మట్టి మనుషులు; - డా.నీలం స్వాతిచిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
ఆధునికత.... అభివృద్ధి
బహుశా మన ముందు ఇప్పుడు వున్న లక్ష్యాలు ఇవేనేమో...
పొద్దున్న లేచింది మొదలుకొని విజ్ఞానం వెంట పరుగులు పెడుతూ ఉంటాం... 
ప్రపంచదేశాలతో పోటీ పడుతూ ఉంటాం...
గడిచిన కాలంలో
అనుకున్న దానికంటే
వేగంగానే అభివృద్ధి జరిగింది…జరుగుతూనే వుంది కూడా...
ఎటు చూసినా భవనాల అంతస్తులు పెరిగి పోతున్నాయి...
విచ్చల విడిగా పట్టణాలు విస్తరించి పోతున్నాయి...
రింగు రోడ్లు నగరాల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి...
ఎలెక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ ఫోన్ లు
మెట్రో రైళ్లు, విమానాలు, 
హాళ్లు, మాళ్లు,కార్లు,బార్లు,ఇలా ఒక్కటేంటి ఆధునికత పుణ్యమా అని
సకల సౌకర్యాలను సంపాదించుకున్నాము...
నచ్చినట్టుగా వుంటూ
విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తూన్నాము…
ముప్పూటలా తిని హాయిగా సేద తీరుతున్నాము...
కానీ మన కోసం రేయనక, పగలనక,ఎండనక, వాననక ఆరుగాలం శ్రమిస్తూ 
ఆకలి తీర్చే రైతన్నల గురించి ఎప్పుడైనా కనీసం ఆలోచించామా...???
దుక్కిదున్ని, విత్తునాటి 
కోతకోసి,కుప్పనూర్చి మెతుకులు అందించే రైతుల చితికిన బ్రతుకుల 
కథనాలు వివరాలను కాసింతైన విశ్లేషించ గలిగామా???
తరతరాలుగా రైతులు ప్రభుత్వాల చేతుల్లో, పాలకుల చేతుల్లో మోస పోతూనే వున్నారు...
దళారుల చేతుల్లో దగా పడుతూనే వున్నారు...
పెట్టుబడికి తగినంత రాబడి లేక అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఆత్మహత్యల పాలవుతున్నారు...
ఇలానే సాగుతూ పోతే ఒకనాటికి రైతులు అన్న వారే ఉండరేమో...
ఏ వస్తువుకైనా ధరను నిర్దేశించే హక్కు దాని యజమానికి వుంటుంది కానీ 
ఒక్క రైతుకు మాత్రమే తాను కష్టపడి పండించే పంటకు వెల నిర్దేశించే హక్కు లేని వాడైయ్యాడు...
వేదికల ప్రసంగాలలో అన్నపూర్ణ దేశం మనదంటూ, రైతే రారాజంటూ,
రైతులు దేశానికి వెన్నుముక అంటూ గొప్పగా కితాబులు ఇచ్చి చేతులు దులుపు కోకుండా...
తగిన వేతనాన్ని, తగిన గౌరవాన్ని రైతన్నలకు అందే ఏర్పాట్లు చేద్దాం...
బ్రతకలేక బలైపోతున్న అన్నదాతల ఆశయాలకు ఆయువు పోద్దాం...


కామెంట్‌లు