ఆత్మ సాక్షాత్కారం విశిష్టత; - సి.హెచ్.సాయిప్రతాప్
 ఆత్మ అనేది ఒక వస్తువు కాదు. దర్శించడానికి అది దృశ్యమూ కాదు. అది మనచే చూడబడే వస్తువే అయితే.. అది పరిమితమైనదే అవుతుంది. పరిమితమైనది ఎప్పటికైనా నశించాల్సిందే కదా. కాని వేదాలచే నిర్వచించబడిన ఆత్మ అపరిమితమైనది. అది ఏకం, అద్వయం, సర్వవ్యాపకం. అది మనకన్నా వేరు కాదు. కనుక మనం దాన్ని వేరుగా దర్శించలేం. అదై మన హృదయస్థానంలోనే కొలువైవుంది. తల్లి గర్భంలో పిండం రూపుదిద్దుకున్నప్పుడే ప్రవేశించే ఆత్మ వెలుగు రూపంలో సదా కొలువై వుండి, చివరికి జీవుడి ఆఖరు శ్వాసతో శరీరం నుండి నిష్క్రమిస్తుంది.  ఆత్మ దర్శనం అంటే.. అది ‘నేనే’ అని అనుభవం కలుగుతుందంటే.కేవలం యోగులకే కాక, సంసారిక జీవనంలో వున్నవారికి కూడా ఆత్మ సాక్షాత్కారం సాధ్యం అని అనేక మహర్షుల జీవిత చరిత్రలు మనకు చెబుతున్నాయి.
ఆత్మసాక్షాత్కారం అంటే సర్వం ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకోవడం.ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మని పరమాత్మతో ఒక్కటి చెయ్యటం.ఆత్మ సాక్షాత్కారం అంటే మూలాధారచక్రంలో ఉన్న కుండలి శక్తిని మేల్కొలిపి ఆ ప్రాణశక్తిని ఆజ్ఞాచక్రం దాటి సహస్రారమునకు చేర్చడం అని యోగశాస్త్రం బోధిస్తోంది.
సృష్టి స్థితి లయములో స్థితి శాశ్వతమైనది అదే పరబ్రహ్మ స్వరూపమైన శూన్యస్థితి.అంటే నిరాకార పరబ్రహ్మమే శాశ్వతమైన స్థితిని పొందుతున్నాడు మిగిలినది అది ఏదైనా సరే అశాశ్వతమే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిజమైన ఆత్మసాక్షాత్కారము.ప్రతీ జీవి పరమాత్మ (నీ యొక్క) స్వరూపమే అనే సత్యాన్ని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారము
ఆత్మ సాక్షాత్కారికి నిరంతర , కఠోర సాధన ఎంతో అవసరం. చిత్తవృత్తిని నిరోధం చేసినవాడే యోగి అవుతాడు. సత్యాన్ని ప్రదర్శించేవాడే ద్రష్ట అవుతాడు. స్వానుభవం ద్వారానే ఆత్మ సాక్షాత్కారం పొందుతాం. మానవులలో ఎవరైతే ధ్యానం చేసి దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుంటారో అతనే’ శివుడు ‘. స్నానం ద్వారా దేహశుద్ధి కలుగుతుంది; పానం ద్వారా దాహం తీరుతుంది. మంత్రం ద్వారా ఉచ్చారణ సరిగ్గా వుండి వాక్కు పటిష్టం అవుతుంది. ధ్యానం ద్వారా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది.

కామెంట్‌లు