిరిపడింది. "ఏయ్... ఏనుగు మామా... ఎందుకలా వూపుతా వున్నావు. కిందపడేలా వున్నా. ఆపాపు” అంటూ గట్టిగా కంగారుగా అరిచింది.
పక్కవాళ్ళ గురించి కొంచం గూడా పట్టించుకోని నీలాంటి వాళ్ళతో నాకు అనవసరం. నీవు కిందపడి... కాలిరిగితే నాకేమి, చెయ్యిరిగితే నాకేమి. మాకు కొబ్బరికాయలు కావాలి అంతే..." అంటూ మరింత గట్టిగా సరసరసర ఊపసాగింది. కోతికి గిర్రున కళ్ళు తిరగసాగాయి. భయంతో కొబ్బరి మట్టను గట్టిగా పట్టుకోని "ఏనుగు మామా... బుద్ది పొరపాటయి అలా అన్నా. ఈ ఒక్కసారికి మన్నించు. ఇంకెప్పుడూ ఎవరినీ అలా బాధపెట్టను. అందరితోనూ కలసిమెలసి మంచిగా వుంటా" అంది వణికిపోతూ. ఏనుగు కొబ్బరిచెట్టును ఊపడం ఆపింది. కోతి బెరబెరా మంచి మంచి నీళ్ళ కాయలు తెంపుకోని కిందికి దిగి వచ్చింది. ఏనుగు అవన్నీ తీసుకోని కుందేలు పిల్లకు ఇచ్చింది. అది సంబరంగా ఏనుగుమామకు , కోతిమామకు ముద్దుపెట్టి కాయలు తీసుకొని ఉరుక్కుంటా ఇంటికి పోయింది.
**********

కామెంట్‌లు