*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0266)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
హిరణ్యకశిపుని తపస్సు- బ్రహ్మ వరములు-నారసిహుని ద్వరా వధింపబడటం- ప్రహ్లాద రాజ్యాభిషేకం......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరూ కశ్యపుని కుమారులు. దానవాంతకుడైన శ్రీహరి ధరించిన వరాహస్వామి రూపంచేత తన సోదరుడు హిరణ్యాక్షుడు మరణించాడు అని తెలుసుకుని, హిరణ్యకశిపుడు ఎంతో బాధను అనుభవించాడు. విష్ణువు మీద క్రోధం పెంచుకున్నాడు. తన సోదరుడైన హిరణ్యాక్షునికి నీటి తర్పణాలు ఇచ్చి, తాను విష్ణువును జయిస్తాను అని చెప్పి ఆతని భార్యలను అందరినీ ఊరడించాడు. ఎదుటి వారిని బాధపెట్టి, చంపి తినడంలో సంతోషాన్ని చూసుకునే తన అసుర సైన్యాన్ని దేవతల మీదకు పంపాడు. వారు, తృప్తిగా యుద్ధం చేసి దేవతలను బాధ పెట్టి, కొందరిని అంతమొందించి, తమ దానవరాజు హిరణ్యకశిపుని కి ఆనందం కలిగించారు. వారి ధాటికి తట్టుకోలేక దేవతలు రహస్యంగా మారు వేషాలలో భూమి మీద ఉంటున్నారు.*
*ఇలా కాలం గడుస్తుండగా, "నేను అజేయుడను, అమరుడను, అజరుడను అవ్వాలి. ముల్లోకాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలాలి. నన్ను ఎవరూ చంపలేకుండా ఉండాలి" అని తలచి మందరాచలమునకు వెళ్ళాడు. అక్కడ ఒక లోతైన గుహలో ఒంటికాలి బొటన వేలిమీద నిలబడి, చేతులు రెండు పైకి పెట్టి, దృష్టి ఆకాశం మీద ఉంచి, భయంకరమైన తపస్సు చేసాడు. ఆ తపస్సు ప్రభావంతో వెలువడిన అగ్ని వల్ల దేవతల ముఖాలు మాడిపోయాయి. ఈ హిరణ్యకశిపుని బాధలు తట్టకోలేని దేవతలు తమ వికృతమైన ముఖాలతో బ్రహ్మ లోకం వచ్చి, నాకు తమ దీనావస్థ అంతా వివరించారు. అప్పుడు, బ్రహ్మ నైన నేను, భృగువు, దక్షుడు మొదలైన వారిని వెంట బెట్టుకుని, అన్ని లోకాలను తన తప ప్రభావానికి గురి చేస్తున్న ఆ దైత్యరాజు దగ్గరకు వరములు ఇచ్చి అతనిని శాతింప చేయడానికి, తపస్సు జరుగుతున్న ఆశ్రమానికి వెళ్ళాను.*
*హిరణ్యకశిపుడు తన ముందు నిలుచుని, కావలసిన వరము అడుగు అన్న తన తాత అయిన నన్ను చూచి, తాను, "ప్రజాపతీ! తాతా! నేను, స్వర్గంలో గానీ, భూమి, ఆకాశాల మీద గానీ, పగలు గానీ, రాత్రి గానీ, నేలమీద గానీ, పాశము, వజ్రము, ఏ శస్త్రము చేతగానీ, వృక్షము, జలము, అగ్ని, దేవ, దైత్య, ముని, సిద్ధ, యక్ష గంధర్వుల చేతగానీ, ఇంతెందుకు నీచే సృష్టింబడిన ఏవస్తువు, వ్యక్తి చేత కూడా చంపబడకూడదు" అని వరమడుగాడు.*
*విష్ణు మూర్తని మనసులో తలచుకుని, "మనవడా! నీవు 69 వేల సం. సుదీర్ఘమైన తపస్సు చేసావు. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నేను వరము ఇస్తున్నాను. ఇప్పుడు రాజ్యాభిషక్తుడవు అయ్యి, రాజ్యపాలన చేస్తూ, హాయిగా జీవించు" అని హిరణ్యకశిపుడు కోరిన వరము ఇచ్చి అతనిని దానవరాజ్యానికి అభిషిక్తుని చేసాడు, బ్రహ్మ.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు