అమర సందేశం;- కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్య విస్తరణ అధికారి,8555010108.
ఉత్తరాయణ వైశాఖ శుద్ధ పూర్ణిమ శుభదినం 
బుద్ధ భగవానుని స్మరించుకునే జయంతోత్సవం 
లుంబినిలో జననం గయలో జ్ఞానోదయం
మాయాదేవి శుద్దోధనుల రాకుమార రత్నం! 

జనన మరణ చక్రం ఛేదనకై 
సత్యాన్వేషణ జ్ఞాన సంపద సాధనకై 
రాజభోగం వీడిన లోకకళ్యాణ కారకుడు! 

పూలు పరిమళాలు వెదజల్లుటకు పుట్టినట్టూ 
దైవస్వరూపాలు సమాజ హితానికై అవతరిస్తారేమో! 
బౌద్ధ ప్రవక్త భూమిపై ఉద్భవించిన దినం బుద్ధపూర్ణిమ! 

వృద్ధాప్యం రోగం మరణ మూలాలు వెతుకుటకై 
కఠోర ధ్యాన దీక్షతో 
బోధివృక్షం చెంత జ్ఞానదీపం వెల్గించే
స్వయం కృషితో 
అంతర్గత శక్తుల వెలికి తీసిన సత్యాన్వేషి 
పరమోన్నత స్థితి కోసం పరితపించిన యుగపురుషుడు! 

జ్ఞానానికి మించిన ధనం లేదని 
సత్యం అహింస సన్మార్గం వైపు అతని ప్రస్థానం
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన జ్ఞాన బోధకుడు! 

విశ్వంలో శాశ్వతమేది లేదనీ
ప్రతిదీ పరిణామం చెందుతుందని 
ప్రాపంచిక సుఖాలు జీవిత పరమార్ధం కాదనీ 
జ్ఞాన సంపాదనకై దుఃఖానికి మూలమైన                                             
కోరికలు జయించాలని చాటిన శాక్యముని!

సత్యం నమ్రత సదాచారం 
సద్ విచారం సమృద్ధి సద్గుణం 
ఉన్నత లక్ష్యం ఉత్తమ ధ్యానమనే 
అష్టాంగ మార్గంలో పయనించి 
అజ్ఞాన తామసి అగాధం నుంచి 
జ్ఞానోదయం వైపు నడిపించే మార్గదర్శకుడు!

అవనిపై అంతరాలు లేని సమాజ మతని ఆకాంక్ష 
అహింస భూతదయ సద్భావన పరమ ధర్మమని 
అశేష జనవాహినికి 
అమర సందేశ మిచ్చిన అర్కబంధువు! 

అవివేకంలోంచి వివేకంలోకి ప్రస్థానం
బుద్ధ భగవానుని అనుసరణీయ మార్గం!
(మే5, బుద్ద జయంతి సందర్భంగా..)
 


కామెంట్‌లు