భారతరత్న- మహర్షి!(అచ్యుతుని రాజ్యశ్రీ)
 కొందరు విస్తృత ప్రచారంతో అందరికీ తెలుస్తారు.ఇంకొందరు మీడియా ప్రచారం లేక మరుగున పడుతారు.అలాంటి అద్భుత వ్యక్తి  ఆయన!
కష్టాల కొలిమిలో పుట్టి 104ఏళ్ళు జీవించిన గంధపుచెక్క!18ఏప్రిల్ 1858లో షెరోలీలో పుట్టారు.ఒకప్పుడు  గుజరాత్ పాలకుడు దామోజీ గాయక్వాడ్ కి ఆరున్నర లక్షలు అప్పుఇచ్చిన వంశం నేడు ఆకలితో  అలమటిస్తూకూడా దేహి అనలేదు. ఓసారి ఆపిల్లాడు తల్లితో అన్నాడు "అమ్మా! బరోడా మహారాజు బ్రాహ్మణులకి 10రూపాయలు ఆవుని దానం చేస్తున్నారు. నేను అన్న వెల్తాం". ఆతల్లి ఖరాఖండిగా చెప్పింది " ఇతరుల నించి  ఏదీ ఆశించవద్దు." మురుద్ అనే చిన్న పల్లెలో వినాయక్ సోమన్ అనే సార్ శిక్షణలో ఆపిల్లాడు 4వక్లాస్ పాసైనాడు.గుడిలో న్యూస్ పేపర్లు ఊరందరికీ చదివి విన్పించేవాడు.నెలకి 3రూపాయల జీతంతో ఓషాపులో సరుకులు అమ్మా డు. ఆరోజుల్లో 6వక్లాస్ పాసైతే  టీచర్ ఉద్యోగం వచ్చేది.కానీ 17 ఏళ్ళు నిండిన వారు మాత్రమే ఆపరీక్షకు అర్హులు. 
ఆబాలుడు 150మైళ్ళు కాలినడకన స్నేహితులతో కల్సి
సతారా చేరాడు.అది వర్షాకాలం! బక్కగా పొట్టిగా ఉన్న అతనికి "నీకు 17ఏళ్ళు లేవు.పరీక్షకి అనర్హుడివి" అనటంతో పాపం వెనుదిరిగాడు.ఆ పై ఏడాది పరీక్షలో 5వరాంక్ రెండు రూపాయల స్కాలర్షిప్ పొందారు. 15వ ఏట రాధాబాయితో పెళ్లయింది. అన్న నెలకి 4రూపాయలు పంపేవారు.ఈ యువకుడు నెలకి రెండు అణాల ఫీజు తీసుకుని ట్యూషన్ చెప్తూ బాంబే ఎల్ఫిన్స్టన్ కాలేజ్ నుంచి లెక్కలు లో డిగ్రీ పొందారు. 
రోజు నాలుగున్నరకి లేచి పెరుగన్నం తిని నడుస్తూబడికి వెళ్లేవారు. నలుగురు పిల్లలని తన దగ్గర పెట్టుకొని చదివించారు.నాగపంచమి రోజు భార్య మురుద్ లో చనిపోతే నిర్వికారంగా మర్నాడు బడికి తెల్లారి 6గంటలకి చేరారు.గోపాల కృష్ణ గోఖలే సలహాపైపూనాలో ఫెర్గూసన్ కాలేజీలో ప్రొఫెసర్ గా చేరారు.
స్నేహితులు బంధువుల బలవంతం పై  గోదుబాయి అనే వితంతువుని పెళ్లాడి  ఆమె పేరునిఆనందీబాయి గా మార్చారు. సంఘం అమ్మ అన్న అక్క ఆయన్ని వెలివేశారు.ఊరిచివర పూరిగుడిసెలో కాపురం 1900లో హిన్ గ్నే అనే గ్రామంలో అనాధవితంతువులకు ఆశ్రమం నెలకొల్పారు. వర్షాకాలం లో కూడా 4మైళ్ళు నడిచి సరుకులను మోసుకుంటూ ఆశ్రమం లో  ఇచ్చేవారు.
ఇక ఆయన భార్యను ఎవరూ పలకరించేవారు కాదు.వితంతువు మళ్ళీ పెళ్లాడిందని వారి బాధ! ఆయనపై అవాకులు చవాకులు  నీలాపనిందలు పేపర్లు ప్రచురించాయి. 1907లో పూనేలో మహిళా విద్యాలయం నెలకొల్పారు. 1916లో  ఇండియన్ ఉమెన్ యూనివర్సిటీ ని నెలకొల్పారు. 
యూరప్ అమెరికా  ఆసియాలో చాలా దేశాలు పర్యటించారు. ఐన్ స్టీన్ ని కలిశారు. గ్రామీణబాలలకోసం ప్రైమరీ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. 1955లో పద్మ విభూషణ్ 1958లో నూరవ పుట్టిన రోజు  పోస్టల్ స్టాంపు విడుదల ఆయన సేవలకు సత్కారాలు! మాతృభాష లో బోధన 20 ఏళ్ళు వచ్చిన  తరువాత ఆడపిల్లకి పెళ్లి చేయాలి అని ఆయన చెప్పిన మాటలు గాలిదుమారం లేపాయి.9నవంబర్ 1962 లో అమరులైనారు.అందరిమంచి కోరు అనేది ఆయన చెప్పిన మాట! అదే ఆనాడు మంత్రంలా పనిచేసింది. స్త్రీల అభ్యున్నతి కై కృషి చేసిన ఆయన మహా మనీషి మహర్షిగా నిల్చారు🌷
ఆయన పూర్తిపేరు ధోండో కేశవ కార్వే!

కామెంట్‌లు