పశ్చిమ గోదావరి జిల్లా : ద్వారకా తిరుమల*
 *⚜ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం🙏*
💠 కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని ఏడుకొండలూ ఎక్కి చూడలేకపోతేనేం.. స్వయంభువుగా ప్రత్యక్షమైన చిన్న తిరుపతి అయినా చూస్తే చాలు అనకుంటారు చాలామంది భక్తులు.
పరమ పవిత్రమైన “ద్వారకా తిరుమల”ను దర్శించుకుంటుంటారు.
 
💠 తిరుమల వెంకటేశ్వర ఆలయము పిమ్మట వెంకటేశ్వరుని ఆలయములలో అంతే క్షేత్ర పురాణముతో పాటుగా అంతటి మహత్తు కలిగిన దివ్య క్షేత్రముగా భక్తులు నమ్మేది ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయం. 
💠 ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు.
స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. 
💠 ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. 
ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతి ఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవారు. అతనికి ముసలితనం వచ్చి ఆలయానికి అంత దూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ పుట్టలో  వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. 
💠 స్వామివారు చీమల పూట్ట నుండి ఉద్భవించినందున అభిషేకం చేసిన విగ్రహం పై పడే నీటిబొట్లు వలన స్వామి విగ్రహము క్రిందనున్న ఎర్రచీమలకు హానిజరుగును కావున ఆలయమందు స్వామివారికి అభిషేకము చేయకపోవడం ఇక్కడి విశేషం. 
 
💠 చెట్లుకొట్టి కట్టెలు అమ్ముకోవడం-దారుకం వృత్తిగా కలవారు , దారువులు (చెట్లు) ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది.
💠 త్రేతాయుగంలో రాముని తాత అయిన అజ మహరాజు ఇందుమతిని పరిణయమాడటానికి స్వయంవరానికై ఈ దారిలో ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్లకుండా తిన్నగా స్వయంవరానికి వెళ్ళేసరికి... అక్కడి సామంత రాజులతో వైరం ఏర్పడి పెద్ద యుద్ధంలా మారింది. 
దీనికి కారణం దారిలో ఉన్న స్వామివారిని దర్శించకుండా వెళ్లడమే కారణమని తలచి ఆ మర్నాడు ఈ ఆలయానికి స్వయంగా వచ్చి పూజ గావించిన పిమ్మట అక్కడి పొరుగు రాజ్యపు రాజుల మనసులు హఠాత్తుగా మారి అజ మహరాజుతో యుద్దం మానివేశారట.
💠 సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమలలో ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండడం అరుదు.
💠 ఇక్కడ కొలువుండే వెంకటేశ్వరుడు రెండు రూపాలుగా మనకు సాక్షాత్కరించడం విశేషం.
ముందు భాగం కేవలం సగానికే ఉండి మిగతా భాగం పాతాళంలో ఉన్నట్లుగా ఉంటాయి. 
వెనక వున్న ప్రతిమ పూర్తిగా దర్శనమిస్తుంది. ముందు భాగంలో పాతాళలోకంలో ఉన్న స్వామివారి కాళ్లను పాతాళ లోకాధిపతి బలిచక్రవర్తి పూజిస్తాడని ప్రతీతి. 
అయితే స్వామివారి వెనక భాగాన్ని మాత్రం 11వ శతాబ్దానికి చెందిన వైష్ణవ భక్తుడు శ్రీమద్ రామానుజాచార్యులవారు ప్రతిష్టించారు. 
💠 "పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి) లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు.
 కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం.
💠 అర్ధమండపంలో అమ్మవార్లు పద్మావతి మరియు బీబీనాంచారి విగ్రహములు తూర్పుముఖంగా ప్రతిస్థించబడి దర్శనమిస్తాయి. 
గుడి ప్రవేశంలో  మెట్ల ప్రాంభంభంలో పాదుకా మండపంలో స్వామివారి పాదాలు ఉన్నవి. స్వామి పాద దర్శనం పిమ్మట భక్తులు ఆలయ ప్రవేశం చేస్తారు.
💠 గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలు ద్వారం పైభాగాన సప్తర్షుల విగ్రహాలు ఉన్నవి.
గర్భగుడి చుట్టూ 108 దివ్యదేశములు కీర్తించిన 12 ఆళ్వారుల శిల్పములు ఉన్నాయి. ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మంటపంఉంది. ధ్వజస్తంభం వెనుక ఆంజనేయస్వామి, గరుడుని మందిరాలు ఉన్నాయి. 
💠 ఈ గుడి యొక్క సంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. 
ఇందుకు కారణం- 
స్వయం భూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు. 
ఈ రెండు విగ్రహాలకు అనుగుణంగా రెండు కళ్యానోత్సవాలను అత్యంత వైభవోపేతంగా ఈ చిన్న తిరుపతిలో నిర్వహిస్తారు.
💠 స్వామివారి పుష్కరిణికి  సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ అంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన (చక్రం) ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. 
ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు తెప్పోత్సవం జరుపుతారు.
💠 ఇక్కడ విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనేవి ఉన్నాయి. 
పర్వదినాలలో తిరు వీధుల సేవ జరిగినపుడు ఆ మండపాలలో స్వామిని "వేంచేపు" చేసి, అర్చన, ఆరగింపు, ప్రసాద వినియోగం జరుపుతారు.
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
🙏🙏🕉️🕉️🙏🙏
Nagarajakumar.mvss

కామెంట్‌లు