మరణ లోయ (USA)- తాటి కోల పద్మావతి

 ఈ మరణ లోయ అపరిమితమైన వేడితో ఎంతో పొడిగా కూడా ఉంటుంది. మట్టి రేణువులలో గాలి జ్వలించిపోతున్నట్లుగా ఉంటుంది. వేసవికాలంలో ఉష్ణోగ్రత 120 ఫారన్ హీట్ కంటే ఎక్కువగానే ఉంటుంది. అమెరికాలోనే ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రత ఈ ఎడారి లోయలోని గ్రీకురాంచి కొలిమి అనే ప్రాంతంలోనే నమోదయింది. ఈ ఎడారిలో వీచే తడిగాలులు రాకముందే వర్షం గా కురుస్తాయి. అందుచేత అవి ఈ ఎడారిలోయని చేరే సమయానికి పొడిగా ఉండే వేడిగాలి మాత్రం మిగిలిపోతుంది. ఇంత కష్టమైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న ఈ ఎడారి లోయలో ఒకప్పుడు మనుషులు హాయిగా నివసించడం జరిగింది. తత్వవేత్తలు పురాతత్వవేత్తలు ఈ ఎడారి లోయలోని అన్ని ప్రాంతాల్లో శిలా చిత్రలేఖనాలు, పొయ్యిలు, మానవ నివాసాలకి సంబంధించిన అనేక అవశేషాలు కనుగొన్నారు.
మరణ లోయ జాతీయ పార్కులో సంభ్రమాన్ని కలిగించే అనేక ప్రకృతి రూప రేఖలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎంతో చక్కటి పేర్లు ఇవ్వబడ్డాయి.
క్రీస్తు శకం 19 13వ సంవత్సరంలో జూలై 10న అమెరికాలోనే అత్యధిక ఉష్ణోగ్రత అయిన 130 ఫారెన్ హీట్ నమోదు చేసిన వాతావరణ కేంద్రం ఇక్కడే ఉంది.
పెద్ద పెద్ద బండలు కంటికి కనిపించని రాక్షసహస్తం ఏదో తనతో తీసుకు వెళుతున్నట్లుగా వేడి ఇసుకలో నుంచి గులకరాళ్ళలో నుంచి కదిలిపోతూ జారిపోతూ కనిపిస్తాయి. బలమైన గాలులు వీచినప్పుడు గాలుల వల్ల ఈ బండలు మెత్తటి తడి ఇసుక మీద ముందుకు కదిలిపోతుంటాయి.
మరణ లోయ అనే పేరు దీనికి ఎంతో విషాన్ని మిగిల్చిన ఒక ప్రమాదం వల్ల వచ్చింది. క్రీస్తు శకం 18 49వ సంవత్సరంలో కాలిఫోర్నియా'బంగారు పరుగు'జరిగిన సమయంలో దాదాపు 50 మందితో కూడిన ఒక బృందం బంగారపు గనుల్ని తొందరగా చేరాలనే ఆరాటంతో వారికి ఏమాత్రం పరిచయం లేని ఈ లోయ గుండా ప్రయాణించారు. ఈ బృందంలోని చాలామంది ఈ ప్రాంతంలో ఉండే విపరీతమైన వేడి వల్ల దేహ నిర్జలీకరణంతో చనిపోయారు.ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత దీనికి మరణ లోయ అనే పేరు స్థిరపడిపోయింది.
ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షల మంది ఈ మరణ లోయ జాతీయ పార్కును చూడటానికి వస్తుంటారు.

కామెంట్‌లు