ఓ మనిషీ! నీతోనే ఈ ముచ్చట...;-- యామిజాల జగదీశ్
మా ఇంటికి దగ్గర్లో ఉన్న 
ఓ పోస్ట్ బాక్స్ నన్ను చూసి
తన పొట్టలో పొదుగుకున్న మాటలను
నాతో పంచుకుందిలా.....

ఎర్రగా ఉండే నేనిప్పుడు
అంతగా పట్టించుకోని ఓ వృద్ధుడిలా 
మారిపోయాను కదూ!?

వీధి చివర్లలో
వాన నన్ను తడిపి ముద్ద చేసినా
ఎండ నన్ను ఎండపెట్టినా
సంతోషంగా నిల్చున్న నన్నిప్పుడు
పట్టించుకోవడం మానేశావు కదూ!?

ఈనాడు 
ఆధునిక పోకడలైన
వాట్సప్పులూ
ట్విట్టర్లూ
ఇన్ స్టాగ్రాములూ
జీ మెయిల్లూ
ఈ మెయిల్లూ రావడంతో
వాటన్నింటికీ 
అరచేతిలో ఇమిడే 
సెల్ఫోన్లతో 
నా వంక కన్నెత్తి 
చూడటం మానేశావుగా
నేనిప్పుడు 
పనికిరాని 
వయస్సు మళ్ళిన
మనిషిలా కనిపిస్తున్నా కదూ నీకు!?

పరుగులు పెట్టక
స్తంభాన్ని అంటిపెట్టుకుని
నిల్చునే నేనంటే నీకు 
చులకన కదూ...

కానీ
మరచిపోకు
ఒకప్పుడు మీ అందరికోసం 
దూతగా
వ్యవహరించిన వాడిని నేను!

ఆనందమేమిటీ దుఃఖమేమిటీ
నవ్వులేమిటీ కన్నీళ్ళేమిటీ 
కోపమేమిటీ ప్రేమేమిటీ
అన్ని రకాల మాటలతో
గుట్టుగా 
చూసిన వాడిని నేను...
ఏవీ దారి తప్పక
మీరెక్కడికి పంపాలనుకున్నారో
వాటిని నా పొట్టలో
జాగర్తగా ఉంచుకుని 
నా మనిషి రాగానే అతనితో 
పంపిచేసే వాడిని మీ మీ సుఖదుఃఖాలను!!

రోడ్ల పక్కనే నా నివాసం కావచ్చు
ఉద్యోగ వేటలో ఉండేవారికి వాకిలిని
ఒకప్పుడు
ఎవరికైనా ఉద్యోగం దొరికితే
మొదటగా తెలిసేది నాకే
అలాగే ఉద్యోగం పోయినా 
మొదటగా తెలిసేదీ నాకే
మంచో చెడో
శుభమో అశుభమో 
దేన్నయినా తెలుసుకుని 
వాటిని సంబంధిత వ్యక్తులకు
తెలియజేయడంలో 
స్థితప్రజ్ఞుడిలా ఉండేవాడిని

కానీ 
నన్నిప్పుడు చూసీచూడనట్లు
వెళ్ళిపోతున్నావుగా
మీ మానవజాతి ఆనందాలనూ పంచుకున్నా
మీ ఆగ్రహావేశాలనూ
చవిచూసినవాడిని

మీ ఇంట పెళ్ళయితే 
మొదటి ఆహ్వానపత్రిక నాకే
ఎందరికో సంతోషాలను
మనసారా పంచాను
ఆశీస్సులూ అందించాను
నిప్పులాంటి మాటలూ తెలుసు
 ప్రియమైన మాటలూ తెలుసు                     
అయ్యలతో చెప్పు
అమ్మలతి చెప్పు
యువతరానికైతే 
నాగురించి తెలీకపోవచ్చు...
మీకు నేను గుర్తుకు రావడం లేదా
మీ కంటికి కనిపించడం లేదా
నేనెవరోనని....
నన్ను 
ఓ బ్రహ్మపదార్థంలా మార్చేసేరేమిటీ
మీ ముందర ఓ ఆశ్చర్యార్థక చిహ్నంలా
నిల్చున్న నన్ను ఒకప్పుడు
మీరెంతలా ప్రేమించారో గుర్తుందా

పోనివ్వండీ
ఏం చేయనూ
మీకూ సెల్ఫోన్లు ఉన్నాయనేగా 
నన్నిలా అపూర్వంగా నిలబెట్టేశారు
పరవాలేదులెండి
గతాన్ని నెమరేసుకుంటూ
గడిపేస్తాను
వీధి చివర్లలో స్తంభానికి వేలాడుతూ!!

మీరు నిర్లక్ష్యం చేయొచ్చు కానీ
ఎప్పుడో ఒకటీ అరా వచ్చే ఉత్తరాలనైనా 
నేను పదిలంగా స్వీకరించి
నా మనిషితో అవతలివారికి
చేరవేస్తాను 
నా బాధ్యతను నేనెప్పుడూ తప్పను
అయినవారికీ కానివారికీ
ఎవరికైనా కావచ్చు
నా మనసు నిష్పక్షమే
సురక్షితమే....


కామెంట్‌లు