ఓ మూర పువ్వులు చాలు!;- - యామిజాల జగదీశ్
చాలా కాలం క్రితం చెన్నై సచివాలయంలో పని చేసిన ఓ ఐఎఎస్ అధికారి కంచి పరమాచార్య దర్శనం కోసం వెళ్ళినప్పటి సంఘటన ఇది.
తన కింద పని చేసే సిబ్బందితో తాను కాంచీపురం వెళ్ళడానికి, పరమాచార్యను దర్శించి ఆశీస్సులు పొందడానికి ఏర్పాట్లు చేయమని సదరు ఐఎఎస్ అధికారి ఆదేశించారు. 
వేల రూపాయలకు పండ్లు,.పువ్వులు, పూజాసామాన్లను సిబ్బంది ద్వారా కొనిపించారు. 
నిర్ణయించుకున్న తేదీన ఆ అధికారి కొనుగోలు చేసిన ఈ పూజాద్రవ్యాలతో కంచి పరమాచార్య వద్దకు వెళ్ళారు. తాను తీసుకొచ్చిన వాటిని పరమాచార్య ముందర ఉంచి నమస్కరించారు.
అప్పుడు పరమాచార్య వాటిని చూసి తన శిష్యులతో అక్కడి నుంచి తీసేయమని చెప్పారు.
అనంతరం పరమాచార్య ఐఎఎస్ అధికారితో "మీ కింద పని చేసే వారితో ఇంత ఖర్చు ఎందుకు పెట్టించారు? వారెవరూ ఇవన్నీ ఇష్టపడి కొనుగోలు చేసి ఉండరు. మీరు ఓ మూర పువ్వులు కొనుక్కొచ్చినా సరిపోయేది. ఇది కూడా ఓ విధంగా లంచమే అవుతుంది. ప్రభుత్వాధికారియైన మీరే ఈ పని చేయవచ్చునా?" అని ప్రసాదం ఇచ్చారు.
 

కామెంట్‌లు