గణపతిముని "రమణగీత";- - యామిజాల జగదీశ్


 కావ్యకంఠ గణపతి ముని మహాపండితులు. అనుకున్న క్షణాన కవిత్వాన్ని రాయగల, చెప్పగల ప్రజ్ఞ ఆయనది. అనేక గ్రంథాలు రాశారు.పలు భాషలు మాట్లాడగలరు. కఠోర తపస్సు చేశారు. కీర్తి ప్రతిష్ఠలు గడించారు.
అంతటి మహత్తర మనిషికి ఓ సందేహం మాత్రం ఉంటూనే ఉండేది. ఆ ప్రశ్నకు జవాబుకోసం ఆయన తిరగని చోటంటూ లేదు.
1907లో ఆయన తిరువణ్ణామలైకి వెళ్ళారు.
గిరిప్రదక్షిణం చేసే మార్గంలో ఓ మండపంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకు మెరుపులాంటి మాట మెరిసింది. "భగవాన్ పిలుస్తున్నారు" అనేదే ఆ మెరుపు మాట.
వెంటనే లేచారు. వేగంగా నడిచారు. అరుణాచలేశ్వరుడి ఆలయ వీధికేసి అడుగులు సాగించారు.
మార్గమధ్యంలో భగవంతుడికి నమస్కరించారు. తన దీర్ఘకాల ప్రశ్నకు జవాబు దొరుకబోతోంది అని ఆయన గ్రహించారు.
చకచకమని కొండ ఎక్కారు. ఎండ దంచేస్తోంది.కానీ అదేమీ ఆయన పట్టించుకోలేదు. విరూపాక్ష గుహకు చేరుకున్నారు.
గుహ ముందర భగవాన్ రమణమహర్షి ఒంటరిగా కూర్చుని ఉన్నారు. గణపతి ముని రమణులవారికి సాష్టాంగ నమస్కారం చేశారు.తన రెండు చేతులతో భగవాన్ పాదాలను పట్టుకున్నారు. కన్నీళ్ళు కారుతున్నాయి.
"నేర్చుకోవలసినవన్నీ నేర్చుకున్నాను. తెలుసుకోవలసినవన్నీ తెలుసుకున్నాను. వేదాంత శాస్త్రాలనూ చదివాను.మంత్రొలనూ జపించాను. కానీ మనసు దేనికోసమో తహతహలాడుతోంది. అణచుకోలేకపోతున్నాను. తపస్సంటే ఏమిటో సరిగ్గా తెలియడం లేదు. కనుక మీ పాదపద్మాలకు శరణు శరణు. మీరే చెప్పాలి జవాబు" అని అన్నారు గణపతి ముని.
భగవాన్ కావ్యకంఠ గణపతి ముని వంక తదేకంగా చూశారు. అలా చాలాసేపు చూశారు. అదేదో మామూలుగా చూడటం కాదు. చూపులతోనే జవాబు చెప్పగల శక్తి భగవాన్ కు ఉంది. అలా చూపులతోనే చెప్పిన జవాబు చెప్పిన తర్వాత భగవాన్ ఉపదేశించారు.
"నేను అనేది ఎక్కడి నుంచో వస్తోందో దానిని గమనిస్తే మనసు అక్కడ ఉండిపోతుంది. అదే తపస్సు. ఓ మంత్రాన్ని జపించేటప్పుడు మంత్ర ధ్వని (నాదం) ఎక్కడి నుంచి వస్తోందో గమనిస్తే మనసుఅక్కడ ఐక్యమవుతుంది. అదే తపస్సు" అన్నారు భగవాన్. 
కావ్యకంఠ గణపతి ముని కళ్ళు ఆనందబాష్పాలతో చెమ్మగిల్లాయి. ఆయన దీర్ఘకాల సందేహానికి జవాబు లభించిందన్న ఆనందం. తృప్తి. ఆయన సందేహాలన్ని తొలగిపోయాయి.
ఆరోజు విరూపాక్ష గుహలోనే భగవాన్ తోనే ఉన్నొరు.అప్పటివరకు బ్రాహ్మణస్వామిగా అందరూ పిలిచిన రమణులవారిని "భగవాన్ శ్రీ రమణమహర్షి" అని పిలవాలని చెప్పారు గణపతి ముని. అలా ఆయనను ఆరోజు నుంచి భగవాన్ రమణమహర్షి అని పిలవటం మొదలైంది.
అవును, విరూపాక్ష గుహే మొదటగా ఆ నామాన్ని మొదటి చోటు. పుణ్యభూమి. ఇక్కడే  శ్రీ రమణ మహర్షి చాలా సంవత్సరాలు నివసించారు. భగవాన్ ఈ గుహలో 1899 నుండి 1916 వరకు సుమారు 17 సంవత్సరాలు ధ్యానం చేశారు. ఇప్పటికీ ప్రజలు ఈ గుహలో ధ్యానం చేయడానికి వస్తుంటారు. ఈ గుహ  ప్రసిద్ధ అరుణాచల కొండ తూర్పు భాగాన  పరిపూర్ణ 'ఓం' ఆకారంలో ఉండే ఒక ఆశ్రమం. ఇది స్కందాశ్రమం గుహకి దిగువన ఉన్న చిన్న శిఖరంపై ఉంది. విరూపాక్ష గుహకు చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి రమణ ఆశ్రమం ద్వారా. తిరువణ్ణామలై ఆలయం నుండి గుహ వరకు నడవడం మరొక విధానం.. ధ్యానం చేయడానికి అత్యంత అనువైన ప్రదేశం. 
అప్పటికే తనకంటూ కీర్తిప్రతిష్ఠలు పొందిన గణపతిముని రాక తర్వాత భగవాన్ ని చూడటానికి భక్తులరాక ఎక్కువైంది.
వారికి భగవాన్ చెప్పిన జవాబులను క్రోడీకరించి సంస్కృతంలో శ్లోకాలను రాసింది ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు, సాక్షాత్తూ కావ్యకంఠ.గణపతిమునే!
రమణ గీత అనే పేరిట ఓ మహత్తరమైన పుస్తకంగా పాఠకలోకానికి అందించింది ఆయనే. 
గణపతి ముని రచనల్లో రమణగీత కాకుండా ఉమాసహస్రం, ఇంద్రాణీ సప్తశతి, ఉమాశతకం, దశమహావిద్యలు వంటి గ్రంథాలెన్నో ఉన్నాయి. 
తీవ్ర తపోకాంక్షతో అరుణాచలం చేరిన గణపతి మునిని చూసి  భగవాన్ తమ దీర్ఘకాలిక మౌనాన్ని వీడి ‘నాయనా‘ అని ఆదరంగా పిలిచారు.
ఓం నమో భగవతే! శ్రీరమణాయ!!


కామెంట్‌లు