*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0261)*
 
బ్రహ్మ, నారద సంవాదంలో.....
రుద్రునికి దేవతల మొర - రుద్రని ఊరట - చిత్రరథుని రాయబారం - రుద్ర దేవుడు యుద్ధానికి వెళ్ళడం - పుష్పభద్రనదీ తీరంలో శంఖచూడుని దూతతో శివుడు మాట్లాడటం......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! శివదూత అయిన చిత్రరథుడు శంఖచూడుని సందేశంతో కైలాసం వైపు వెళ్ళగానే, శంఖచూడుడు తన భవనములోకి వెళ్ళి తన భార్య తులసికి, జరిగిన విషయం అంతా చెప్పాడు. శంకరునితో యుద్ధం చేయడానికి సన్నద్ధమై బయలుదేరుతున్నాను అని కూడా చెప్పాడు. తన భార్యకు అన్నివిధాలా నచ్చ చెప్పి, యుద్ధానికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు.*
*తెల్లవారిన తరువాత, తన సామంతులను, మంత్రులను, పురోహితులను పిలిపించి, విషయము చెప్పి, అన్ని విధాల అర్హుడైన తన కుమారుని, సకల దానవ సామ్రాజ్యానికి రాజ్యాభిషిక్తుని చేసాడు. తన భార్యను, రాజ్యమును, సకల సంపదలను కుమారునికి అప్పజెప్పాడు. తులసి, ఎన్నో విధాలుగా శంఖచూడుని దృష్టి యుద్ధం నుండి మరలించే ప్రయత్నం చేస్తుంది. కానీ, దైవం తలంపును తప్పించడం ఎవరి వల్ల కాదు, కదా! తులసికి వీరగాధలు వినిపించి, ధైర్యం చెప్పి, సేనాధిపతిని పిలిచి, "మన వీరులు అందరూ, కవచములు తొడిగి, అస్త్ర, శస్త్రములు సిద్ధం చేసుకుని, దైత్యుల ఎనుబది అరు విభాగముల వీరులు, యాభై కులాల అసురులకు శత్రువైన, దేవతల పక్షపాతి అయిన శంభుని మీదకు యుద్ధానికి బయలయ దేర దీయండి. నా అదేశము అనుసరించి రాక్షస జాతిలోని వీరులు అందరూ, రుద్రునితో సంగ్రామానికి సిద్ధం కావాలి" అని చెప్పాడు.*
*మూడులక్షల అక్షౌహిణి సైన్యమును వెంట బెట్టుకుని, అసుర రాజు, మహాబలి శంఖచూడుడు, అతని సేనాపతి ముందు నడువగా గురుజనులతో కూడి యుద్ద రంగానికి కదిలాడు. పుష్పభద్రావతీ నదీ తీరంలో ఉన్న సిద్ధాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ, అందమైన, పెద్ద వటవృక్షము ఉంది. ఇది కపిల మహాముని తపోస్థానము. స్వచ్ఛమైన నీటితో నిండి, పుష్పభద్ర, సరస్వతీ నదులు అక్కడ ప్రవహిస్తున్నాయి. హిమాలయముల నుండి బయలుదేరిన పుష్పభద్రనది, సరస్వతీ దేవితో కలసి, గోమంత పర్వతానికి ఎడమ వైపుగా సముద్రంలో కలుస్తుంది. అక్కడ, యుద్ధానికి సన్నద్ధంగా ఉన్న శంభుని సేనను చూసాడు శంఖచూడుడు.*
*అప్పుడు, శంకరుని దగ్గరకు దూతగా వచ్చిన, దానవ శ్రేష్టుడు, శంభునితో, "దేవదేవా! యుద్ధం చేయకండి. ఈ యుద్ధం వల్ల ఎవరికీ లాభం ఉండదు" అని చెప్పాడు. అప్పుడు, ఈశానుడు, "యుద్ధం జరగక పోవడం నాకు కూడా ఇష్టమే. అయితే, మీరు చెర పట్టిన దేవతల నందరినీ విడిచి పెట్టి, వారి రాజ్యము వారికి ఇచ్చి, మీరు వెనుదిరిగి వెళ్ళండి" అని చెప్పారు. ఇంకా కూడా ఇలా చెప్పారు. "పరమేశ్వరుడు గా నేను ఎప్పుడూ, నా భక్తుల పక్షపాతిని. వారి కోరికలు తీర్చడానికి నేను కట్టబడి ఉంటాను. ఉన్నాను. నా అంతగా నేను నిర్ణయం తీసుకుని ఎవరి మీదకూ యుద్ధానికి రాను. దేవతల సమూహం, కష్టకాలంలో నన్ను తలచుకుని, నా శరణు కోరి, తమ కష్టాలు తీర్చమని వేడుకున్నప్పుడు, నేను వారి పక్షాన పోరు చేస్తాను. ఇప్పుడు కూడా దేవతా సమూహం, కోరిక మేరకే ఈ యద్ధానికి వచ్చాను. దానవ రాజా! ఇప్పటి దాకా నా చేత సంహరింబడిన దానవులు ఎవరూ కూడా, నీ స్థాయి వారు కాదు. నీకు సాటి రారు. నువ్వు, శ్రీకృష్ణుని పార్షదులలో ఉత్తముడైన వాడివి. కనుక నీతో యద్ధము చేయడం నాకు కూడా సమ్మతమే. నాకు దేవతల కోరిక తీర్చుట ముఖ్యమైన విషయం. కాబట్టి, యుద్ధం తప్పదు" అని చెప్పి, మాహేశ్వరుడు మౌనం వహించగా, శంఖచూడుని దూత, తన చక్రవర్తి దగ్గరకు బయలయదేరాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు