ఎల్లిగాడు మల్లిగాడు (నవ్వుల్లో ముంచెత్తే జానపద కథ) డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
  ఒకామెకు ఎల్లిగాడు మల్లిగాడు అని ఇద్దరు కొడుకులుండేటోళ్ళు. వాళ్ళిద్దరూ కవల పిల్లలు. కవల పిల్లలంటే తెలుసు గదా... చూడ్డానికి ఇద్దరూ అచ్చం ఒకేలా వుంటారన్నమాట. ఎల్లిగాడెవడో, మల్లిగాడెవడో వాళ్ళు చెప్తేగానీ తెలుసుకోలేం. కాకపోతే ఎల్లిగాడు చానా చానా అమాయకుడు. కానీ మల్లిగాడట్లా కాదు బాగా తెలివైనోడు.
ఇద్దరూ పెరిగి పెద్దగైనారు. పెద్దగైనాక్కూడా తల్లి మీదే పడి తింటే మర్యాదేముంటాది. అందుకని ఏదైనా పనెతుక్కోని తమ కాళ్ళ మీద తాము నిలబడాలనుకున్నారు.
మల్లిగాడు వున్న వూర్లోనే సేద్యం చేయడం మొదలుపెట్టినాడు. ఎల్లిగాడు పక్కూర్లో ఒక శెట్టి దగ్గరకు పోయినాడు. ఆ శెట్టి పెద్ద పిసినారి. అంతేగాదు పెద్ద టక్కరోడు. వాడు ఎల్లిగాని అమాయకత్వాన్ని చూసి ''చూడు. నా దగ్గర పనిస్తా... కానీ మధ్యలో మానేయగూడదు. ఖచ్చితంగా చేయాల. మధ్యలో మానేసినావనుకో... నాకు కోడిగుడ్డంత బంగారమియ్యాల. అదే నేను నిన్ను పనిలోనించి తీసేశాననుకో. నేను నీకు కోడిగుడ్డంత బంగారమిస్తా. ఈ ఒప్పందం నీకిష్టమైతే చేరు. లేదంటే లేదు'' అన్నాడు. ఎల్లిగానికి శెట్టి నక్కజిత్తులు తెలియవు గదా. అందుకే అమాయకంగా సరేనంటూ పనిలో చేరిపోయినాడు.
అంతే... ఆరోజు నుండీ శెట్టి వాన్ని రాత్రీపగలూ ఒకటే పని చేయించుకుంటా తెగ సతాయించేటోడు. శెట్టికి ఒక పెద్ద అంగడుంది. రోజూ ఎల్లిగాన్ని పిల్చి ''రేయ్‌... సామానంతా బైటేసి శుభ్రం చెయ్‌'' అనేటోడు. ''రోజూ ఎందుకయ్యా'' అని ఎల్లిగాడంటే చాలు. గయ్యిమని మీదకొస్తూ ''నీకిష్టమైతే చేయ్‌... లేకపోతే మానెయ్‌'' అనేటోడు. పాపం ఎల్లిగాడు నోర్మూసుకోని ప్రతిరోజూ సామాన్లన్నీ బైటపెట్టి శుభ్రం చేసి మళ్ళా అన్నీ లోపల పెట్టేటోడు. శెట్టి ఎల్లిగాన్ని పిల్చుకోని రోజూ తోటకు తీసుకోని పోయేటోడు. బావి పక్కనే ఒక పెద్ద కడవ వుండేది. దాన్నిండా నీళ్ళు తోడమనేటోడు. ఎల్లిగాడు ఎన్ని నీళ్ళు పోసినా అది నిండేది గాదు. ఎందుకంటే దానడుగున శెట్టి ఒక పెద్ద బొక్క పెట్టినాడు. దాంతో పోసిన నీళ్ళు పోసినట్టు కారిపోయేవి. వీడమాయకుడు గదా, వానికి నీళ్ళేమైపోతున్నాయో అర్థమయ్యేది గాదు. శెట్టి తోటంతా బాగా తడిసినాక ''సరే... సరే... ఇంక చాల్లే, బానగూడా నింపలేవు. రేపు నింపుదువుగానీ పద'' అంటూ పిల్చుకోని పోయేటోడు. అలా ప్రతిరోజూ తోటంతా నీళ్ళు పెట్టిచ్చుకొనేటోడు. పాపం కడవలకు కడవలు నీళ్ళు తోడీతోడీ వాని చేతులు పీక్కుపోయేవి.
శెట్టికి ఒక చిన్నపిల్ల వుండేది. శెట్టి పెళ్ళాం ఎల్లిగాన్ని పిల్చి దాన్నెత్తుకోమని ఇచ్చేది. ఎల్లిగాడు ఆ పిల్లను సంకనేసుకోని తిరిగేటోడు. ఎప్పుడన్నా చేతులు నొప్పి పుట్టి కాస్త దించితే చాలు... అది కెవ్వుమని ఏడ్చేది. అంతే...నోటికొచ్చినట్టల్లా శెట్టి, శెట్టి పెళ్ళాం తిట్టేటోళ్ళు. దాంతో పాపం వాడు సంకలు ఎంత నెప్పిపెడ్తావున్నా ముక్కుతా, మూల్గుతా అట్లాగే దాన్ని ఎత్తుకోని తిరిగేటోడు.
ఇంతపని చేపించుకుంటున్నారు గదా... కనీసం అన్నమన్నా బాగా పెడ్తారా అంటే అదీ లేదు. సంగటి, గంజి, మిగిలిపోయిన, పాచిపోయిన అన్నం, కూరలు పెట్టేటోళ్ళు. పాపం... అవి తినలేక వాడు సగానికి సగం చిక్కిపోయినాడు. ఒక నెలరోజులు గడిచేసరికి వానికి బతుకు మీదనే విరక్తి వచ్చింది. పని చేయలేకపోయినాడు. మానేద్దామా అంటే ఒప్పందం ప్రకారం కోడిగుడ్డంత బంగారమియ్యాల గదా దాంతో వానికేం చేయాలో తోచలేదు.
ఒకరోజు అర్ధరాత్రి అందరూ నిద్రపోగానే చెప్పాపెట్టకుండా వాళ్ళూరికి చేరుకున్నాడు. మల్లిగాని దగ్గర కూచోని కళ్ళనిండా నీళ్ళు కారిపోతా వుంటే శెట్టి పెడతావున్న బాధలన్నీ చెప్పుకోని భోరున ఏడ్చినాడు. మల్లిగాడు బాగా ఆలోచించి ''రేయ్‌... నువ్వూ నేను అచ్చం ఒకేలా వుంటాం గదా. నీవు మట్టసంగా ఈన్నే వుండు. నేను పోతా శెట్టి దగ్గరికి. ముందు ముందు ఏం జరుగుతాదో నువ్వే చూద్దువుగానీ'' అంటూ రాత్రికి రాత్రే ఎల్లిగాని బదులు శెట్టింటికి పోయి ఏమీ ఎరుగని అమాయకునిలా మట్టసంగా అక్కన్నే పండుకొన్నాడు.
శెట్టికి ఇదంతా తెలియదు గదా... పొద్దున్నే ఎప్పట్లాగే వాన్ని పిల్చి ''రేయ్‌...సామాన్లన్నీ బైటేసి శుభ్రం చేయ్‌'' అని చెప్పి వెళ్ళిపోయినాడు. కాసేపటికి వచ్చి చూస్తే ఇంగేముంది. కుండలన్నీ అంగడి ముందు పగిలిపోయి కనబడినాయి. ఇనుప సామాన్లన్నీ లొక్కులు పోయినాయి. ధాన్యమంతా రోడ్డు మీద పడి వుంది. వాడదిరిపడి లబోదిబోమని అరుచుకుంటా ''రేయ్‌... ఏందిరా ఇదంతా'' అంటూ వురుక్కుంటా లోపలికొచ్చినాడు. మల్లిగాడు వినయంగా చేతులు కట్టుకోని ''మీరే గదయ్యా. సామానంతా బైటేసి శుభ్రం చేయ్‌ అన్నారు. అందుకే ముందు అన్నీ బైటేస్తున్నా... ఆ తర్వాత శుభ్రం చేస్తా'' అన్నాడు. దానికి శెట్టి ''అట్లాగేనా విసిరిసిరి పాడేసేది. నెమ్మదిగా పెట్టొద్దూ'' అంటూ మండిపడినాడు. అప్పుడు మల్లిగాడు కోపంగా ''మీరెట్లా చెప్తే అట్లా చెయ్యడమే నా పని. నెమ్మదిగా పెట్టాలని ముందే చెప్పాల గదా'' అన్నాడు. శెట్టి గొణుక్కుంటా అన్నీ ఏరుకోనొచ్చి లోపల పెట్టుకున్నాడు.
తర్వాత వాన్ని పిల్చి ''రేయ్‌... తోటకాడికి పోయి బాన నిండా నీళ్ళు నింపిరాపో'' అన్నాడు. మల్లిగాడు సరేనని పోయి రెండు బిందెల నీళ్ళు పోసినాడు. పోసిన నీళ్ళు పోసినట్టు మాయమయినాయి. ఇదేందబ్బా ఇట్లా మాయమవుతున్నాయని బాన ఎత్తి చూసినాడు. చూస్తే ఇంగేముంది... కింద అరచేయంత బొక్క కనబడింది. ''ఓహో... ఇదన్నమాట సంగతి'' అని మైనం తీస్కోనొచ్చి ఆ బొక్క బూడ్చి నిండా నీళ్ళు నింపి ఇంటికి పోయినాడు. వాన్ని చూసి శెట్టి ''ఏందిరా ఇప్పుడైతే పోతివి. అప్పడే వచ్చేస్తివి'' అన్నాడు. దానికి వాడు నవ్వి ''ఏముందయ్యా. బాన నిండింది. అందుకే వచ్చేసినా'' అన్నాడు. శెట్టి వురుకులు పరుగుల మీద పోయి చూస్తే ఇంకేముంది బాన నిండా నీళ్ళు కనబన్నాయి.
మల్లిగాడు హాయిగా ఈలేసుకుంటా కూచోగానే శెట్టి పెళ్ళాం వాన్ని పిల్చి ''రేయ్‌. దీన్ని ఎత్తుకోని తిప్పుకోని రాపో...'' అంటూ పిల్లను చేతికిచ్చింది. వాడు ఎత్తుకోని పక్కకు తీస్కోని పోయి ఎవరూ చూడకుండా దాని పిర్ర మీద గట్టిగా ఒక్క గిచ్చు గిచ్చినాడు. అంతే అది లబోదిబోమని ఏడ్చడం మొదలుపెట్టింది. వాడు పిల్లను తీస్కోని పోయి ''అమ్మగారూ... ఇది ఏడుస్తా వుందండీ'' అంటూ తిరిగి శెట్టి పెళ్ళానికి ఇచ్చేసినాడు. ఆరోజు నుండి ప్రతిసారీ పిల్లనివ్వడం ఆలస్యం దాన్ని గట్టిగా ఒక్క గిచ్చు గిచ్చేటోడు. అంతే అది ''ఓ'' అని ఏడుపందుకొనేది. ఇంకేముంది కొంతకాలానికి పాపమా పిల్ల వాన్ని చూస్తే చాలు భయంతో వణికిపోయేది. వాడు ఎత్తుకోడానికి చేతులు చాపడం ఆలస్యం కెవ్వుమని ఏడుస్తా వాళ్ళమ్మను గట్టిగా కర్చుకునేది. అది ఎందుకలా ఏడుస్తా వుందో తెలీక శెట్టి పెళ్ళాం గొణుక్కుంటా తానే ఎత్తుకోని తిరగసాగింది.
దాంతో... మల్లిగాడు పనీపాటా లేకుండా దర్జాగా తిరగడం మొదలుపెట్టినాడు. శెట్టికి వానికేం పని చెప్పాలన్నా భయం పట్టుకోనింది. ఏదో ఒకటి పగలగొట్టేటోడు. దాంతో వాన్నెలా వదిలించుకోవాలా అని ఆలోచించసాగినాడు. పోనీ పని మానెయ్యమందామా అంటే ఒప్పందం ప్రకారం కోడిగుడ్డంత బంగారమియ్యాల గదా అది వానికిష్టం లేదు.
ఒకరోజు శెట్టి పెళ్ళాం శెట్టిని పిల్చి ''వాన్ని మా నాయనోళ్ళ వూరికి తీస్కోని పోయి ఆడ కొన్నిరోజులు పనికి పెట్టు. వాళ్ళయితే వీనికి బాగా బుద్ధి చెబుతారు'' అనింది. శెట్టి సరేనన్నాడు.
తర్వాత రోజు పొద్దున్నే శెట్టి మల్లిగాన్ని పిల్చి ''రేయ్‌.... మనం మా అత్తోళ్ళ వూరికి పోవాల, బైలుదేరు'' అన్నాడు. మల్లిగాడు సరేనన్నాడు. శెట్టి పెళ్ళాం ఇద్దరికీ వేరు వేరు మూటల్లో అన్నం కట్టిచ్చింది. శెట్టి దాంట్లోనేమో బాగా బచ్చాలూ, లడ్లూ, కర్జికాయలూ పెట్టి, మల్లిగాని దాంట్లోనేమో సంగటి, ఎండుకారం పెట్టి ''రేయ్‌. ఇది నీకు, ఇది మీ అయ్యగారికి'' అని చెప్పి ఇచ్చింది. సరేనని ఇద్దరూ బైలుదేరినారు. అప్పట్లో బస్సులు, రైళ్ళూ లేవు గదా. యాడికి పోవాలన్నా నడచి పోవాల్సిందే.
ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటా పోసాగినారు. అట్లా రెండు గంటలు నడిచేసరికి శెట్టికి పొద్దున తిన్నదంతా అరిగిపోయి ఆకలి కావడం మొదలుపెట్టింది. దాంతో ఒకచోట ''రేయ్‌... నాకు బాగా ఆకలవుతా వుంది. పోయి ఆ నది దగ్గర మొగం కడుక్కోనొస్తా. తిని పోదాం'' అని చెప్పి మొగం కడుక్కోడానికి పోయినాడు. శెట్టి అట్లా పోయినాడో లేదో వెంటనే మల్లిగాడు గబగబా శెట్టి మూట విప్పి అందులోని లడ్లు, భక్షాలు, కర్జికాయలు అన్నీ లొట్టలేసుకుంటా నున్నగా తినేసినాడు. తన మూట విప్పి అందులోని సంగటి, ఎండుకారం శెట్టి మూటలో పెట్టి కట్టేసి ఏమీ ఎరుగని అమాయకునిలా మట్టసంగా కూచున్నాడు. శెట్టి శుభ్రంగా కాళ్ళూ చేతులూ కడుక్కోని రాగానే ''ఏందయ్యగారూ. అమ్మగారు సంగటీ, గొడ్డుకారం పెట్టింది. తినలేక చచ్చిపోయినాననుకో. ఇంతకూ నీకేం పెట్టింది'' అన్నాడు. శెట్టి తన మూట విప్పినాడు. మల్లిగాడు దాంట్లోకి తొంగి చూసి ''అరెరే. నీక్కూడా సంగటీ కారమేనా, నీకు మంచివి పెట్టి నాకు పాడువి పెట్టిందనుకున్నా... అమ్మగారెంత మంచిది. ఇద్దరికీ ఒకే రకంగా పెట్టింది'' అన్నాడు.
శెట్టికి సంగటి, కారాన్ని చూస్తానే పై ప్రాణాలు పైన్నే పోయినాయి. ఏం మాట్లాడాల్నో అర్థం కాలేదు. వాటిని చూస్తా వుంటే భయమేయసాగింది. ఎందుకంటే పుట్టి బుద్ధి ఎరిగినప్పన్నించీ ఎప్పడూ సంగటీ కారం తినలేదు. కానీ కడుపులోనేమో ఆకలి దంచేస్తా వుంది. దాంతో లోలోన గొణుక్కుంటా ఒక్కొక్క ముద్దా బలవంతంగా మింగసాగినాడు. కారం దెబ్బకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. కొంచెం గూడా తినలేక చేయి కడిగేసుకున్నాడు. మళ్ళా ఇద్దరూ నడవడం మొదలు పెట్టినారు.
అట్లా... కాస్త దూరం నడిచేసరికి శెట్టికి నీరసమొచ్చేసింది. సరిగ్గా తినలేదు గదా. దాంతో ఆకలెక్కువైంది. మల్లిగాన్ని పిల్చి ''రేయ్‌...నేను నడవలేకుంటున్నా. నువ్వు వురుక్కుంటా పోయి మా అత్తోళ్ళకు మంచి భోజనం వండి నేనొస్తూనే పెట్టమని చెప్పు, నేను నెమ్మదిగా వస్తా'' అన్నాడు. మల్లిగాడు సరేనని వురుక్కుంటా పోయి శెట్టి వాళ్ళ వూరికి చేరుకున్నాడు.
వాడు శెట్టి అత్తోళ్ళింటికి పోయి ''నన్ను నీ కూతురు పంపిచ్చింది. నీ అల్లుడు వెనుకే వస్తా వున్నాడు. అల్లుడొస్తున్నాడు గదా అని మీరు మంచి మంచి పిండి వంటలు చేసి పెట్టేరు. ఈ మధ్యే నీ అల్లునికి పచ్చకామెర్ల రోగమొచ్చింది. నెల రోజులు పత్యముండాలంట. సంగటి, పచ్చికారం తప్ప ఏమీ తినగూడదని వైద్యుడు చెప్పినాడంట. జాగ్రత్త'' అని చెప్పినాడు. వాళ్ళు నిజమే అనుకోని ''సరే'' అన్నారు.
శెట్టి నెమ్మదిగా నడుచుకుంటా వచ్చేసరికి మధ్యాన్నమైంది. కడుపులో సలసలసల కాగిపోతా వుంది. అందరూ భోజనాలకు కూచున్నారు. శెట్టి అత్త అందరికీ పిండి వంటలు పెట్టింది. అల్లునికి మాత్రం సంగటీ, పచ్చికారం పెట్టింది. వాటిని చూస్తానే శెట్టి అదిరిపోయినాడు. చుట్టూ వున్నోళ్ళంతా లొట్టలేసుకుంటా ఆవురావురని తింటా వున్నారు. వాటిని చూస్తే శెట్టికి నోట్లో నీళ్ళూరసాగినాయి. కానీ అడిగితే అందరూ ఏమనుకుంటారో ఏమో అనుకోని ఆకలికి తట్టుకోలేక ఆ సంగటీ, పచ్చికారమే తిన్నాడు. ఎప్పడూ అలవాటు లేదుగదా. అందుకే అది తిన్న కాసేపటికి శెట్టి కడుపులో గుడగుడమనసాగింది. చెంబు పట్టుకోని వూరి చివరన వున్న చెరువు కాడికి పోయొచ్చినాడు. వచ్చిన కాసేపటికే మళ్ళా గుడగుడమనింది. శెట్టి మళ్ళా పోయొచ్చినాడు. రాత్రయింది. మళ్ళా మామూలే. అత్త అందరికీ పిండి వంటలు పెట్టి అల్లునికి మాత్రం సంగటీ, కారమే పెట్టింది. అత్త అట్లా ఎందుకు చేస్తా వుందో అర్థంగాక... కక్కలేక మింగలేక పాపం శెట్టి మళ్ళా అవే తిన్నాడు.
రాత్రి అందరూ ఆరుబైట మంచాలేసుకొని పండుకొన్నారు. శెట్టికేమో కడుపులో గుడగుడలాడసాగింది. చుట్టూ చీకటి. భయమేసింది. నెమ్మదిగా మల్లిగాన్ని లేపి ''రేయ్‌... కడుపులో గుడగుడమంటోంది. పోయి చెంబు తాపో... చెరువుకాడికి పోయొద్దాం'' అన్నాడు.
మల్లిగాడు అటూ ఇటూ చూసి ''అయ్యగారూ...ఈ రాత్రిపూట చెరువుకాడికి మాటిమాటికీ ఎన్నిసార్లని పోతావు. అసలే అమావాస్య. పాములూ, తేళ్ళూ తిరుగుతా వుంటాయ్‌. తొక్కినావంటే అంతే'' అని భయపడిచ్చినాడు. శెట్టి కడుపు పట్టుకోని ''మరెట్లరా'' అన్నాడు. దానికి మల్లిగాడు ''అందరూ హాయిగా గురుకలు పెట్టి నిద్రపోతా వున్నారు. మీద బండ పన్నా లేసేటట్లు లేరు. నేనొక కుండ తెచ్చి పెడ్తా. మీకు గుడగుడమన్నప్పుడల్లా అందులో కూచోండి. తెల్లారక ముందే చీకట్లో నన్ను లేప్తే నేను దాన్ని తీస్కోనిపోయి దూరంగా పడేసొస్తా'' అన్నాడు. శెట్టి ''సరే'' అన్నాడు. మల్లిగాడు ఒక కుండ తెచ్చి శెట్టి మంచం దగ్గర పెట్టి నిద్రపోయినాడు. శెట్టికి రాత్రంతా కడుపు గుడగుడమంటానే వుంది. దాంతో నెమ్మదిగా కుండ నిండిపోయింది.
పొద్దున్నే నాలుగైంది. ఇంకో గంట దాటితే ఒకొక్కరే లేవడం మొదలుపెడ్తారు. శెట్టి నెమ్మదిగా మల్లిగాని దగ్గరకు పోయి ''రేయ్‌...లేవరా... తెల్లవారుతోంది. కుండ పాడేసి రాపో'' అన్నాడు. మల్లిగాడు ఏమీ వినబడనట్లు అట్లాగే పండుకున్నాడు. శెట్టి ఎన్నిసార్లు తట్టినా వులకలేదు, పలకలేదు... శెట్టికి ఏం చేయాల్నో అర్థం కాలేదు. పొద్దున్నే అత్తామామా, బావమరుదులు చూస్తే ఇంగేమన్నా వుందా? పరువు పోతాది. దాంతో ఇక లాభం లేదనుకోని పారేసి రావడానికి కుండ తీసుకోని అడుగులో అడుగేసుకుంటా నెమ్మదిగా ఇల్లు దాటినాడు.
శెట్టి అట్లా బైటకి పోయినాడో లేదో మల్లిగాడు టక్కున నిద్రలేసినాడు. వురుక్కుంటా పోయి అత్తామామలను, బావమరుదులను గబగబా లేపి ''మీరు మీ అల్లునికి నిన్న సరిగా మర్యాద చేయలేదంట. అలిగినాడు. అందుకే పొద్దున్నే ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతా వున్నాడు'' అన్నాడు. వాళ్ళు నిజమా కాదా అని లేచి వచ్చి చూస్తే ఇంగేముంది శెట్టి మంచమ్మీద లేడు. గబగబా బైటకొచ్చి చూస్తే దూరంగా పోతా కనబన్నాడు.
''అల్లుడూ కాస్త ఆగు'' అంటూ గట్టిగా అరచినారు. ఆ అరుపు విని శెట్టి అదిరిపడినాడు. చేతిలో కుండ చూస్తే ఇంకేమన్నా వుందా? మర్యాద పోతాది గదా, అందుకని వాళ్ళ అరుపులు విననట్టే నటిస్తూ బెరబెరా నడవడం మొదలుపెట్టినాడు. అది చూసి అత్తామామా అల్లుడు నిజంగానే అలిగి పోతున్నాడనుకొని అల్లున్ని వెనక్కు పిల్చుకోని రావడం కోసం ''ఆగల్లుడూ.. ఆగల్లుడూ..'' అనరుస్తా వెంట పడినారు.
అంతే... అది చూసి శెట్టి అదిరిపడి వాళ్ళకు దొరకగూడదని తాను కూడా వురకడం మొదలు పెట్టినాడు. శెట్టి వెనుకే అత్తామామా, బావమరుదులూ అందరూ ఆగాగని అరుస్తా వురకడం మొదలుపెట్టినారు. శెట్టి గసబెడతా ముళ్ళ మీదా, దిబ్బల మీదా అడ్డం పడి వురకసాగినాడు. అంతలో ఎదురుగా ఒక పెద్ద బోటురాయి అడ్డం వచ్చింది. శెట్టి దాన్ని చూసుకోలేదు. అంతే అది కాలికి తగిలి దభీమని ఎగిరి బోర్లబొక్కలా పడిపోయినాడు. చేతిలోని కుండ గూడా ఎగిరి కిందపడి ఫెటిళ్మని పగిలిపోయింది. అంతే అందులో వున్నదంతా వాని ఒళ్ళంతా చిట్లింది. ఆడికి వురుక్కుంటా వచ్చిన అత్తామామా ఆ కంపుకు ముక్కు మూసుకున్నారు. బావమరిది మొగమంతా వికారంగా పెట్టి ''ఏంది బావా... ఇదంతా'' అన్నాడు. శెట్టి నెత్తీనోరూ కొట్టుకుంటా మల్లిగాని వల్ల తాను పడిన బాధలన్నీ కళ్ళనీళ్ళుబెట్టుకోని ఏడ్చుకుంటా చెప్పినాడు.
అదంతా విని ''కోడిగుడ్డంత బంగారం కోసం ఎందుకు నీకీ తిప్పలు. ఇట్లాగే వుంటే ముందు ముందు వాడు నిన్ను ఇంగెన్ని బాధలు పెడ్తాడో ఏమో... ముందు వాన్ని వెంటనే పని మాన్పించు'' అన్నారు. శెట్టి సరేనని మల్లిగాన్ని పని మాన్పించి ఒప్పందం ప్రకారం కోడిగుడ్డంత బంగారం వాని చేతిలో పెట్టి పంపేసినాడు.
మల్లిగాడు హాయిగా నవ్వుకుంటా దాన్ని తీస్కోని వాళ్ళూరికి పోయి ఎల్లిగాని చేతిలో పెట్టినాడు.
**********

కామెంట్‌లు