సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -128
పంజర ముక్త విహంగోడ్డీన న్యాయము
*****
పంజరము అంటే బోను. ముక్త అంటే విడువబడినది, వదులు చేయబడినది, స్వతంత్రముగా చేయబడినది.సాంసారిక బంధముల నుండి ముక్తి పొందినది అనే అర్థం కూడా ఉంది.విహంగ అంటే పక్షి.డీనము అంటే ఆకాశమున నెగురుట
పంజరము నుండి పక్షిని వదిలిన అది ఆకాశంలోకి ఎగిరిపోతుందనీ,దీనినే 'పంజర ముక్త పక్షి చాలన న్యాయము' అని కూడా అంటారు.
పక్షిని పంజరంలో బంధించి దానికి ఇష్టమైనవి ఎన్ని రకాలైన ఆహార పదార్థాలు పెట్టినా అది ఆనందించదు. శ్రమ లేకుండా దొరుకుతుంది కదాని తృప్తి పడదు.పక్షి యొక్క లక్షణం ఎగరడం. ఎగరడానికి అనుకూలంగా శరీర నిర్మాణం కలిగి ఉంటుంది.అలాంటి దానిని పంజరంలో బంధిస్తే...
ఆకాశంలో హాయిగా ఎగరడంలోనే  పక్షికి ఆనందం ఉంటుంది.స్వంతంగా సంపాదించుకోవడం లోనే తృప్తి ఉంటుంది.
మరి ఇలాంటి న్యాయానికి సంబంధించినది బాలల కోసం రాసిన 'స్వేచ్చ ' అనే ఓ గేయ కథను చూద్దాం.ఈ గేయ కథ గతంలోని ప్రాథమిక స్థాయి  తెలుగు పాఠ్య పుస్తకంలో  ఉండేది.
"అన్నయ్య తెచ్చాడు చిన్నికో చిలుక/ చిన్ని తన గారాల చెల్లాయి కనుక"... ఇలా సాగిపోయే ఈ గేయ కథలో చిన్ని చిలుకమ్మకు ఇష్టమైన ద్రాక్ష కొని తెచ్చిపెడితే తినదు. "ఎందుకు తినవు" అని చిన్ని అడుగుతుంది. అప్పుడు"నీకేమి తెలుసులే చిన్ని నా  బాధ... "స్వేచ్చగా నింగిలో సంచరిస్తుంటే... 'దానికన్నా సుఖము నాకెక్కడుంది''బంగారు పంజరమే బంధిఖాన నాకు" పచ్చ పచ్చని చెట్ల మీద ఉంటూ, ఆకాశంలో విహరించడంలోనే ఆనందం ఉందంటుంది.చిలుకమ్మ బాధను అర్థం చేసుకున్న ఆ చిన్ని పంజరం తలుపు తీస్తుంది.చిలుక సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోతుంది .
ఇక్కడ చిలుకను ఉదాహరణగా చెప్పుకున్నాం కదా! దీనినే మనుషులకు వర్తింప చేస్తే ఆధిపత్యపు పంజరంలో చిక్కుకొన్న మనిషికి తన భావాల్ని స్వేచ్చగా వ్యక్తం చేయగలగడం గానీ, స్వేచ్ఛగా బతకగలిగే పరిస్థితి కానీ ఉండదు.
కాబట్టి పక్షికైనా మనిషికైనా   స్వేచ్ఛగా బతకాలనే కోరిక ఉండటం సహజమే.అది హక్కు కూడా.
అలాంటి స్వేచ్ఛను హరించకూడదనే అర్థంతో ఈ "పంజర ముక్త విహంగోడ్డీన న్యాయము"ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 స్వేచ్ఛాయుత వాతావరణంలోనే కదా! పిల్లలైనా, పెద్దలైనా తమ మనసులోని భావాల్ని స్వేచ్చగా వ్యక్తం చేయగలరు, వారిలోని సృజనాత్మకతకు పదును పెట్టుకుని అనుకున్న రంగంలో ఉన్నతంగా రాణించ గలరు.
అయితే పక్షి స్వేచ్ఛకు ఆకాశమే హద్దు అయితే. మరి మనిషి జీవితంలో కూడా స్వేచ్ఛకు హద్దు ఉండాలి అంటారు నార్ల వెంకటేశ్వరరావు గారు వారు రాసిన శతకంలో.అదేంటో చూద్దాం.
"స్వేచ్ఛ యన్నచో  యథేష్ట వర్తన కాదు/నిక్కమైన స్వేచ్ఛ నియతి గలదె/ నియతి లేని స్వేచ్ఛ నిప్పుతో చెర్లాట/ వాస్తవమ్ము నార్ల వారి బాట " 
కాబట్టి విలువలు కలిగిన స్వేచ్ఛ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ పంజర ముక్త విహంగోడ్డీన న్యాయమును సందర్భానుసారంగా గుర్తు చేసుకుందాం.  
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు