సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -130
పట తంతు న్యాయము
*****
పట అంటే వస్త్రము లేదా బట్ట అని అర్థం.తంతు అంటే ఉభయార్థ సాధకమగు ఉపాయము,దారము,పోచ,పోగు,త్రాడు,పేట, బొందు, సూత్రము,నూలు అనే అర్థాలు ఉన్నాయి.
 వస్త్రము లేదా బట్ట అంతటా ఉండేది నూలు లేదా దారమే. వస్త్రముగా నేయక ముందు ఉన్నది దారమే.మళ్ళీ నేసిన వస్త్రాన్ని పురులు పురులుగా విడదీస్తే మిగిలేవి  దారాలే.
నూలుతో చేసిన వస్త్రాన్ని చూసినప్పుడు నూలు వస్త్రంగా పిలువబడుతుంది.దాన్ని విడదీసి చూసినప్పుడు మళ్ళీ నూలు పోగులు కనిపిస్తాయి. వస్త్రం ఎక్కడ నుంచి వచ్చింది అంటే నూలు నుండే.
నూలుతో  తయారు చేసేది వస్త్రం.వస్త్రంలో ఉండేది నూలే అంటే తయారీని బట్టి వస్త్రంగా  మారింది అంతేకానీ అందులో ఉండేది నూలే సుమా! అని చెప్పడానికి ఈ న్యాయాన్ని ఉదాహరణగా తీసుకుంటారు.
 
 మట్టి నుండి తయారు చేసేది కుండ.కుండ ముక్కలై పోతే అందులో కనిపించేది మట్టే.అంటే  వస్తువులుగా  రూపం మార్చుకున్నా  అందులో ఉండేది మట్టినే కదా అని అర్థం.
సముద్రాల సీనియర్ గారు రాసిన సినిమా పాటలో ఈ న్యాయము  స్ఫురించేలా ఏం రాశారో చూద్దాం‌.
 
"కావడి కొయ్యేనోయ్ - కుండలు మన్నేనోయ్/ కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి".. అని రాసిన వాక్యాల అర్థం ఇదే.
కావడి కొయ్య లేదా చెక్కతో తయారు చేయబడిందనీ,కుండ మన్నుతో చేయబడిందనీ ..అంటే వస్తు రూపంలో ఉన్న వాటిని ఆవిధంగా పిలుస్తాం.కానీ తరచి చూస్తే వాటి మూలాలు అవే కదా అని అర్థం అవుతుంది!
ఇలాంటిదే మరో ఉదాహరణ బంగారాన్ని విడిగా చూస్తే బంగారమేగా!అందులో నగ కనిపించదు. కానీ నగగా తయారు చేస్తే మాత్రం అందులో బంగారాన్ని బంగారం అనం. నగ అనే అంటాం. బంగారాన్నే చూడాలి అనుకుంటే నగకు బదులుగా బంగారమే కళ్ళ ముందు కనిపిస్తుంది.
ఇలా ప్రకృతిలో అనేక జీవులను చూస్తాం.జీవులుగానే పిలుస్తాం.కానీ ప్రకృతిగా పిలవము.కానీ జీవులలో ప్రకృతిని దర్శించాలనుకుంటే అప్పుడు ఆ జీవులకు బదులుగా ప్రకృతినే చూడగలం.ఇలా ప్రకృతికీ జీవికి అవినాభావ సంబంధాన్ని  తరచి చూస్తే  ఇందులోని సారమేమిటో అర్థం అవుతుంది.
ఈ విధంగా  "పట తంతు న్యాయము" వెనుక ఇంత పారమార్థిక,ఆధ్యాత్మిక  తంతు దాగి ఉందన్న మాట.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు