సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -96
దండాపూప న్యాయము
****
దండము అంటే కఱ్ఱ.అపూపము అంటే పిండివంట,అప్పచ్చి,తినుబండము,పప్ప అనే అర్థాలు ఉన్నాయి.
అప్పచ్చులమూట/ పిండివంట కట్టిన కఱ్ఱను ఎలుక కొరికిందని తెలిసిన తర్వాత దానికి కట్టిన అప్పచ్చులమూటను  సైతం ఎలుకే తినివుంటుందని చెప్పడానికి ఎలాంటి సందేహమూ లేదనే అర్థంతో ఈ దండాపూప న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే దండాపూపికా న్యాయము అని కూడా అంటారు.
దీనికి తెలుగులో "నిప్పు లేనిదే పొగ రాదు" అనే సామెతకు అన్వయించుకోవచ్చు.
ఎందుకంటే  అప్పచ్చులమూట ఉన్న కర్రనే కొరికిన ఎలుక అప్పచ్చుల మూటను కొరకకుండా ఉంటుందా? అంటే ఉండదనే కదా అర్థం.
అలాగే మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరో ఒకరు ఏదో కాని పని చేస్తే ... అది నెమ్మది నెమ్మదిగా ఆనోటా ఈనోటా అంతటా వ్యాపిస్తుంది.ఇంత కాలం అతని పట్ల ఉన్న గౌరవ భావం పోతుంది."నిప్పు లేనిదే పొగ ఎలా వస్తుంది"అనే గుసగుసలు మొదలవుతాయి.
గతంలో అతను ఏవో పొరపాట్లు చేసి తర్వాత ఎంత బుద్ధిగా ఉన్నా ,గతం తాలూకూ నీలినీడలు వెంటాడుతూనే ఉంటాయి.అతడిని తెలివిగా అందులో ఇరికించి గత చరిత్రను చూడమనే సందర్భాలూ ఉంటాయి.నిజానిజాలు తెలిసేంతవరకు అతడిని దోషిగా ఊహించడం సహజం.
కాబట్టి దోషిగా, దొంగగా ఒకసారి ముద్ర పడిన తర్వాత అది అంత త్వరగా పోదు అనే అర్థంతో ఈ దండాపూప న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా  ఒకే ఒక్క తప్పు, పొరపాటు వల్లో లేదా అపోహ వల్లనో అప్పటి వరకు చేసిన మంచి అంతా  పోయి దోషిగా నిలబడి అందరి నోళ్ళలో నానాల్సి వస్తుంది.
 నిజం నిలకడ మీద తెలిసే దాకా చేయని తప్పుకు శిక్ష మాత్రం పడాల్సి వస్తుంది.
 ఇలా రెండు విధాలుగా ఈ "దండాపూప న్యాయమును"  ఉదహరించడం పరిపాటి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు