గజకర్ణ,గోకర్ణ విద్యలు
================
మోసం చేయడంలో ఒకరికి మించిన విద్యలు మరొకరికి తెలిసి ఉంటే వాటిని గజకర్ణ, గోకర్ణ విద్యలు అంటారు. అంటే తెలివేవరి సొత్తు కాదు, తాటి చెట్టు ఎక్కేవాడు ఉంటే తలదన్నే వాడు ఉంటాడు అన్నట్టు ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటే వారిని గజకర్ణ గోకర్ణలు అనడం నానుడిగా వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మోసం చేసే విద్యలనే గజకర్ణ గోకర్ణ విద్యలు అంటారు. మరి ఈ నానుడి ఎలా వచ్చిందో చూద్దాం.
ఇది చందమామ కథలు నుండి వచ్చినట్టు తెలుస్తోంది. గజకర్ణ గోకర్ణ విద్యలు అనే కథలో ఇద్దరు మోసగాళ్ళు ఒకరినొకరు మోసం చేసుకుంటూ చదువరులకు వినోదం పంచుతుంటారు. ఆ కథే పేరే నానుడిగా స్థిరపడినట్టు తెలుస్తోంది
పూర్వము గజకర్ణ అనే గజదొంగ ఉండేవాడు. వాడు నడుచుకుంటూ అడవిలో వెళుతుంటే దారిలో వాడికి గోకర్ణ అనే మరో గజదొంగ కలుస్తాడు. వీరిద్దరి వీపుల మీద దొంగిలించిన సొమ్మువుంది. ఒకరికొకరికి వీరెవరో తెలియదు. కాబట్టి ఒకరి సొమ్ము ఒకరు దొంగిలించుకోవాలని ఎత్తులు వేస్తారు. ఒక బావి దగ్గర మూటలు దించి మంచినీరు త్రాగి కావాలనే మూటలు మార్చుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. గమ్యస్థానం చేరి మూటలు విప్పి చూస్తారు. ఇంకేముంది ఒకడి మూటలో మట్టి, ఇంకొకడి మూటలో ఇసుక ఉంటాయి.
ఇంకో పర్యాయం వీరిద్దరూ మరో సందర్భంలో కలుస్తారు. అప్పుడే ఆ వూరి షావుకారు చనిపొతే అతనిని చితి మంటల్లో కాలుస్తూ వుంటారు. గజకర్ణకు ఓ ఉపాయం వస్తుంది. అది షావుకారు ఇంట్లో డబ్బులు కాజేయాలనే ఉపాయం. దాన్ని గోకర్ణకు చెబుతాడు. సరే అంటాడు గోకర్ణ. స్మశానం నుండి వారు వెళ్లిపోగానే అక్కడ ఓ గుంత తీసి అందులో గోకర్ణను కూర్చోబెట్టి గాలి ఆడేటట్టుగా మట్టితో పూడుస్తాడు. షావుకారు ఇంటికి వెళ్లి "నాకు షావుకారు వెయ్యి వరహాలు ఇవ్వాలి" అని అడుగుతాడు. "మేం నిన్ను నమ్మేది ఎలా?" అంటారు షావుకారు కుటుంబ సభ్యులు. రండి ఆయన్నే అడుగుదాం అని చితి కాలిన ప్రాంతానికి తీసుకువెళ్లి "షావుకారు గారు! మీరు నాకు వెయ్యి వరహాలు ఇవ్వాలి కదా?" అని అరుస్తాడు గజకర్ణ. "అవును! అవును" అంటాడు గుంతలో ఉన్న గోకర్ణ. నిజమే అనుకుని వెయ్యి వరహాలు ఓ బస్తాలో వేసి ఇస్తారు కుటుంబసభ్యులు. ఇక గజకర్ణ వాటిని తీసుకుని గుంతలో ఉన్న గోకర్ణను బయటకు తీయకుండా వెళ్ళిపోతాడు.
గోకర్ణ తనకున్న టక్కుటమార విద్యలతో ఎలాగో బయటకు వస్తాడు. షావుకారు గారి విలువైన చెప్పులు అక్కడ పడివుంటే వాటిని తీసుకుని పరుగున వెళతాడు. గజకర్ణకు కనబడకుండా ఓ చెప్పును అతడి మార్గంలో వేసి పొదల్లో దాగి ఉంటాడు. గజకర్ణ దాన్ని చూసి ఒక చెప్పేగా అని వదిలేసి వెళతాడు. గోకర్ణ పరుగున ముందుకువెళ్లి ఇంకో చెప్పు వేసి దాకుంటాడు. గజకర్ణ కు ఈ చెప్పు కూడా కనిపిస్తుంది. అప్పుడు గజకర్ణ మొదటి చెప్పు కోసం మూటను బాట పక్కన పెట్టి వెనకకు వెళతాడు. నక్కలా పక్కన నక్కివున్న గోకర్ణ ఆ మూటను తీసుకుని ముందుకు వెళ్లి ఓ గడ్డివామిలో దాక్కుంటాడు. ఇది గోకర్ణ పనే అని గజకర్ణ గ్రహిస్తాడు. వెదుకుతూ ముందుకు వెళ్లి గడ్డివామిలో దాగిన గోకర్ణని కనుగొంటాడు. ఇక తప్పక ఇద్దరు సొమ్మును చేరి సగం పంచుకుంటారు. అంతటితో ఈ కథ అయిపోలేదు. ఒకరి వరహాలు ఒకరు ఎలా కాజేయాలా అని ఒకరికొకరు పధకం వేసుకుంటూ వుంటారు.....
ఇది ఈ గజకర్ణ , గోకర్ణ కథ. నేను ఈ కథను రెండు ఉదహరణలతోనే చెప్పాను. కానీ ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి. అవన్నీ చెప్పాలంటే ఓ నవలే రాయవొచ్చు. ఈ కథలతో 'చిక్కడు దొరకడు' అనే సినిమా కూడా తీసారట. ఈ హాస్య కథ ఎవరు రాశారోగానే అప్పట్లో ఎవరి నోటవిన్న ఈ గజకర్ణ, గోకర్ణ గురించే చెప్పుకునే వారట. అప్పటి నుండి ఇలాంటి విషయాలు జరిగితే 'గజకర్ణ గోకర్ణ విద్యలు' అనటం పరిపాటి అయింది. అలా అలా ఈ కథ నానుడిగా మారి మన నానుడి కథలలోకి వచ్చేసింది.
నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి