పరుల మేలు;- సి.హెచ్.సాయిప్రతాప్
 పరనారీ సోదరుడై
పరధనముల కాస పడక పరులకు హితుడై
పరులు తను పొగడ నెగడియు
పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!”
ఈ లోకంలో పైన పేర్కొన్న పద్యంలో8 వున్న ఐదు లక్షణాలు వున్నవారే మహనీయులని చెబుతొంది సుమతీ సతకం లోని పద్యం. ఆ అయిదు లక్షణాలు ఏమిటంటే - పరస్త్రీల పట్ల సోదర భావం చూపేవాడు, పరుల సొమ్ము ఆశిం చనివాడు, ఎల్లప్పుడూ పరుల హితమునే కోరేవాడు, పరులు తనను ప్రశంసించేలా ప్రవర్తించేవాడు, పరులు తనపై కోపించినా తిరిగి వారిపై కోప పడనివాడు.

హితోపదేశం లో ఒక శ్లోకంలో పరస్త్రీలపట్ల ఎలా మెలగాలో చక్కగా నిర్వచించింది.
”మాతృవత్‌ పర దారేషు, పరద్రవ్యేషు లోష్టవత్‌
ఆత్మవత్‌ సర్వ భూతేషు, య: పశ్యతి స పండిత:”
పరస్త్రీలను తల్లులుగా, పరుల సొమ్మును మట్టిబెడ్డలుగా, సకల ప్రాణు లను తనతో సమానంగా ఎవడు చూడగలడో అతడే అసలైన జ్ఞాని అని ఈ శ్లోకార్థం.
పరుల మేలు కోరటం, సంఘ శ్రేయస్సుకు అందరితో కలిసి నడవటం పరమ ధర్మపథంగా మన వేదాలలో చెప్పబడింది. కోటి ధర్మగ్రంథాల సారమంతా అర్థశ్లోకంలో చెబుతానని ఒక పండితుడు ‘పరోపకారం చేస్తే పుణ్యం, పరపీడన చేస్తే పాపం’ అని మరువరాని మాటని చెప్పాడు.
పర హితం మనస్పూర్తిగా కాంక్షించడమే మానవజీవిత సారమని వివేకానందుడు సైతం చెప్పాడు.
పరహితంలో పాటు దానగుణం , సేవా దృక్పధం వంటి సద్గుణాలను కూడా అలవరచుకోవాలి.అలాగే వేదాంత ధోరణి , పరోపకార  నైజం , ఇలాంటి గుణాలు కూడా , జీవితార్ధాన్ని , జీవిత పరమార్ధాన్ని  మనకు ఎప్పటికప్పుడు తెలియ చేస్తూ , అధికానంద హేతువు అవుతాయి.  నిరంతరం విజ్ఞానాన్ని పెంపొందించు కోవాలనే తృష్ణ , జిహ్వ కూడా అధికానందం పొందడానికి దోహద పడతాయి.  


కామెంట్‌లు