సుప్రభాత కవిత - బృంద
మౌనంగా రూపు దిద్దుకున్న
కోరికలన్నీ.... 
ఒక్కసారిగా 
రెక్కలు విప్పుకుని స్వేఛ్ఛగా

విశాల ప్రపంచంలోకి
సీతాకోక చిలుకల్లా
అందంగా.....ఆనందంగా
ఉత్సాహంగా ...ఉల్లాసంగా 

ఎగిరిపోయే సమయం
ఎదురొచ్చినట్టు
తెల్లవారిన తూరుపు
తలుపు తీసిన చందాన

కాలి సంకెలలైన ప్రతిబంధకాలు
తమకు తామే అడ్డు తొలగినట్టు
ఊహించని స్వాతంత్ర్యం 
ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే

వెల్లువైన వెలుగులో
కనులు విప్పార్చి
విస్మయంగా జగతిని 
విడ్డూరంగా చూసుకుంటూ

పూలవనాలు...కొండకోనలు
వెదుకుతూ ...
పూవులపై వాలుతూ
పరిమళాల తేలుతూ

ఆద్యంతాలు లేని
అమర సౌందర్యం 
అవనిపై
ఆవిష్కరించబడుతుంటే

ఆనందం పొందగలిగే
అందమైన మనసు పొందే
అలౌకిక ఆనుభూతికి
ఆకాశమే హద్దు.

ఆగమిస్తున్న వెలుగు పువ్వును
స్వాగతిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు