ఒకూర్లో నలుగురు అమాయకులున్నారు. వాళ్ళకు ఏమీ తెలీదు. మనమొకటి చెప్తే వాళ్ళొకటి చేస్తా వుంటారు. ఆ ఊర్లోనే ఒక పెద్ద పిసినారి వున్నాడు. వానికి పైసా పైసా దాచిపెట్టడమే తప్ప ఖర్చు పెట్టడం తెలీదు. వానికి ఒక పెద్ద అంగడుంది. చానా పశువులున్నాయి. దాండ్లను చూసుకోడానికి ఎవరినయినా పనికి పెట్టుకోవాలనుకున్నాడు. కానీ ఎవరయినా సరే పొద్దున్నించీ రాత్రి వరకు పని చేయాలంటే డబ్బులు ఎక్కువడుగుతారుగదా... దాంతో ఎట్లాగబ్బా అని ఆలోచిస్తా వుంటే ఈ నలుగురు కనబన్నారు. వీళ్ళయితే మారు మాట్లాడకుండా గమ్మున ఏమి పెడితే అది తిని, ఎంతిస్తే అంత తీసుకోని మట్టసంగా చెప్పిన పని చేస్తా వుంటారు అనుకోని వాళ్ళని తెచ్చి పనిలో పెట్టుకున్నాడు.
ఒకరోజు నలుగురినీ పిలిచి “రేయ్.. ఈ రోజు మీకు నలుగురికీ నాలుగు పనులు చెప్తా, పోయి చేసుకోని రాపోండి" అని ఒకనికేమో మేకలు తీసుకోని పోయి అడవిలో మేపుకోని రమ్మన్నాడు.
రెండోవానికేమో పక్కూరికి పోయి కట్టెలు కొనుక్కోని బండి నిండా ఏసుకోని రమ్మన్నాడు.
మూడోవానికేమో వాళ్ళ అత్తోళ్ళ ఊరికి పోయి
నెయ్యి డబ్బా తీసుకోని రమ్మన్నాడు. నాలుగో వానికేమో 'మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదు. దగ్గర కూచోని బాగా చూసుకో' అన్నాడు.
నలుగురూ “సరే” అన్నారు.
మొదటోడు సద్ది కట్టుకోని మేకలన్నీ తోలుకోని అడవికి పోయినాడు. మధ్యాన్నం వరకూ దాండ్లను బాగా మేపి ఆకలయితా వుంటే అన్నం తిందామని ఒక బావి గట్టున కూచోని మూటిప్పినాడు.
ఆ బావిలో కప్పలు కుప్పలు కుప్పలున్నాయి. అవి వీన్ని చూస్తానే బెదపడి బెకబెకమని గట్టిగా అరవసాగినాయి. అది విని వాడు "అరెరే.. దీండ్లకు కూడా బాగా ఆకలవుతున్నట్టుంది. అందుకే అన్నం తింటా వుంటే మాకు కూడా పెట్టమని ఒకటే అరుస్తా వున్నాయి" అనుకోని "ఇదుగోమ్మా... తీసుకోండి" అంటూ అన్నమంతా బావిలోకేసినాడు.
దబ్బున అన్నం లోపలికి పడేసరికి అవి మరింత బెదపడి మరింత గట్టిగా బెకబెకమని అరవసాగినాయి. అది విని వాడు “అరెరే... దీండ్లకు ఇదింత అన్నం సరిపోనట్టుంది. అందుకే పాపం అట్లా అరుస్తా వున్నాయి" అనుకోని ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా వుంటే ఎదురుగా మేకలు కనబన్నాయి.
“వుండండి... మీ కడుపు నిండా అన్నం పెడతాను" అని వురుక్కుంటా పోయి ఒక మేకను ఎత్తుకోనొచ్చి దభీమని బావిలోకి ఏసినాడు. కప్పలు బెదపడి మరింత గట్టిగా అరవసాగినాయే తప్ప నోరు మూసుకోలేదు.
"అరెరే... దీండ్లకింకా ఆకలి తీరినట్లు లేదే... ఎన్ని రోజులైందో ఏమో అన్నం తిని" అనుకోని ఒకొక్క మేకనే ఎత్తి ధనాధనా ఏయసాగినాడు.
నీళ్ళలో పడిన మేకలన్నీ ఊపిరాడక చచ్చిపోయినాయి. మేకలన్నీ ఒకదాని మీదొకటి పడి కప్పలన్నీ చచ్చిపోయినాయి. దాంతో అరుపులాగి పోయినాయి. దాంతో వాడు “హమ్మయ్య... దాండ్ల కడుపు నిండినట్టుంది. అందుకే అన్నీ మట్టసంగున్నాయి." అనుకోని వుత్త చేతులూపుకుంటా ఇంటికి బైలుదేరినాడు.
రెండోవాడు పక్కూరికి పోయి కట్టెలు కొనుక్కోని బండి నిండా నింపుకోని తిరిగి రాసాగినాడు. అట్లా వస్తావుంటే దారిలో ఒకచోట చానా పైకి ఎక్కాల్సొచ్చింది.
ఎత్తు మీదికి పోవడం కష్టం గదా... దాంతో ఎద్దులు లాగలేక లాగుతా వుంటే బండిగాన్లు కిర్రు కిర్రుమని అరవసాగినాయి. ఆ చప్పుడు విని వాడు “అరెరే... బండి కట్టెలు మోయలేక ఏడుస్తా వుంది" అనుకోని కిందికి దిగి "లేదులేమ్మా... లేదులే... ఏద్చొద్దు. కొన్ని తీసేస్తాలే" అంటూ సగం కట్టలు తీసేసి మళ్ళా పోతావుంటే కాసేపటికి అది మళ్ళా కిర్రుకిర్రు మనింది. వాడు దిగి "సర్లే... సర్లే... మొత్తం తీసేస్తాలే.. ఏడవద్దు" అంటూ కట్టెలన్నీ తీసి పారేసినాడు.
బరువు తగ్గిపోవడంతో బండి చప్పుడు చేయకుండా ఎప్పట్లాగే మాములుగా రాసాగింది. “హమ్మయ్య.. బండి ఏడుపు మానేసింది" అనుకోని వాడు వుత్త బండితో ఇంటికి బైలుదేరినాడు.
మూడోవాడు పక్కూరికి పోయి పిసినారి వాళ్ళ అత్తోళ్ల ఇంట్లో నెయ్యిడబ్బా తీసుకోని తిరిగి బైలుదేరినాడు. ఏ వస్తువైనా సరే మొదట్లో బరువుగా అనిపించదుగానీ మోస్తా మోస్తా వుంటే బరువు పెరిగి పోతున్నట్లుగా అనిపిస్తాది గదా... అది తెలియని వాడు “అరెరే... ఇదేంది మొదట్లో కొంచెం గూడా బరువు లేదు. సగం దారికొచ్చినానో లేదో ఇంత బరువెక్కింది. కొంపదీసి డబ్బాలోకి ఏమైనా దూరిందా ఏమి" అనుకోని డబ్బా దించి తెరచి చూసినాడు. నెయ్యిలో వాని నీడ వానికే కనబడింది. అది చూసి వాడదిరిపడి "అమ్మో... ఏమో అనుకుంటేగానీ... ఈ డబ్బాలో దయ్యం దూరింది. అందుకే ఇంత బరువైంది" అనుకోని ధడాలున మూత మూసేసి ఎత్తుకొని పోయి ఒక పెద్ద చెరువులో పడేసి “హమ్మయ్య... దయ్యం పీడ వదిలి పోయింది" అనుకోని వుత్తచేతులూపుకుంటా ఇంటికి బైలుదేరినాడు.
నాలుగోవాడు పిసినారి అమ్మ దగ్గరనే కూచోని విసనకర్ర వూపుతా... ఏమి కావాలంటే అది అందిస్తా, సేవలు చేస్తా జాగ్రత్తగా చూసుకోసాగినాడు. కాసేపటికి ఆమె నిదురపోయింది. అంతలో ఒక ఈగ గుయ్ మని అరుస్తా వచ్చి ఆమె మీద వాలింది. అది చూసి వాడు “అరెరే... పాపం ముసల్ది నిద్రపోతా వుంటే ఇదొచ్చి సతాయిస్తా వుందే" అని తోలేసినాడు. అది అట్లా పక్కకు పోయినట్లే పోయి మళ్ళా గుయ్ మని అరుస్తా వచ్చి వాలింది.
వీడు తోలడం మళ్ళా అది రావడం.
కాసేపటికి వానికి బాగా కోపమొచ్చేసింది. “దొంగ సచ్చిందానా... ఎన్నిసార్లు తోలినా మళ్ళా మళ్ళా వస్తావా... వుండు నీ పని చెప్తా” అంటూ ఇంట్లోంచి రోకలిబండ తీసుకోనొచ్చి నిలబన్నాడు. ఈగ మళ్ళా ఎప్పట్లాగే గుయ్ మని అరుస్తా వచ్చి ఆమె మూతి మీద వాలింది.
అంతే! వాడు కోపంగా రోకలిబండ పైకెత్తి ఒక్క పెరుకు పెరికినాడు. ఆ దెబ్బకు ఈగకేమీ కాలేదు గానీ ముసల్ది మాత్రం మూతి పగిలి సక్కగా స్వర్గాని కెళ్ళి పోయింది.
పిసినారి వచ్చి చూస్తే ఇంకేముంది. తల్లి పోయింది. మేకలూ పోయినాయి. నెయ్యీ పోయింది. కట్టెలూ పోయినాయి.
'పీనాసితనంతో తెలిసి తెలిసీ మీలాంటోళ్ళను పెట్టుకున్నందుకు నాచెప్పుతో నేనే కొట్టుకోవాల' అనుకుంటా వాళ్ళందరినీ ఇంట్లోంచి తరిమేసినాడు.
***********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి