మల్లె పూల పిల్ల (జానపద అద్భుత కథ)--డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
 ఒకూర్లో ఒక ముసిలామె వుండెది. ఆమె చానా పేదది. చానా మంచిది కూడా. ఆమెకు ఒక కూతురుంది. ఆ యింట్లో ఈ యింట్లో పని చేస్తా తాను తిన్నా తినకపోయినా కూతురికి మాత్రం పెడ్తా బాగా ప్రేమగా చూసుకునేది. కొన్నాళ్ళకా పాప పెరిగి పెద్దగయింది. ఆమెది అట్లాంటిట్లాంటి అందంగాదు. అచ్చం మెరుపుతీగలెక్క వుంటాది. చూడచక్కనైన ముఖం. తల్లి తన కోసం కష్టపడతా వుంటే చూడలేక ఆ పాపగూడా రోజూ అడవికి పోయి, కట్టెపుల్లలన్నీ ఏరుకోనొచ్చి వూర్లో అమ్మి అమ్మకు డబ్బులు తెచ్చిచ్చేది.
ఒకరోజు ఆ పాప అడవిలో పోతా వుంటే దారిలో ఒకచోట ఒక ముసలిముని మంచి ఎండలో కిందపడి మూలుగుతా కనబన్నాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అయ్యోపాపమని ఆ పాప వురుక్కుంటా పోయి చేయి పట్టుకోని చూస్తే జ్వరంతో ఒళ్ళు సలసలసల కాగిపోతా వుంది. ఆ పిల్ల చానా మంచిది గదా... అయ్యో పాపమని మునిని ఎత్తుకోనిపోయి ఒక పెద్దచెట్టు కింద చల్లని నీడలో పన్నబెట్టింది. దగ్గర్లోని చెరువు నుంచి నీళ్ళు తెచ్చి ఒళ్ళంతా తడిబట్టతో తుడిచింది. వురుక్కుంటా వూర్లోకి పోయి వైద్యున్ని అడిగి మందులు తెచ్చి ఏసింది. పొద్దున్నించీ రాత్రి వరకూ తిండి గూడా తినకుండా పక్కనే కూచోని సేవలు చేసింది. దాంతో ఆ ముని నెమ్మదిగా కోలుకున్నాడు.
ఆ పాప చేసిన సాయానికి సంబరపడి ''చూడమ్మా! నేనెవరో తెలీకపోయినా నాకోసం నువ్వు చానా కష్టపన్నావ్‌. పొద్దున్నించీ తిండి గూడా తినకుండా కన్నతల్లి లెక్క చూసుకున్నావ్‌'' అంటూ తన దగ్గరున్న రెండు కుండలిస్తూ ''ఇదుగోమ్మా! ఈ ఎర్రకుండలోని నీళ్ళు నీ మీద చల్లితే నీవు పూలచెట్టుగా మారిపోతావు. మళ్ళా ఈ నల్లకుండలోని నీళ్ళు చల్లితే మామూలు మనిషయిపోతావు. తీసుకో. కానీ ఆ పూలచెట్టుకు పూసేటివి మామూలు పూలు కాదు. ఏడేడు పధ్నాలుగులోకాల్లోనూ అంత మంచి వాసన ఏ పూలకూ వుండదు. ఎండాకాలమనిలా, చలికాలమనిలా, వానాకాలమనిలా ఏ కాలమయినా సరే పూలు గుత్తులు గుత్తులు పూస్తాయి. వాటిని అమ్ముకోని హాయిగా బతకండి. ముందు ముందు నీకు మంచిరోజులు వస్తాయి'' అని చెప్పి వెళ్ళిపోయినాడు.
ఆ పాప సంబరంగా వురుక్కుంటా వాళ్ళమ్మ దగ్గరికి పోయి విషయమంతా చెప్పింది. అట్లాగా అని వాళ్ళమ్మ ఎర్రకుండలోని నీళ్ళు చల్లింది. కండ్లు మూసి తెరిచేంతలోగా ఆ పాప చక్కని మల్లెపూల చెట్టుగా మారిపోయింది. చెట్టు నిండా పూలే పూలు. కుప్పలు కుప్పలు. వాళ్ళమ్మ సంబరంగా జాగ్రత్తగా దాండ్లను తెంచి కుప్ప పోసి మళ్ళా ఆ పాప మీద నల్లకుండలోని నీరు చల్లింది. ఆ పాప ఎప్పట్లాగే మామూలు మనిషయిపోయింది.
వాళ్ళమ్మ ఆ పూలు తీసుకోని అమ్మడానికి వూర్లోకి పోతే వీధివీధంతా ఘుమ్మని వాసన అదిరిపోయింది. దాంతో జనాలందరు మాకియ్యమంటే మాకియ్యమని ఒకరికంటే ఒకరు డబ్బులు ఎక్కువిస్తామని ఎంటపన్నారు. అట్లా ఆమె నెలకొక్కసారి పూలు తీసుకోనిపోయి అమ్మితే ఆ నెలకంతా కావాల్సినంత డబ్బులొచ్చేవి.
ఆ పూల గురించి, దాండ్ల వాసన గురించి నెమ్మదిగా ఆ వూరి యువరాజుకు తెలిసింది. దాండ్ల వాసన చూసి ఆచ్చర్యపోయినాడు. ఇంతవరకూ ఎప్పుడూ ఎక్కడా ఇట్లాంటి పూల గురించి వినలేదు, చూడలేదు. ఇవి ఆ ముసిలామెకెట్లా వచ్చినాయి అని ఒకరోజు ఆ యువరాజు మారువేషమేసుకోని చెట్టును చూద్దామని వాళ్ళింటికాడికి పోయినాడు. పోయి చూస్తే ఆడ ఒక్క చెట్టు గూడా కనబళ్ళేదు. ''చెట్టు లేదు. మరి పూలెట్లా వస్తున్నాయి? కనుక్కోవా''లని రోజూ రాత్రనకా, పగలనకా ఆ ఇంటి దగ్గర్లోనే ఎవరికీ కనబడకుండా కాపేసినాడు. ఆ ముసిలామెకిదంతా తెలీదు గదా ఎప్పట్లాగానే ఒకరోజు ఆ పాపను కూచోబెట్టి నీళ్ళు చల్లింది. ఆ పాప చక్కని మల్లెచెట్టయిపోయింది. పూలన్నీ కోసుకోని మళ్ళా నీళ్ళు చల్లింది. ఆ పాప ఎప్పట్లాగానే మామూలు మనిషయిపోయింది.
అదంతా దాచిపెట్టుకోని చూస్తా వున్న యువరాజు ఆమె అందం చూసి ''అబ్బ ఎంత చక్కగుందీ పిల్ల! ఆకాశంలో మెరిసే చుక్క లెక్క'' అని మురిసిపోయినాడు. ఈ పిల్లను చేసుకుంటే నా బతుకంతా సంబరాలే సబరాలు అనుకోని ఇంటికి పోగానే అందరికీ విషయం చెప్పి ఆ పిల్లను చేసుకుంటానన్నాడు. కానీ ఈ పాప చానా పేదపిల్ల గదా. దాంతో వాళ్ళమ్మ వద్దనింది. కానీ యువరాజు ''చేసుకుంటే ఆ పాపనే చేసుకుంటా లేకుంటే చచ్చిపోతా'' అంటా అన్నం నీళ్ళు ముట్టకుండా కూచున్నాడు. దాంతో వాళ్ళు తప్పనిసరై ఆ పిల్లను తెచ్చి అంగరంగ వైభోగంగా పెండ్లి చేసినారు. పెండ్లయిన తరువాత ఆమె ముని గురించీ, అతని వరం గురించీ జరిగిందంతా చెప్పింది. అప్పటినుంచీ యువరాజు తనకిష్టమయినప్పుడల్లా ఆమెని పూలచెట్టుగా మార్చి పూలు కోసుకోని మళ్ళా మామూలుగా చేసేటోడు. ఆ పూలు ఎవరికీ ఇచ్చేటోడు కాదు. రహస్యం ఎవరికీ చెప్పేటోడు కాదు.
ఒకరోజు మధ్యాన్నం యువరాజు గదిలోంచి మల్లెపూల వాసనొస్తా వుంటే వాళ్ళమ్మ గమనించి ఎవరికీ కనబడకుండా దాచిపెట్టుకోని కిటికీలోనించి తొంగి చూసింది. యువరాజు పూలు కోసుకుంటా కనబన్నాడు. పూలన్నీ కోసుకున్నాక మళ్ళా ఆమెను మామూలుగా చేసేసినాడు. అదంతా చూసిన ఆమె ''ఓహో ఇదా సంగతి'' అనుకోనింది.
ఆమెకు మొదట్నించీ ఆ పాపంటే ఇష్టం లేదు గదా. ఎట్లాగయినా సరే వాళ్ళని విడదీసి తన తమ్ముని కూతురినిచ్చి మళ్ళా పెండ్లి చేయాలనుకోనింది. ఒకరోజు ఆ దొంగసచ్చినేది యువరాజు ఇంట్లో లేనపుడు ఎవరి కంటా పడకుండా లోపలికి పోయి ఆమె పన్నుకోనుంటే వెనుక నుంచి ఎర్రకుండలోని నీళ్ళు చల్లింది. ఆ పాప ఎట్లున్నదట్లే పూలచెట్టుగా మారిపోయింది. వెంటనే ఆమె చెట్టుకొమ్మలన్నీ విరిచిరిచి పడేసి 'అవన్నీ మూటగట్టి ఒక సైనికున్ని పిలిచి ఎవరికీ కనబడకుండా దూరంగా అడవిలో పాడేసి రమ్మని పంపిచ్చింది. ఆ రెండు కుండల్నీ తీస్కోనిపోయి పగలగొట్టి నీళ్ళన్నీ పారబోసి ఏమీ ఎరుగని నంగనాచి లెక్క మట్టసంగా వుండిపోయింది.
యువరాజు ఇంటికొచ్చి చూస్తే పెండ్లాం కనబల్లేదు. యాడికి పోయిందబ్బా అని ఇండ్లంతా ఆ మూల నుండి ఈ మూలకు, ఈ మూల నుండి ఆ మూలకు వెదికినాడు. కానీ యాడా కనబళ్ళేదు. చుట్టుపక్కల వూర్లన్నిటిలో చూసిరమ్మని సైనికులని పంపించినాడు. ఎవరినడిగినా మాకు తెలీదంటే మాకు తెలీదన్నారేగానీ ఎవరూ ఏమీ చెప్పలేకపోయినారు. దాంతో పెండ్లాన్నే తలచుకుంటా బాధపడతా వుండసాగినాడు.
ఒకరోజు రాజ్యంలోని జనాలంతా గుంపుగా వచ్చి ''రాజా! అడవిలో జంతువులు ఎక్కువయిపోయినాయి. అవన్నీ వూర్లమీద పడి మమ్మల్ని చంపుతా వున్నాయి. నీవే ఎట్లాగయినా కాపాడాల'' అన్నారు. రాజుండేది వాళ్ళని కాపాడ్డానికే గదా... దాంతో యువరాజుని పిలిచి అడవికి పోయి జంతువులను చంపి రమ్మన్నాడు. సరేనని యువరాజు కొంతమంది సైనికులను వెంటేసుకోని అడవికి పోయి కనబన్న క్రూరజంతువునల్లా వేటాడసాగినాడు.
అట్లా అడవిలో పులుల్ని, సింహాల్ని, పాముల్ని చంపుకుంటా పోతా వుంటే ఒకచోట ఘుమ్మని మల్లెపూల వాసనొచ్చింది. ఆ వాసనకు అదిరిపడినాడు. ''అదే వాసన'' అనుకుంటా ఒకొక్క చెట్టే వెదుక్కుంటా.. వెదుక్కుంటా వాసనొస్తావున్న దిక్కు పోతా వుంటే ఒకచోట ఆ పూలచెట్టు కొమ్మలన్నీ విరిగిపోయి, ఆకులన్నీ రాలిపోయి, బాగా వాడిపోయి కనబడింది. దానిని చూసి యువరాజు కండ్లనీళ్ళు పెట్టుకున్నాడు.
ఆ చెట్టుని తీసుకోని ఆకులని సరిచేసి, కొమ్మలకి కట్టుకట్టి, దాన్ని పెద్ద కుండలోనికి మార్చి ''ఎట్లాగబ్బా ఈ చెట్టును మళ్ళా మనిషిని చేయడం'' అని ఆలోచిస్తా వుంటే ఆ నీళ్ళిచ్చిన ముని గుర్తుకొచ్చినాడు. దాంతో ఆ పూలచెట్టు తీసుకోని ఒకొక్క వూరే వెదుక్కుంటా, కనబన్నోళ్ళందరినీ ఆ ముని గురించి అడుగుతా ఆఖరికి ముని వున్న చోటుకి చేరుకున్నాడు. ఆయన కాళ్ళ మీద పడి ''ఎట్లాగయినా సరే నీవే కాపాడాల'' అని కండ్లనీళ్ళు పెట్టుకున్నాడు. సరేనని ముని ఇంట్లోకి పోయి ఏవో నీళ్ళు తీసుకోనొచ్చి మంత్రించి ఆ చెట్టు మీదకి చల్లినాడు. అంతే... ఆ చెట్టు మళ్ళీ మామూలుగా మారిపోయింది. మొగున్ని చూసి ఆమె జరిగిందంతా చెప్పింది.
యువరాజు ఇంటికొచ్చి వాళ్ళమ్మను తిట్టిన తిట్టు తిట్టకుండా బాగా తిట్టినాడు. దాంతో ఆమెకి బుద్ధి వచ్చి తప్పయిపోయిందని ఒప్పుకోని కోడలిని క్షమించమని వేడుకోని ఇంటికి పిల్చుకోనొచ్చింది. అప్పటి నుంచీ అందరూ కలసి మెలసి ఎటువంటి గొడవలూ లేకుండా హాయిగా వున్నారు.
***********

కామెంట్‌లు