ఉమ్మడిశ్రమ; - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
 అమరావతి నగరంలోని విశ్రాంత అటవీశాఖా అధికారి రాఘవయ్యతాత గారి ఇంటి అరుగుపై ఆవాడకట్టులోని పిల్లలు అందరు నీతికథ వినడానికిచేరారు.పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన తాత'బాలలు ఐకమత్యంమే మహాబలం అని మన పూర్వికులు ఎప్పుడో చెప్పారు. అటువంటి కథ నేను ఈరోజు మీకు చెపుతున్నాను శ్రధ్ధగా వినండి. పూర్వం ఒక అడవిలో జంతువులు అన్ని ఐకమత్యంగా నివసిస్తూ ఉండేవి.వాటిలొ ఏనుగు,కోతికి తమ ఇరువురిలో ఎవరు గొప్ప అనే వాదులాట జరిగింది.ఇరువురు సింహరాజు గారిదర్శనం చేసుకుని, తమసమస్య విన్నవించాయి.అక్కడ ఉన్న మంత్రి నక్కమామ ''మహరాజ ఈసమస్య నేను పరిష్కరించే అవకాశం కలిగించండి" అన్నాడు. '' సరే '' అన్నడు సింహరాజు.'' మీఇరువురు నది అవతలి పక్కనఉన్న మారేడు చెట్టు చిటారుకొమ్మన ఉన్నమారేడుకాయను తీసుకురండి. అప్పుడు మీ ఇరువురిలో ఎవరు గొప్పవారో నేను చెపుతాను'' అన్నాడు నక్కమామ.అలాగే అని కోతిబావ,ఏనుగు అన్నబయలుదేరి నదితీరానికి వెళ్లాయి.అక్కడ పారు తున్న నీటినిచూసి కోతిబావ భయపడ్డాడు. " తమ్ముడు భయపడక నీవు నాపైన కూర్చో నేను ఈదుకుంటూ నది అవతలి ఒడ్డుకు వెళతాను" అన్నాడు ఏనుగు అన్న.కోతిబావ ఏనుగు పై ఎక్కి కూర్చున్నాడు.నదిలో దిగిన ఏనుగు నెమ్మదిగా ఈదుకుంటూ నది అవతల భాగం చేరాడు.ఇద్దరు మారేడు చెట్టువద్దకుచేరారు.చిటారు కొమ్మన ఉన్న మారేడు కాయ తనకు అందక పోవడంతో,ఎలాఅందుకోవాలి అని ఆలోచించసాగాడు ఏనుగు అన్న. అదిగమనించిన కోతిబావ '' ఏనుగు అన్నా నేను వెళ్లిక్షణాలలో ఆమారేడుకాయ తీసుకువస్తా''అని,చెట్టుఎక్కి మారేడు కాయ కోసుకు వచ్చి ఏనుగు కి అందించాడు.ఇద్దరు సంతోషంగా వెళ్ళి సింహరాజుని దర్శించి నక్కమంత్రిగారికి ఇద్దరూకలసి మారేడు కాయను అందించారు.'' మీ ఇరువురిలో ఈకాయను ఎవరు తేగలిగారు''అన్నాడు నక్కమంత్రి.''మంత్రివర్య నేను నదిని ఈదగలిగాను కాని కాయను చెట్టునుండి తేలేకపోయాను.కోతి కాయతీసుకు రాగలిగిందికాని నదిని ఈద లేక పోయింది.కనుక ఇరువురంకలిసే ఈ కాయను తీసుకురాగలిగాము''అన్నాడు ఏనుగు.''అంటే దీనివలన మనకు అర్దంఅయింది ఏమిటి అంటే,ఉమ్మడిగా కృషిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.ఎంతటికష్టమైనా సమిష్టిగా ఎదుర్కోనవచ్చు అనితెలిసిందికదా,మనలో ఎవరు గొప్పవారు అని ప్రతేకంగా ఉండరు.వారి వారికృషి వారికి వారికి గుర్తింపు తెచ్చి పెడుతుంది.కనుక మీలో మీరు కలహించుకోకుండా ఐక్యంగా జీవించడం నేర్చుకొండి'' అన్నాడు నక్కమంత్రి.బుద్దిగా తలలుఊపిన ఏనుగు,కొతి సంతోషంగా కలసి అడవిలోనికివెళ్లాయి.
బాలలు విన్నారుగా ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చు అన్నాడు తాత.బుద్ధిగా తలలు ఊపారు పిల్లలు అందరు.

కామెంట్‌లు