బంగారు చేప  గంధర్వకన్య  - అద్భుత జానపద కథ ; -డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212

  ఒకూరిలో ఇద్దరు అన్నదమ్ములు వుండేటోళ్ళు. వాళ్ళలో పెద్దోనికి పెళ్ళయింది గానీ చిన్నోనికి కాలేదు. పెద్దోడు , పెద్దోని పెండ్లాం చానా మంచోళ్ళు. వాళ్ళది వెన్నలాంటి మనసు. తమ్ముడంటే అన్నకు, మరిదంటే వదినకు ఎంతో ప్రేమ. దాంతో ఎటువంటి గొడవలూ లేకుండా అందరూ ఒకే చూరుకింద హాయిగా కలసిమెలసి వుండేటోళ్ళు. వాళ్ళున్న ఇంటికి కొంచం దూరంలోనే ఒక చెరువు వుండేది. చిన్నోడు రోజూ పొద్దున్నే అందరికన్నా ముందే లేచి ఆ చెరువుకాడికి పోయి కాసేపు ఈతకొట్టి, స్నానం చేసి వచ్చేటోడు.
ఒక రోజు అట్లా ఈతకొడతావుంటే ఒక ముచ్చటయిన బంగారు రంగు చేప పక్కకొచ్చింది. “బావా... బావా...” అంటూ చిన్నోడు ఎట్లాపోతే అట్లా రాసాగింది. అట్లా ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు
నెల దాటిపోయింది. ఆ మాటలాడే చేపంటే చిన్నోనికి బాగా ఇష్టం పెరిగిపోయింది. రోజూ పొద్దున్నే రకరకాల పిండివంటలు తీసుకోనొచ్చి దానికి పెట్టసాగాడు. ఇద్దరూ ఏవేవో... ఎన్నెన్నో... కబుర్లు చెప్పుకునేటోళ్ళు. అట్లా ఒక ఆరునెళ్ళు గడిచిపోయినాక ఒకరోజు ఆ చేపపిల్ల చిన్నోనితో “బావా... నువ్వు పోయినప్పటినుంచి తిరిగి ఎప్పుడు వస్తావా అని నా మనసు ఒకటే వుబలాటపడతావుంటుంది. నిన్ను చూడకుండా నేను వుండలేకుంటున్నా. నన్ను పెండ్లి చేసుకోవా” అనడిగింది.
దానికి చిన్నోడు "నువ్వు చెప్పేది నిజమే. నాక్కూడా ఇంటికి పోయినప్పటినుంచీ మళ్ళా ఎప్పుడు పొద్దునవుతుందా... ఎప్పుడు నిన్ను చూస్తానా అని మనసు ఒకటే సతాయిస్తా వుంది. కానీ... నువ్వేమో చేపవి. నేనేమో మనిషిని. మనిద్దరికీ పెళ్ళెట్లా కుదురుతాది. లోకంలో ఇది ఎక్కడయినా జరిగే పనేనా” అని అడిగినాడు. దానికా చేప “సరే... ఐతే ఈరోజు రాత్రికి నువ్విక్కడికి రా” అనింది.
చిన్నోడు సరేనని రాత్రికి అక్కడికి పోయినాడు. పోగానే చేపపిల్ల ఎగురుకుంటా... ఎగురుకుంటా... నీళ్ళలోంచి బైటకొచ్చింది. అలా వచ్చిన కాసేపటికి అది ఒక అందమైన అమ్మాయిలెక్క మారిపోయింది. ఆమెది అట్లాంటిట్లాంటి అందం గాదు. ఏడేడు పద్నాలుగు లోకాల్లోనూ అంత చక్కని పిల్ల యాడా వుండదు. మేను మెరుపుతీగలెక్క మెరిసిపోతావుంటే, కళ్ళు కలువపూల లెక్క కళకళలాడుతా వున్నాయి. చిన్నోడు నోరెళ్ళబెట్టి ఆమెను చూస్తా “అసలు ఎవరు నువ్వు. మనిషివా, దయ్యానివా.... రాక్షసివా, రాకుమారివా... ఎందుకిలా చేపలాగా తిరుగుతావున్నావు” అని అడిగినాడు. దానికామె “ఇప్పటికిప్పుడే
నేనేమీ చెప్పలేను. అలాగే నువ్వు గూడా నా అంతట నేను చెప్పేంత వరకూ నన్నేమీ అడగూడదు. అదిష్టమైతే పెండ్లి చేసుకో... లేదంటే లేదు... కాకపోతే ఒక్కమాట... రాక్షసిని, దయ్యాన్ని మాత్రం కాదు” అని చెప్పింది. చిన్నోడు సరేనని ఆమె చేతిలో చేయి పెట్టి ఒట్టేసి పెళ్ళి చేసుకున్నాడు. ఈ విషయం సొంత అన్నావదినలకు కూడా చెప్పకుండా దాచి పెట్టినాడు. కొంత కాలానికి ఆ చేపకు కడుపు పండింది. ఎప్పుడెప్పుడు తొమ్మిది నెలలు పూర్తవుతుందా... ఎప్పుడెప్పుడు బిడ్డ పుడ్తాడా అని ఇద్దరూ సంబరంగా ఎదురు చూడసాగినారు. ఒక్కొక్క నెల దాటుతా.... దాటుతా... నెమ్మదిగా తొమ్మిది నెళ్ళు నిండినాయి. కొద్దిరోజుల్లో కాన్పనగా ఒక రోజు చిన్నోడు పనిబడి పక్కూరికి పోయినాడు.
ఆదేరోజు పెద్దోని పెండ్లాం మొగునితో “మనం చేపలకూర తినక చానా రోజులయింది గదా... ఎదురింట్లోకి పోయి వల తీసుకోని రాపో... చెరువుకు పోయి చేపలు పట్టుకోనొద్దాం” అనింది. సరేనని పెద్దోడు వల ఇప్పించుకోని వచ్చినాడు. ఇద్దరూ చెరువుకు పోయి వల ఏసినారు. అనుకోకుండా ఆ వలలో ఆ చేప పడింది. అది తమ్ముని పెండ్లాం అని వాళ్ళకు తెలీదు గదా... దాంతో “అబ్బ ఎంత దుబ్బగుందీ బంగారు చేప... మనమేగాక మన వీధివీధంతా పులుసు చేసుకోని తినొచ్చు” అని
సంబరపన్నారు. ఆ చేపను ఇంటికి తీసుకోనొచ్చి కోసినారు. అంతే... ఇంకేముంది... ఆ చేప చచ్చిపోయింది. కానీ... లోపల ఒక పిల్లోడు నవ్వుతా కనబన్నాడు. అది చూసి వాళ్ళు ఆచ్చర్యపోయినారు. విషయం తెలుసుకున్న వూరోళ్ళు “అరే... ఇదేంది చేప కడుపులో మనిషి పిల్లోడా” అని గుంపులు గుంపులుగా వచ్చి చూసిపోసాగినారు. ఎవరి నోటవిన్నా ఈ మాటే. పెద్దోనికి ఏం చేయాల్నో అర్థంగాక ఆ పిల్లోన్ని ఒక గంపలో పెట్టి చెరువులోనే వదిలేయాలనుకున్నాడు.
చిన్నోనికిదంతా తెలీదు గదా... దాంతో పని పూర్తికాగానే ఇంటికి బైలుదేరినాడు. ఇంటి చుట్టూ జనం తిరుణాల లెక్క మూగబడి కనిపించినారు. “ఇదేందబ్బా... ఇంతమంది ఇట్లా చుట్టుకున్నారు”
అనుకోని వురుక్కుంటా వచ్చినాడు. వచ్చి చూస్తే ఇంకేముంది “చచ్చిపోయిన చేప, పక్కన బుట్టలో పిల్లోడు” కనబన్నాడు. వాడు ఆ చేపమీద బడి కళ్ళనీళ్ళు పెట్టుకోని “అన్నా ఈ చేపెవరో కాదు నా పెండ్లామే... వాడు నా కొడుకే” అంటూ కిందామీదా పడి ఏడవసాగినాడు. జరిగిందంతా తెలుసుకొని “అరెరే... తెలీక చేతులారా తమ్ముని పెండ్లాన్ని చంపినామె” అని అన్నావదినలిద్దరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
చిన్నోనికి పెండ్లామంటే చానా ప్రేమగదా... దాంతో “నేనెంతో ఇష్టపడే నా పెండ్లాం పోయినాక నేను మాత్రం బతకడమెందుకు” అనుకోని వురుక్కుంటా చెరువుకాడికి పోయి, వీపుకు పెద్ద బండ కట్టుకోని ఎగిరి నీళ్ళలోకి దుంకినాడు. బండ చానా బరువుంటాది గదా... దాంతో లోపలికి మునిగిపోయినాడు. అంతలో వాన్ని చేయి పట్టుకోని ఎవరో బైటకు లాక్కొచ్చినారు. కళ్ళు తెరచి చూస్తే ఏముంది.... ఒక ముని నవ్వుతా కనబన్నాడు. అది చూసి చిన్నోడు “ఎవరు సామీ మీరు... నన్నెందుకు అనవసరంగా కాపాడినారు. నా పెండ్లాం పోయినాక నాకు మాత్రం ఈలోకంలో ఏంపని” అని వెక్కివెక్కి ఏడుస్తా మళ్ళా దూకడానికి చెరువుకాడికి పోయినాడు.
అప్పుడు ముని గట్టిగా వాని చేయి పట్టుకోని “ఆగు నాయనా... తొందరపడకు. నీ పెండ్లాన్ని బతికించే పూచీ నాది” అంటూ కళ్ళు మూసుకొని ఏదో ధ్యానం చేసి, పిడికెడు విభూది వానికిచ్చి “ఇదిగో... దీన్ని తీసుకోని పోయి నీ పెండ్లాం మీద చల్లు. ఏం జరుగుతుందో నువ్వే చూడు” అని చెప్పినాడు. చిన్నోడు విభూది తీసుకోని వురుక్కుంటా ఇంటికి వచ్చినాడు. చేప రెండు ముక్కలయింది గదా... దాండ్ల మీద చల్లినాడు. అంతే... ఆ రెండు ముక్కలు నెమ్మదిగా జరుగుతా వచ్చి ఒకదానితో ఒకటి కలసిపోయినాయి. మరుక్షణమే ఆ చేప మాయమైపోయి మెరుపుతీగలెక్క మెరిసిపోతా గంధర్వకన్య ప్రత్యక్షమైంది. ఆమె అందం చూసి ఊరోళ్ళందరూ “అబ్బ... ఎంత ముచ్చటగుందీ పిల్ల. అచ్చం బంగారు తీగలెక్క. అదృష్టమంటే చిన్నోనిదే” అని మురిసిపోయినారు.
అంతలో చిన్నోని అన్నా వదినెలు ఆమెతో “అసలు ఎవరునీవు? ఇలా చేపలా మనిషిలా ఎందుకు తిరుగుతా వున్నావు? ఏంది నీ కత?” అని అడిగినారు.
అప్పుడామె "నేనొక గంధర్వకన్యను. ప్రతి పున్నమికి నా స్నేహితురాళ్ళతో కలసి భూలోకానికి వచ్చి అందమైన ప్రదేశాలలో తిరుగుతా వుంటాను. ఒక రోజు అలా ఒక చెరువులో ఈత కొడతావుంటే గట్టుమీద ఒకముని తన మానాన తాను తపస్సు చేసుకుంటా కనబన్నాడు. అప్పట్లో నాది చిన్న వయసు. చిన్నా పెద్దా అనే గౌరవం వుండేది కాదు. ఎవ్వరినీ లెక్కజేసేదాన్ని కాదు. ఆ పొగరుతో మునిని అల్లరి పెట్టాలని మీద నీళ్ళు చల్లినాను. అట్లా చల్లిన వెంటనే చేపలాగా మారిపోయి నీళ్ళలో దాచిపెట్టుకున్నాను.
కానీ... ఆ ముని అట్లాంటిట్లాంటి మామూలు మునిగాదు. చానాచానా మహిమలున్న గొప్పముని. దాంతో దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకోని “ఇక నీవు ఎప్పటికీ చేపలాగే వుండిపోదువుగాక” అని శపించినాడు. దాంతో నా పొగరంతా దిగిపోయింది. ఆముని కాళ్ళమీద పడి ఈ ఒక్క తప్పు క్షమించి నన్ను కాపాడమని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. అప్పుడా ముని కరిగిపోయి “ఒకసారి శాపమిచ్చినాక వెంటనే తిరిగి తీసుకోకూడదు. తప్పుకు శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. కానీ ఇట్లా జీవితాంతం కాక త్వరలో శాపవిముక్తి కలిగే మార్గం చెబుతా.... నువ్వు పగలంతా చేపలాగా వున్నా రాత్రిపూట మాత్రం నీ రూపం నీకు వచ్చేస్తాది. ఎవరయినా నిన్ను పెండ్లి చేసుకోని, నువ్వు చనిపోతే నీ కోసం తన ప్రాణాలుగూడా విడవడానికి సిద్ధపడితే... అప్పుడు నీ రూపం తిరిగి నీకు వచ్చేస్తాది అని చెప్పినాడు. ఈ రోజు చిన్నోని వల్ల నాకు విముక్తి దొరికింది” అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది.
అది విని చిన్నోడు కళ్ళనీళ్ళు పెట్టుకోని “ఐతే... ఇంక నన్ను విడిచి నీ లోకానికి వెళ్ళిపోతావా” అని అడిగినాడు. దానికా గంధర్వకన్య “లేదు లేదు... నన్నింతగా ప్రేమించే నిన్ను, పిల్లోన్ని విడిచి నేనెక్కడికీ వెళ్ళను. చావయినా, బతుకయినా నీతోనే” అనింది. ఆ మాటలకు చుట్టూ వున్న జనాలంతా సంబరపడినారు. పదికాలాల పాటు పిల్లాపాపలతో సంతోషంగా వుండాలని వూరువూరంతా వచ్చి దీవించినారు. అప్పటినుంచి వాళ్లు కంటికి కాటుక లెక్క , ముక్కుకి ముక్కెర లెక్క కలకాలం కలసి జీవించినారు.
*********
కామెంట్‌లు