నిజాయితీ- ఎం.వరుణ్,-10వ.తరగతి,-తెలంగాణ ఆదర్శ పాఠశాల,-బచ్చన్నపేట మండలం,-జనగామ జిల్లా.

 కొండాపురం అనే గ్రామంలో కొమురయ్య,భీమయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు.వీరి జీవనాధారం చేపల వేట.ఆ ఊరి చెరువులో చేపలు పట్టుకొచ్చి చుట్టు పక్కల ఊర్లలో అమ్మి సంతోషంగా జీవనం సాగిస్తుండేవారు.ఒకరోజు అనారోగ్య కారణాలవల్ల కొమురయ్య చెరువుకు వెళ్లలేదు.భీమయ్య ఒక్కడే చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతున్న భీమయ్యకు చెరువులో ఒక పెద్ద పెట్టెలో బంగారం దొరుకుతుంది.దానిని అతడు ఎవరికి చెప్పకుండా ఇంటికి తీసుకువెళ్లి కొంత కొంత తన ఇంటి ఖర్చులకు ఉపయోగించుకునేవాడు. అలా కొద్ది కాలంలోనే పెద్ద ధనవంతుడు అవుతాడు. చేపల వేటను కూడా మానివేస్తాడు.తనలో అహంకారం పెరుగుతుంది. తన స్నేహితునితో కూడా సరిగా మాట్లాడేవాడు కాదు. భీమయ్య వచ్చిన మార్పును చూసి కొమురయ్య చాలా బాధపడ్డాడు.కానీ ఎప్పటిలానే
కొమురయ్య ఒంటరిగా చేపల వేటకు వెళ్లేవాడు.
చేపలు అమ్మగా వచ్చిన డబ్బుతో నిజాయితీగా సాధారణ జీవితం గడిపేవాడు.ఒకరోజు కొమురయ్యకు కూడా చేపలు పట్టుతుండగా ఒక బంగారపు పాత్ర దొరికితే దాన్ని ఆ దేశపు రాజుకు ఇస్తాడు.మహారాజు అతని మంచితనానికి మెచ్చి ఏదైనా కోరుకో ఇస్తానంటాడు.నాకు అవసరం ఉన్నప్పుడు అడిగి తీసుకుంటానని చెప్తాడు. రాజు సంతోషించి అతనికి కావాల్సినంత డబ్బు ఇచ్చి పంపిస్తాడు.కొమురయ్యకు కావలసినంత డబ్బు ఉన్నా, తన జీవనాధారమైన చేపల వేటకు వెళుతూ భార్య పిల్లలతో సంతోషంగా బతికేవాడు.కొన్ని రోజులకు చుట్టుపక్కల వారి ద్వారా భీమయ్యకు అంత ఆస్తి ఎలా వచ్చిందో రాజు తెలుసుకుంటాడు.తనకు చెప్పకుండా ధనాన్ని అనుభవిస్తున్నందుకు అతనిని బంధించి తీసుకురమ్మని భటులు చెప్తాడు.ఈ విషయం తెలుసుకున్న కొమురయ్య రాజు దగ్గరికి వెళ్లి తన స్నేహితుని క్షమించమని అడుగుతాడు.రాజు కొమురయ్య నిజాయితీ, మంచితనానికి మెచ్చుకొని భీమయ్యను దండించకుండా వదిలిపెడతాడు.మనం బతికినంత కాలం నీతి నిజాయితీలతో బతకాలి. ధనానికి కాకుండా మనుషులకు విలువనివ్వాలి.పదిమందికి సహాయపడాలి.సంతోషంగా జీవించాలి
కామెంట్‌లు